Dexa scan: ఏమిటీ డెక్సా స్కాన్‌.. టీమ్‌ ఇండియా ఎంపికకు ఎందుకు కీలకం..!

ఇప్పటికే అందరికీ సుపరిచితమైన యోయో పరీక్షకు తోడు.. టీమ్‌ ఇండియా ఎంపికలో డెక్సాస్కాన్‌ నివేదికలు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆటగాడు గాయపడే అవకాశాలను దీని ద్వారా ముందే గుర్తించవచ్చు. 

Updated : 02 Jan 2023 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

టీమ్‌ ఇండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై గత కొన్ని నెలలుగా సందేహాలు తలెత్తుతున్నాయి. టీ20ల్లో ఈ ఏడాది దాదాపు 37 క్యాచ్‌లను డ్రాప్‌ చేశారంటే మైదానంలో ఎంత బద్ధకంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇక అదనపు పరుగులు దొంగిలించాల్సిన సమయంలో రన్నింగ్‌ బిట్వీన్‌ది వికెట్స్‌లో కూడా బ్యాటర్లు నిదానంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు గాయాలు ఉండనే ఉన్నాయి. ఈ రకంగా వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బీసీసీఐ ముందే గుర్తించింది. దీంతో గతంలో నిలిపివేసిన యోయో టెస్ట్‌ను తిరిగి ప్రారంభించడంతోపాటు.. కొత్తగా ‘డెక్సాస్కాన్‌(Dexa scan)’ను కూడా దీనికి జతచేసింది.

డెక్సా స్కాన్‌(Dexa scan) అంటే ఏమిటీ..?

డెక్సా (డ్యూయల్‌ ఎనర్జీ ఎక్స-రే అబ్సర్ప్టియోమెట్రీ) స్కాన్‌ను ఎముకలో కాల్షియం, ఇతర మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో గుర్తించేందుకు వాడతారు. దీనిలో ఛాతి ఎక్సరే కంటే ఎక్కువ.. ఎమ్మారై కంటే తక్కువ రేడియేషన్‌ వినియోగిస్తారు. దీనిలో సెంట్రల్‌ డెక్సా, పెరిఫెరల్‌ డెక్సా స్కాన్‌ అనే రెండు రకాలుగా ఉంటాయి. సెంట్రల్‌ డెక్సాలో తుంటిఎముక వంటి కీలక భాగాలు విరిగేందుకు ఉన్న అవకాశాలను గుర్తిస్తారు. 

2011లోనే టీమ్‌ ఇండియా ఆడే మ్యాచ్‌ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆటగాళ్లకు ఈ స్కాన్‌ చేయించాలని నాటి స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ రామ్‌జీ శ్రీనివాసన్‌ సూచించారు. ఈ స్కాన్‌ వల్ల ఆటగాడి శరీరంలోని ఎముకల సాంద్రత, కొవ్వుశాతం, కండరాల  శాతం, నీటి శాతం వంటి ప్రాథమిక అంశాలపై ట్రైనర్లకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇందులో ఆటగాడు వేటినీ దాచి పెట్టడం సాధ్యంకాదు. ఆటగాడికి కూడా తన శరీర పరిస్థితి.. ట్రైనింగ్‌ ఏ దిశగా సాగుతోందనే అంశాలపై అవగాహన వస్తుంది. వీటి ఆధారంగానే ఆటగాడి ట్రైనింగ్‌ను డిజైన్‌ చేస్తారు. కొన్ని జట్లు దాదాపు 10 ఏళ్ల నుంచే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. 

క్రికెటర్ల శరీరంలో కొవ్వుశాతం ఎంత ఉండాలి..

కొంత మంది ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడుతుండటంతో బీసీసీఐ మరింత సాంకేతిక పరమైన విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ విషయంలో అధిక బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వారి శిక్షకులు కూడా జవాబుదారీగా ఉంటారు. దీనిపై స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ రామ్‌జీ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ ‘‘ శరీరంలో కొవ్వు శాతం 10శాతం లోపే ఉండాలి. అదే 10-12శాతం మధ్యలో ఉంటే మీరు బోర్డర్‌లైన్‌లో ఉన్నట్లే. ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల శరీరంలో కొవ్వుశాతం 5-8శాతం మాత్రమే ఉండాలి. కానీ,  క్రికెటర్లకు 10శాతం వరకు ఉండొచ్చు. తక్కువ కొవ్వు ఉందంటే శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉందని అర్థం. ఇది ఆటగాడికి సామర్థ్యం, శక్తి, వేగం, చురుకుదనం ఇవ్వడంతోపాటు కీళ్లపై భారాన్ని తగ్గిస్తుంది. దీంతో కండరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. వీరు వెన్నెముక, కీళ్ల గాయాల నుంచి తప్పించుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. 

ఒక ఆటగాడికి సరిపడిన శిక్షణ విధానాలు మరో ఆటగాడికి వాడితే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. డెక్సాస్కాన్‌(Dexa scan)తో ఆటగాళ్ల శారీరక పరిస్థితులపై టీమ్‌ ఇండియా శిక్షకులకు అవగాహన  ఉంటే.. వారికి తగిట్లు ట్రైనింగ్‌ సెషన్‌, రొటీన్‌, డైట్‌ ప్లాన్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా గాయాలు బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. 

ఇక యోయో పరీక్షలో 20 మీటర్ల దూరంలో అమర్చిన  రెండు కోన్లకు మధ్య పరిగెత్తే దూరాన్ని లెక్కగట్టి ఆటగాడి ఫిట్‌నెస్‌ను అంచనావేస్తారన్న విషయం క్రికెట్‌ అభిమానులకు తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు