T20 World Cup: దంచేసిన విండీస్‌.. అమెరికా చిత్తు

వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి నుంచి బలంగా పుంజుకుంది. ఓపెనర్‌ షై హోప్‌ (82 నాటౌట్‌; 39 బంతుల్లో 4×4, 8×6) చెలరేగడంతో టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-2 సూపర్‌ 8 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది.

Published : 23 Jun 2024 01:45 IST

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి నుంచి బలంగా పుంజుకుంది. ఓపెనర్‌ షై హోప్‌ (82 నాటౌట్‌; 39 బంతుల్లో 4×4, 8×6) చెలరేగడంతో టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-2 సూపర్‌ 8 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది. చేజ్‌ (3/19), రసెల్‌ (3/31), అల్జారి జోసెఫ్‌ (2/31) ధాటికి మొదట అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. 29 పరుగులు చేసిన ఆంద్రీస్‌ గాస్‌ టాప్‌ స్కోరర్‌. చేజ్‌తో పాటు పూరన్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 1×4, 3×6) బ్యాట్‌ ఝళిపించడంతో లక్ష్యాన్ని విండీస్‌ కేవలం 10.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. చార్లెస్‌ (15)తో తొలి వికెట్‌కు 42 బంతుల్లో 67 పరుగులు జోడించిన హోప్‌.. పూరన్‌తో అభేద్యమైన రెండో వికెట్‌కు 23 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, పని పూర్తి చేశాడు. తన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన విండీస్‌.. ఈ విజయంతో గ్రూప్‌-2లో తన స్థితిని మెరుగుపర్చుకుంది. రెండు పాయింట్లతో (నెట్‌ రన్‌రేట్‌ 1.814) రెండో స్థానంలో ఉంది.

అమెరికా టపటపా: అమెరికా బ్యాటుతో తేలిపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. గాస్‌ మెరుపులతో 6.2 ఓవర్లలో 51/1తో బాగానే కనిపించింది. కానీ నితీశ్‌ (20)ను మోటీ ఔట్‌ చేశాక ఇన్నింగ్స్‌ గతి తప్పింది. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. గాస్‌ను జోసెఫ్‌ ఔట్‌ చేయగా.. జోన్స్‌ (11), కోరీ అండర్సన్‌ (7)లను చేజ్‌ వెనక్కి పంపాడు. రసెల్‌ కూడా విజృంభించడంతో అమెరికా పరుగుల వేటలో వెనుకబడింది. ఏ బ్యాటర్‌ కూడా ప్రతిఘటించలేకపోయాడు. అమెరికా 40 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. 

అమెరికా ఇన్నింగ్స్‌: స్టీవెన్‌ టేలర్‌ (సి) చేజ్‌ (బి) రసెల్‌ 2; ఆండ్రీస్‌ గాస్‌ (సి) హోప్‌ (బి) జోసెఫ్‌ 29; నితీశ్‌ కుమార్‌ ఎల్బీ (బి) మోటీ 20; జోన్స్‌ (బి) చేజ్‌ 11; కోరీ అండర్సన్‌ ఎల్బీ (బి) చేజ్‌ 7; మిలింద్‌ రనౌట్‌ 19; హర్మీత్‌ సింగ్‌ (సి) చార్లెస్‌ (బి) చేజ్‌ 0; షాడ్లీ (సి) చార్లెస్‌ (బి) రసెల్‌ 18; కెంజిగె (సి) పూరన్‌ (బి) జోసెఫ్‌ 1; అలీ ఖాన్‌ నాటౌట్‌ 14; నేత్రావల్కర్‌ (సి) పావెల్‌ (బి) రసెల్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 128; వికెట్ల పతనం: 1-3, 2-51, 3-60, 4-65, 5-88, 6-88, 7-112, 8-112, 9-125; బౌలింగ్‌: అకీల్‌ 3-0-13-0; రసెల్‌ 3.5-0-31-3; మెకాయ్‌ 2-0-20-0; అల్జారి జోసెఫ్‌ 4-0-31-2; మోటీ 3-0-14-1; చేజ్‌ 4-0-19-3

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ నాటౌట్‌ 82; చార్లెస్‌ (సి) మిలింద్‌ (బి) హర్మీత్‌ 15; పూరన్‌ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (10.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 130; వికెట్ల పతనం: 1-67; బౌలింగ్‌: నేత్రావల్కర్‌ 2.5-0-31-0; కెంజిగె 1-0-11-0;  అలీ ఖాన్‌ 2-0-18-0; హర్మీత్‌ సింగ్‌ 2-0-18-1; షాడ్లీ 2-0-29-0; మిలింద్‌ కుమార్‌ 1-0-22-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని