పింక్‌ బాల్‌ టెస్టు: ఇప్పటివరకు ఏమైంది?

పిక్‌బాల్‌ టెస్టని పిలిచినా, డే/నైట్‌ టెస్టని పేర్కొన్నా ఏదైనా ఒకటే అర్థం. రోజంతా ఎర్ర బంతితో కాకుండా, సాయంత్ర వేళ ఫ్లడ్‌లైట్ల కింద పింక్‌బాల్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌నే డే/నైట్‌ టెస్టని పిలుస్తారు...

Updated : 22 Feb 2021 15:00 IST

డే/నైట్‌ టెస్టుల గురించి మీకివి తెలుసా..!

పింక్ ‌బాల్‌ టెస్టని పిలిచినా, డే/నైట్‌ టెస్టు అన్నా.. ఒకటే అర్థం, ఒకటే ఆట. సాధారణంగా ఆడే ఎర్ర బంతితో కాకుండా, పింక్ ‌బాల్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌నే డే/నైట్‌ టెస్టని పిలుస్తారు. ఆదరణ కోల్పోతూ వస్తున్న టెస్టు క్రికెట్‌కు పునరుజ్జీవం పోసేందుకు క్రికెట్‌ ప్రపంచం తీసుకున్న నిర్ణయం ఈ కొత్త తరహా టెస్టు క్రికెట్‌‌. మొదట్లో ప్రధాన జట్లు సైతం వ్యతిరేకించిన ఈ పింక్‌ బాల్‌ టెస్టులను ఇప్పుడు అన్ని జట్లూ ఆడేందుకు ఇష్టపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా మూడో పింక్ ‌బాల్‌ టెస్టు ఆడనున్న నేపథ్యంలో ఈ పింక్‌ బాల్‌ టెస్టు విశేషాలేంటో తెలుసుకుందాం.


పింక్‌ బాలే ఎందుకంటే..

ఒకప్పుడు క్రికెట్‌ అంటే కేవలం టెస్టు మ్యాచ్‌లే ఉండేవి. కాల క్రమేణా వన్డే ఫార్మాట్‌, టీ20, టీ10 క్రికెట్‌ అంటూ ఆట స్వరూపం మారిపోయింది. దీంతో పొట్టి క్రికెట్‌కు విశేషమైన ఆదరణ లభించి.. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌పై వీక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లింది. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌ను భావితరాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో క్రికెట్‌ ప్రపంచం ఈ డే/నైట్‌ టెస్టులకు శ్రీకారం చుట్టింది. అయితే, అనుకున్నంత తేలిగ్గా వీటి నిర్వహణకు మార్గం సుగమం కాలేదు. ఫ్లడ్‌ లైట్ల కింద ఎర్ర బంతితో ఆడితే ఆటగాళ్ల కంటికి బంతి సరిగ్గా కనపడదనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ప్రధాన జట్లు ఈ టెస్టులను వ్యతిరేకించాయి. కానీ, ప్రయోగాత్మక మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్ల అభిప్రాయాలు, మాజీల సూచనలు తీసుకొని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వేరే రంగుల్లో బంతిని పరిశీలించారు. ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ రంగుల్లోనూ బంతులను ప్రయోగించి చూశారు. చివరికి 2015లో పింక్ ‌బాల్‌తో తొలి డే/నైట్‌ టెస్టును నిర్వహించారు.


ఎప్పుడు.. ఎలా మైదలైంది

పురుషుల క్రికెట్‌లో పింక్ ‌బాల్‌ను ప్రవేశపెట్టకముందు మహిళల వన్డే మ్యాచ్‌లో తొలిసారి (2009లో) ఈ బంతిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ బంతితో ఓ వన్డే మ్యాచ్‌ నిర్వహించిన తర్వాత చాలా దేశాలు తమ దేశవాళీ క్రికెట్‌లో పింక్ ‌బాల్‌ను ప్రయోగించి చూశాయి. 2015 నవంబర్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌ మధ్య అడిలైడ్‌లో తొలి డే/నైట్‌ పింక్‌ బాల్‌ అంతర్జాతీయ టెస్టు జరిగింది. స్వదేశంలో కంగారూ జట్టు అన్ని జట్ల కన్నా అధికంగా ఎనిమిది పింక్‌ బాల్‌ టెస్టులు ఆడింది. అన్నింటిలోనూ ఆ జట్టు విజయం సాధించడం విశేషం. పాకిస్థాన్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. ఒకటి గెలిచి, మూడింటిలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌ తలో మూడు పింక్‌ బాల్‌ టెస్టులు ఆడాయి. భారత్‌ ఇప్పటివరకు రెండు డే/నైట్‌ టెస్టులు ఆడగా, ఒక విజయం సాధించి, మరొక మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసింది. 2019 నవంబర్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌తో తొలి పింక్ ‌బాల్‌ టెస్టు ఆడగా, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రెండో పింక్‌ బాల్‌ టెస్టు ఆడింది.


తెలుసుకోవాల్సిన విశేషాలు..

* 2017లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌ 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ కొత్త తరహా క్రికెట్‌లో ఇదే గొప్ప విజయం.

* 2016లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 39 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ‘పింక్‌’ క్రికెట్‌లో అతి స్వల్ప తేడా విజయం ఇదే.

* పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా పింక్ ‌బాల్‌ టెస్టుల్లో అత్యధిక స్కోర్ (589/3)‌ సాధించింది.

* అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ (335).

* పింక్ ‌బాల్‌ టెస్టుల్లో టీమ్‌ఇండియాదే అతి తక్కువ ఇన్నింగ్స్‌ స్కోర్‌. ఇటీవల ఆస్ట్రేలియాపై తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 36 పరుగులకే కుప్పకూలింది.

* పింక్ ‌బాల్‌ టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణంకాలు నమోదు చేసింది ప్యాట్‌ కమిన్స్‌ (6/23). అతడి తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌ (6/32) మెరుగైన ప్రదర్శన చేశాడు.

* ఇంగ్లాండ్‌ మూడు పింక్ ‌బాల్‌ టెస్టుల్లో ఒకటి గెలుపొందగా, రెండింటిలో ఓటమిపాలైంది. 

భారత్‌ తరఫున పింక్‌ బాల్‌ టెస్టులో అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శన కోహ్లీదే (136). బౌలింగ్‌లో అయితే ఇషాంత్ (5/22)‌ ముందంజలో ఉన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని