T20 World Cup: రెచ్చిపోయిన పూరన్‌

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ చెలరేగిపోయింది. పూరన్‌ సిక్స్‌ల మోతతో పరుగుల వరద పారించిన వేళ తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన ఆతిథ్య జట్టు.. అజేయంగా, అదిరే ఫామ్‌తో సూపర్‌-8 సమరానికి సిద్ధమైంది.

Updated : 19 Jun 2024 08:25 IST

అఫ్గాన్‌పై వెస్టిండీస్‌ ఘనవిజయం 
గ్రాస్‌ ఐలెట్‌

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ చెలరేగిపోయింది. పూరన్‌ సిక్స్‌ల మోతతో పరుగుల వరద పారించిన వేళ తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన ఆతిథ్య జట్టు.. అజేయంగా, అదిరే ఫామ్‌తో సూపర్‌-8 సమరానికి సిద్ధమైంది. పూరన్‌ (98; 53 బంతుల్లో 6×4, 8×6), చార్లెస్‌ (43; 27 బంతుల్లో 8×4) రెచ్చిపోవడంతో మంగళవారం మొదట విండీస్‌ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. నైబ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో అఫ్గానిస్థాన్‌ ఘోరంగా విఫలమైంది. మెకాయ్‌ (3/14), మోటీ (2/28), అకీల్‌ (2/21) ధాటికి 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్‌ (38; 28 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన విండీస్‌ గ్రూప్‌-సిలో అగ్రస్థానం సాధించింది. మూడు విజయాలతో అఫ్గానిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందే రెండు జట్లు సూపర్‌-8కు అర్హత సాధించాయి.

దంచేశాడు..: మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నందుకు అఫ్గాన్‌ చింతించే ఉంటుంది. పూరన్‌ ఆ జట్టు బౌలింగ్‌ను అంతలా తుత్తునియలు చేశాడు. ఓపెనర్‌ బ్రెండన్‌ కింగ్‌ (7) ఔట్‌ కావడంతో రెండో ఓవర్లో క్రీజులోకి వచ్చిన పూరన్‌.. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడితో పాటు చార్లెస్‌ కూడా చెలరేగడంతో విండీస్‌ అయిదు ఓవర్లకే 85 పరుగుల చేసింది. జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్‌ ఔటైనా.. పూరన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మధ్యలో స్కోరు వేగం తగ్గినా, ఆఖర్లో అతడు మళ్లీ విధ్వంసం సృష్టించాడు. హోప్‌ (25)తో మూడో వికెట్‌కు 33 పరుగులు జోడించిన అతడు.. పావెల్‌ (26)తో అయిదో వికెట్‌కు 38 బంతుల్లోనే 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో పూరన్‌.. మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్లో రనౌటై త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. మొదటి 5 ఓవర్లలో 85 పరుగులు, ఆఖరి 5 ఓవర్లలో 70 పరుగులు రాబట్టిన విండీస్‌.. ఈ మధ్యలో 63 పరుగులే చేయడం గమనార్హం. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్‌ తేలిపోయింది. తొలి ఓవర్లోనే గుర్బాజ్‌ (0) వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు.. ఏ దశలోనూ పోటీలో నిలవలేదు. ఇబ్రహీం జద్రాన్‌ కాస్త రాణించడంతో ఓ దశలో అఫ్గాన్‌ 45/1తో నిలవగా.. నైబ్‌ (7)ను ఔట్‌ చేయడం ద్వారా 45 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని మోటీ విడదీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ పూర్తిగా గతి తప్పింది. పతనం వేగంగా సాగింది. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండడంతో ఒత్తిడికి గురైన అఫ్గాన్‌.. 55 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు చేజార్చుకుంది. 

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రెండన్‌ కింగ్‌ (బి) అజ్మతుల్లా 7; చార్లెస్‌ (సి) నైబ్‌ (బి) నవీనుల్‌ 43; పూరన్‌ రనౌట్‌ 98; హోప్‌ (సి) నజిబుల్లా (బి) నైబ్‌ 25; రోమన్‌ పావెల్‌ (సి) ఖరోటె (బి) నైబ్‌ 26; రసెల్‌ నాటౌట్‌ 3; రూథర్‌ఫోర్డ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218; వికెట్ల పతనం: 1-22, 2-102, 3-135, 4-199, 5-215; బౌలింగ్‌: ఫారూఖి 3-0-38-0; అజ్మతుల్లా 2-0-41-1; రషీద్‌ ఖాన్‌ 4-0-45-0; నవీనుల్‌ హక్‌ 4-0-41-1; నూర్‌ అహ్మద్‌ 4-0-20-0; నబి 1-0-15-0; నైబ్‌ 2-0-14-2.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) రసెల్‌ (బి) అకీల్‌ 0; ఇబ్రహీం జద్రాన్‌ (సి) చార్లెస్‌ (బి) మెకాయ్‌ 38; నైబ్‌ ఎల్బీ (భి) మోటీ 7; అజ్మతుల్లా (సి) పావెల్‌ (బి) అకీల్‌ 23; నజిబుల్లా (సి) చార్లెస్‌ (బి) మెకాయ్‌ 0; నబి (బి) మెకాయ్‌ 1; జనత్‌ రనౌట్‌ 14; రషీద్‌ ఖాన్‌ (సి) పావెల్‌ (బి) రసెల్‌ 18; నూర్‌ అహ్మద్‌ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) మోటీ 2; నవీనుల్‌ (సి) పూరన్‌ (బి) జోసెఫ్‌ 4; ఫారూఖీ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (16.2 ఓవర్లలో ఆలౌట్‌) 114; వికెట్ల పతనం: 1-0, 2-45, 3-59, 4-59, 5-63, 6-89, 7-89, 8-98, 9-107; బౌలింగ్‌: అకీల్‌ 4-1-21-2; రసెల్‌ 2.2-0-17-1; అల్జారి 3-0-30-1; మోటీ 4-0-28-2; మెకాయ్‌ 3-0-14-3.


ఒకే ఓవర్లో 36 

అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ అజ్మతుల్లా అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా అతడు.. స్టువర్ట్‌ బ్రాడ్‌ సరసన నిలిచాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో అజ్మతుల్లా ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో పూరన్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదగా.. ఓ వైడ్‌ బాల్‌ బౌండరీకి వెళ్లింది. మరో బంతి పూరన్‌ ప్యాడ్లను తాకి ఫైన్‌ లెగ్‌లో బౌండరీ దాటడంలో నాలుగు పరుగులు లెగ్‌బైస్‌ రూపంలో వచ్చాయి. అజ్మతుల్లా ఓ నోబాల్‌ కూడా వేశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడంతో బ్రాడ్‌ 36 పరుగులు ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని