Gautam Gambhir: ‘సీనియర్‌ ఆటగాళ్ల విషయంలో..’: ఇంటర్వ్యూలో గంభీర్‌ను అడిగిన ప్రశ్నలివే..!

Gautam Gambhir: టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూలో గౌతమ్‌ గంభీర్‌ను కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు. అవేంటో తాజాగా బయటికొచ్చాయి.

Published : 19 Jun 2024 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ (Head Coach) నియామకానికి సమయం దగ్గరపడుతున్న వేళ బీసీసీఐ (BCCI) క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్నాడు. 40 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో గంభీర్‌కు కమిటీ సభ్యులు మూడు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంబంధిత ప్రశ్నల వివరాలను ఓ క్రీడా ఛానల్‌ తమ కథనంలో వెల్లడించింది. అవేంటంటే..?

  • జట్టు కోచింగ్‌ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
  • బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడు.. జట్టులో మార్పులు చేయాలంటే ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు?
  • ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌, వర్క్‌లోడ్‌కు అనుగుణంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పరిమితులు, ఐసీసీ ట్రోఫీలు గెలవలేక జట్టు ఎదుర్కొంటున్న వైఫల్యాలను పరిష్కరించడం వంటి అంశాలపై మీ అభిప్రాయాలు ఏంటీ? అని కమిటీ సభ్యులు గంభీర్‌ను అడిగినట్లు తెలుస్తోంది.

ఒక రౌండ్‌ అయింది.. టీమ్‌ఇండియా కోచ్‌గా ప్రకటన లాంఛనమే

కోచ్‌ నియామకానికి సంబంధించి గంభీర్‌కు ఇంటర్వ్యూ (Interview) ఒక రౌండ్ పూర్తయింది. బుధవారం ఇంకో రౌండ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా (Team India) కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన వారిలోంచి గంభీర్‌ కాకుండా డబ్ల్యూవీ రామన్‌ను కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకు పిలిచింది. వీరిద్దరూ వర్చువల్‌గా హాజరయ్యారు. రామన్‌తోనూ సభ్యులు 40 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే, గంభీర్‌నే కోచ్‌గా చేయడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉందని.. ఇంటర్వ్యూలు లాంఛనమే అని తెలుస్తోంది. రెండో రౌండ్‌ కూడా పూర్తయ్యాక గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని