‘బాబర్‌ కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తాం..’: ముల్తాన్‌ టెస్టులో పాక్‌ అభిమానుల సందేశం

ముల్తాన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పలువురు పాక్‌ అభిమానులు కింగ్‌ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Updated : 13 Dec 2022 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ముల్తాన్‌ వేదికగా ఇంగ్లాండ్‌(England)తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్‌ (pakistan)26 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పలువురు పాక్‌ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వారు పాక్‌ ఆటగాళ్లకు కాకుండా..భారత క్రికెటర్‌ కింగ్‌ కోహ్లీ(Virat Kohli)కి మద్దతు తెలపడం గమనార్హం. తమ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(Babar Azam)కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పడం విశేషం. పాక్‌లోని కోహ్లీ అభిమానులు ఇలా తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఓ కారణముంది.. అదేంటంటే..?

పాక్‌లో వచ్చే ఏడాది నిర్వహించే ఆసియా కప్‌(Asia Cup 2023)పై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాక్‌లో భారత్‌ పర్యటించేది లేదని గతంలో బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. దీనిపై పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రజా స్పందిస్తూ.. టీమ్‌ఇండియా(Team India) పాక్‌లో పర్యటించకపోతే.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడబోదని హెచ్చరించాడు. ఆ తర్వాత ఇదే అంశంపై భారత క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ కూడా స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ముల్తాన్‌ టెస్టు వేదికను పాక్‌లోని కోహ్లీ అభిమానులు ఉపయోగించుకున్నారు.

‘‘హాయ్‌.. కింగ్‌ కోహ్లీ.. పాక్‌ వచ్చి ఆసియా కప్‌ ఆడు’’, ‘‘మా కింగ్‌ బాబర్‌ కంటే మేం మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాం’’ అంటూ మ్యాచ్‌ మధ్యలో అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని