ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది

కుడోస్‌ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా, బయోబబుల్‌ వివాదాలు చుట్టుముట్టినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ..

Updated : 19 Jan 2021 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్: కుడోస్‌ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా.. బయోబబుల్‌ వివాదాలు చుట్టుముట్టినా. జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. తొలి టెస్టు ఓటమి అనంతరం దెబ్బతిన్న చిరుతలా విరుచుకుపడ్డారు. తమ అడ్డా అని గర్వంగా చెప్పుకునే గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి.. భారత్‌ సత్తాని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు. అందుకే టీమిండియాకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. దిగ్గజాల నుంచి అభిమానుల వరకూ భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

🏏 అద్భుత విజయం.. అడిలైడ్ తర్వాత టీమిండియాను తక్కువగా చూసిన ప్రతిఒక్కరికీ సమాధానమిది. గొప్ప ప్రదర్శన, గెలవాలనే సంకల్పం, లక్ష్యమే విజయాన్ని అందించింది. భారత జట్టు, యాజమాన్యం గొప్ప పోరాటపటిమ చూపారు. చారిత్రక విజయాన్ని ఆస్వాదించండి

- విరాట్ కోహ్లీ


🏏 భారత్‌కే కాదు, ప్రపంచానికి ఓ విషయం చెబుతున్నా. మీరు 36 పరుగులు లేదా అంతకంటే తక్కువ స్కోరుకు వెనుదిరిగితే.. అది అంతం కాదు. మరింత గొప్పగా దూసుకెళ్లడానికే కాస్త వెనక్కి వెళ్తున్నారంతే. అయితే గెలిచిన తర్వాత మీకు అండగా నిలిచిన వాళ్లతో సంబరాలు చేసుకోవడం మరిచిపోవద్దు. ప్రతి సెషన్‌లో ఓ హీరోని చూశాం. ధైర్యంగా ఆడాం. గాయాలు, ఇతర ప్రతికూలతల్ని అధిగమించి గొప్ప సిరీస్‌ను గెలిచాం. భారత్‌కు అభినందనలు

- సచిన్‌ తెందుల్కర్


🏏 భారత జట్టులో ఎంతో మంది గాయపడ్డారు. కానీ ఆస్ట్రేలియా పొగరు, గర్వానికి అసలు గాయమైంది. ఈ సిరీస్‌ సినిమాను తలపించింది. భారత జట్టులో ప్రతిఒక్కరూ హీరోనే. కొంత మంది మాత్రం సూపర్‌ హీరోలు. పంత్ స్పైడర్‌ మ్యాన్‌

- వీరేంద్ర సెహ్వాగ్


🏏 అద్వితీయ విజయం. ఆస్ట్రేలియాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్ సాధించిన తీరు అద్భుతం. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ విజయం నిలిచిపోతుంది. ఈ సందర్భంగా టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్లు బోనస్‌గా ఇస్తుంది. ఈ విజయం అత్యంత విలువైనది. ప్రతిఒక్కరూ గొప్పగా పోరాడారు

- సౌరవ్‌ గంగూలీ


🏏 భారతీయుడిగా గర్వపడుతున్నా. వెయ్యి రెట్లు రోమాలు నిక్కపొడిచిన భావోద్వేగం ఇది

- గౌతం గంభీర్‌


🏏 గబ్బాలో ఆసీస్‌ రికార్డుకు చరమగీతం పాడారు. ఇది చరిత్ర. ఇది యువ భారత్‌ పోరాటం. ఇది గొప్ప టెస్టు విజయం. పంత్‌, సుందర్‌, గిల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. అజింక్య రహానె నాయకుడై నడిపించాడు

- హర్షా భోగ్లే


ఇదీ చదవండి..

భారత్‌ చిరస్మరణీయ విజయం..

భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ

భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని