WI vs NZ: టీ20 వరల్డ్‌ కప్‌ సూపర్ - 8కి విండీస్‌.. ఇక ఇంటికే కివీస్‌!

టీ20 ప్రపంచ కప్ సూపర్ - 8 దశకు చేరుకొనే అవకాశం న్యూజిలాండ్‌ జట్టుకు దాదాపు చేజారినట్లే. కీలకమైన పోరులో విండీస్‌ చేతిలోనూ ఓటమితో కివీస్‌ కుదేలైంది.

Updated : 13 Jun 2024 13:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ అద్భుత ప్రదర్శన చేస్తుంది. కానీ, ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో కివీస్‌కు ఏదీ కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన కివీస్‌కు.. కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. ఆతిథ్య దేశం విండీస్‌ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ కివీస్‌పై విజయం సాధించింది. దీంతో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన వెస్టిండీస్‌ ‘సూపర్ -8’కు చేరుకుంది. వరుసగా రెండు ఓటములతో కివీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. 

అదరగొట్టిన రూథర్‌ఫోర్డ్‌, అల్జారీ జోసెఫ్

కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక్కడి పిచ్‌లపై ఇది భారీ స్కోరే. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (68: 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ 136/9 స్కోరుకే పరిమితమై 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లెన్‌ ఫిలిప్స్ (40), మిచెల్ సాంట్నర్ (21 నాటౌట్: 12 బంతుల్లో 3 సిక్స్‌లు), ఫిన్‌ అలెన్ (26) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. అల్జారీ జోసెఫ్‌ (4/19), మోతీ (3/25) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌కు అడ్డుకట్ట వేశారు. 

కివీస్‌ కష్టమే..

ప్రస్తుతం గ్రూప్ - Cలో విండీస్‌ 3 మ్యాచుల్లో 6 పాయింట్లు, +2.596 నెట్‌రన్‌రేట్‌, అఫ్గానిస్థాన్‌ రెండు మ్యాచుల్లో 4 పాయింట్లు, +5.225 నెట్‌రన్‌రేట్‌తో తొలి రెండు స్థానాల్ల్లో ఉన్నాయి. ఒకవేళ కివీస్‌ (-2.425) తన చివరి మ్యాచుల్లోనూ గెలిచినా అఫ్గాన్‌ రన్‌రేట్‌ను అధిగమించడం చాలా కష్టం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని