Kevin Pietersen: మోదీ ఓ హీరో.. ప్రధానిపై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ మాజీ సారథి ప్రశంసలు

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి, వన్యప్రాణి పరిరక్షకుడు కెవిన్‌ పీటర్సన్‌ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు......

Updated : 25 Sep 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి, వన్యప్రాణి పరిరక్షకుడు కెవిన్‌ పీటర్సన్‌ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఖడ్గమృగాల పరిరక్షణకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రపంచ నేతలు మోదీని అనుసరించాలని కోరారు. పలు మూఢ నమ్మకాలను పటాపంచలు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఈనెల 23న ఖడ్గమృగాల కొమ్ములను కాల్చివేసింది. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ మోదీని అభినందించారు. ‘థాంక్యూ నరేంద్ర మోదీ. ఖడ్గమృగాల జాతుల పరిరక్షణ కోసం నిలిచిన మహా నేత. అందుకే భారత్‌లో ఖడ్గమృగాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచ నేతలు సైతం మోదీలా చర్యలు చేపడితే ఈ జాతులను కాపాడుకోవచ్చు. మోదీ ఓ హీరో’ అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రపంచ ఖడ్గమృగాల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23న అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేసింది. కజిరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలోని బొకాఖట్‌ కవాతు మైదానంలో మైదానంలో 2479 కొమ్ములను కాల్చి వేసింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉన్నాయనే అపోహలతో.. అనేక చోట్ల వాటిని వేటాడుతున్నారు. ఈ అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్కారు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అస్సాం ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ‘ఇది ఓ గొప్ప ప్రయత్నం. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు భారతదేశానికే గర్వకారణం. వాటి శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకుంటాం’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా మోదీ చేసిన ట్వీట్‌కు కెవిన్‌ పీటర్సన్‌ స్పందిస్తూ ఆయనను ప్రశంసించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని