Jasprit Bumrah: ఆ ఒక్కటి మార్చుకోవద్దు..: బుమ్రాకు విండీస్ స్టార్‌ కీలక సూచన

వైవిధ్యమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న బుమ్రా.. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌లోనూ కీలక వికెట్లు తీస్తున్నాడు. భారత విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు.

Published : 20 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టీ20 ప్రపంచ కప్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ వికెట్లు తీస్తున్నాడు. భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రాపై విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్ ప్రశంసలు కురిపించాడు. తాను అతడికి పెద్ద అభిమానిని అంటూనే.. బుమ్రాకు కీలక సూచనలు చేశాడు. ఇతర పేసర్లతో పోలిస్తే ఈ భారత బౌలర్‌కు విభిన్నమైన శైలి ఉండటం కలిసొచ్చే అంశమని వ్యాఖ్యానించాడు.

‘‘జస్‌ప్రీత్ బుమ్రా గురించి చెప్పే ముందు.. నేను అతడికి పెద్ద అభిమానిని అని గర్వంగా చెబుతా. అతడిని తొలిసారి చూసినప్పటి నుంచి  ఇదే భావన. అసాధారణమైన విలక్షణ బౌలర్. అత్యంత ప్రభావం చూపించగల క్రికెటర్. మామూలుగా ఫాస్ట్‌ బౌలర్లతో పోలిస్తే బుమ్రా విభిన్నంగా ఉంటాడు. అన్నిఫార్మాట్లలో భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట ఆంటిగ్వా వేదికగా జరిగిన మ్యాచ్‌ సందర్భంగా బుమ్రాను కలిశా. అతడి బౌలింగ్‌ చూడటాన్ని ఆస్వాదిస్తా. నాకున్న అనుభవం ప్రకారం.. ఏ ఇద్దరు పేసర్లు ఒకేలాంటి శైలిలో బౌలింగ్‌ చేయలేరు. కొన్ని పోలికలు మాత్రం ఉంటాయి. కానీ, బుమ్రా బౌలింగ్‌ను ఎవరూ అందుకోలేరు. అందుకే, గాయాల బారిన పడనంత వరకూ బుమ్రా తన బౌలింగ్‌ శైలిని అస్సలు మార్చుకోకూడదు. ఇప్పుడున్న దాని వల్ల అధికంగా ఒత్తిడి పడుతుందని నేను అనుకోవడం లేదు. అయితే, నేనేమీ మెడికల్ ఎక్స్‌పర్ట్‌ను కాదు. బిషప్‌ను తీసుకుంటే.. అతడిది పర్‌ఫెక్ట్‌ బౌలింగ్‌ యాక్షనే. కానీ, చాలాసార్లు గాయపడ్డాడు’’ అని ఆంబ్రోస్‌ తెలిపాడు. 

సెమీఫైనలిస్టులు వీరే..: డేల్ స్టెయిన్

దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్ టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లపై తన అంచనాను వెల్లడించాడు. సూపర్-8లో విండీస్‌ను చిత్తు చేసిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను పక్కన పెట్టడం గమనార్హం. స్టెయిన్‌తోపాటు షాన్‌ పొలాక్‌, డానీ మోరిసన్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

స్టెయిన్‌: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్

పొలాక్‌: భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్

మోరిసన్: భారత్, ఆస్ట్రేలియా, విండీస్‌, ఇంగ్లాండ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని