T20 World Cup: నిలకడలేమి ప్రధాన సమస్య.. అయితేనేం పాక్‌తో అంత ఆషామాషీ కాదు

టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోయే పాక్‌ బలాబలాలు

Updated : 20 Oct 2021 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంచనాలకు అందని క్రికెట్‌ జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్‌. ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం కష్టసాధ్యం. ఒక మ్యాచ్‌లో ఉన్నత స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తే.. తరువాతి మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలతారు. అలా అని వారిని తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతుంటారు. టీ20ల్లో పాక్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత ఐదు టీ20 సిరీసుల్లో నాలుగింటిని సొంతం చేసుకుంది. 2009లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను పాక్‌ గెలుచుకుంది. అయితే ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నమెంట్లలో టీమిండియా చేతిలో మాత్రం పాక్‌కు ఓటమి తప్పడంలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు, వన్డే వరల్డ్‌ కప్‌లో ముఖాముఖిగా ఏడుసార్లు తలపడగా.. అన్నింట్లోనూ భారత్‌ విజయం సాధించింది. 2007 నుంచి జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాక్‌కు భంగపాటు తప్పడం లేదు. ఈ సారైనా టీమిండియా మీద పాక్‌ గెలవాలని ఆ దేశ మాజీ క్రీడాకారులు సహా అభిమానులు గట్టిగా కోరుతున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాక్‌ జట్లు అక్టోబర్ 24న ఢీకొట్టుకోనున్నాయి.

బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌.. 

పాకిస్థాన్‌ జట్టు ప్రపంచకప్‌ను గెలవకపోయినా పెద్దగా బాధపడని అభిమానులు.. భారత్‌ చేతిలో ఓటమిపాలైతే మాత్రం ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి అంటుతాయి. టోర్నీని ముగించుకుని వచ్చిన ఆటగాళ్లకు నిరసనలు స్వాగతం పలుకుతాయి. దాయాది దేశాల మధ్య క్రికెట్‌ పోటీలు జరిగిన చాలాకాలం కావడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియాపై పాక్‌ గెలిస్తే ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు ఆర్థికపరంగానూ కలిసొచ్చే అవకాశం ఉంది. తమ జట్టు గెలిస్తే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి బ్లాంక్‌ చెక్‌ ఇస్తామని పలువురు ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేశారని ఛైర్మన్‌ రమీజ్‌ రజా చెప్పాడు. పాకిస్థాన్‌ బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉందని.. ఈసారి టీమిండియాపై తప్పక విజయం సాధిస్తారనే నమ్మకాన్ని మాజీ ఆటగాళ్లు వ్యక్తం చేస్తున్నారు. 

గెలుపుపై భరోసా ఎందుకో..?

దాయాదుల మధ్య పోరు అంటే నరాలు తెగే ఉత్కంఠ. టీమిండియానే అన్ని రంగాల్లోనూ పాక్‌ కంటే పటిష్ఠంగా ఉంది. అయినా సరే తమ జట్టే గెలుస్తుందనే నమ్మకం పాక్‌ అభిమానులకు ఉండటానికి ప్రధాన కారణం.. పాక్ కెప్టెన్‌ బాబర్ ఆజామ్, మహమ్మద్‌ రిజ్వాన్‌. ఐసీసీ టీ20 బ్యాటర్లలో బాబర్ రెండోస్థానం కాగా.. రిజ్వాన్‌ది ఏడో ర్యాంక్‌. వీరితోపాటు ఫఖర్ జమాన్‌, అసిఫ్‌ అలీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు షహీన్‌ షా అఫ్రిదీ, హసన్‌ అలీ, మహమ్మద్‌ హఫీజ్‌ కీలకం. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణిస్తే పాకిస్థాన్‌ను ఆపడం అంత సులభం కాకపోవచ్చు. అయితే నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో లేకపోవడం పాక్‌కు ఇబ్బందే. మరోవైపు కొత్త కోచ్‌లు హేడెన్‌, ఫిలాండర్‌లు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోతేనే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. 

* బాబర్‌ అజామ్‌: భారత్‌లో కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఎంత ప్రజాదరణ ఉందో.. పాక్‌లో బాబర్‌ ఆజామ్‌కు ఉంది. తన కెరీర్‌లో 61 టీ20 మ్యాచుల్లో 2,204 పరుగులను (ఒక శతకం.. 20 అర్ధశతకాలు) నమోదు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బాబర్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే వేగంగా పరుగులు చేస్తాడు. అత్యధిక స్కోరు 122 పరుగులు. 

* రిజ్వాన్‌: పాకిస్థాన్‌ జట్టు కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ మంచి ఇన్నింగ్స్‌లను ఆడుతుంటాడు. ఓపెనింగ్‌ చేసే రిజ్వాన్‌ ఇప్పటి వరకు 43 టీ20లను ఆడాడు. ఒక శతకం, ఎనిమిది అర్ధశతకాలతో 1,065 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 104 చేసిన రిజ్వాన్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాడు.

* అఫ్రిదీ: పాక్‌ బౌలింగ్‌ తురుపుముక్కగా షాహీన్‌ అఫ్రిదీని మాజీలు అభివర్ణిస్తుంటారు. 21 ఏళ్ల లెఫ్ట్‌ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ 30 టీ20ల్లో 8.17 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టాడు. ఈసారి ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషిస్తాడని పాక్‌ ఆటగాళ్లు బలంగా నమ్ముతున్నారు.

పాకిస్థాన్‌ జట్టు: బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), షాదాబ్‌, అసిఫ్‌ అలీ, ఫకార్‌, షోయబ్‌ మాలిక్‌, హైదర్‌, హారిస్‌, హసన్‌, ఇమాద్‌, హఫీజ్‌, నవాజ్‌, రిజ్వాన్‌, మహమ్మద్‌ వసీమ్‌, సర్ఫ్‌రాజ్‌, షహీన్‌ అఫ్రిది


తగ్గేదే లే.. అంటున్న భారత్, పాక్‌ జట్లు 

మిగతా జట్ల మధ్య పోటీ ఎలా ఉన్నా.. మైదానంలోకి భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్లు జట్లు దిగాయంటే కొదమ సింహాల్లా తలపడతాయి. ఆటగాళ్లు, అభిమానులపరంగా భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఇరు జట్లు తమ పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించి మరీ విజయం కోసం పోరాడుతాయి. అయితే పాక్‌ కేవలం నలుగురు ఆటగాళ్ల మీద ఆధారపడి ఉండటం మైనస్‌ కానుండగా.. టీమిండియా జట్టులోని ఆఖరి ఆటగాడు కూడా మ్యాచ్‌ విజేతే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పాక్‌ కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, ఇషాన్, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్ వరకు బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ బుమ్రా, షమీ, భువి త్రయంతో పటిష్ఠంగా ఉంది. పాకిస్థాన్‌, భారత్‌ జట్లకు మధ్య ప్రధాన తేడా ఆల్‌రౌండర్లు. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటం భారత్‌కు సానుకూలాంశం. మెంటార్ ఎంఎస్‌ ధోనీ టీమిండియాకు అదనపు బలం. అయితే పాక్‌ను తక్కువ అంచనా వేసి బరిలోకి దిగితే మాత్రం తీవ్ర తప్పిదమే అవుతుంది. భారత్‌పై ఆడేటప్పుడు ఆ జట్టులోని ప్రతి ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తారు. కాబట్టి అక్టోబర్ 24న భారత్‌, పాక్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని