Chennai: అట్టిపెట్టుకున్న వాళ్లే ఆడలేకపోయారు.. చెన్నై వైఫల్యానికి కారణాలివే

ఈ సీజన్‌కు ముందు చెన్నై నలుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. వాళ్లే ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కెప్టెన్‌ ధోనీ, విదేశీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ...

Published : 13 May 2022 11:04 IST

ఈ సీజన్‌కు ముందు చెన్నై నలుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. వాళ్లే ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కెప్టెన్‌ ధోనీ, విదేశీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ. ఈ నలుగురూ చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో ఈసారి తమకు ఐదో కప్పును అందిస్తారని జట్టు యాజమాన్యం భావించింది. కానీ, ఈ నలుగురూ విఫలమై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అలాగే జట్టు ఓటమికి ఇంకొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి.


రుతురాజ్‌ ఫామ్‌లోకి వచ్చేసరికే..

గతేడాది టాప్ స్కోరర్‌గా నిలిచి చెన్నై నాలుగోసారి కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈసారి చాలా ఆలస్యంగా క్లికయ్యాడు. అతడు ఫామ్‌లోకి వచ్చేసరికే చెన్నై ఐదు ఓటములు చవిచూసింది. దీంతో సగం ప్లేఆఫ్స్‌ అవకాశాలను అక్కడే కోల్పోయింది. ఇక తాజాగా ముంబయితో చావో రేవో తేలాల్సిన మ్యాచ్‌లోనూ రుతురాజ్‌(7) విఫలమయ్యాడు. దీంతో చెన్నై ఓటమికి రుతురాజ్‌ వైఫల్యమూ ఓ కారణంగా మారింది.


మొయిన్‌ అలీ తుస్సు..

ఆటగాళ్ల రిటెన్షన్‌కు ముందు చెన్నై సామ్‌ కరన్‌ను అట్టిపెట్టుకోవాలా లేదా మొయిన్‌ను తీసుకోవాలా అనే సందిగ్ధంలో పడింది. కానీ, సామ్‌ ఈసారి ఆడట్లేదని తెలిసి మొయిన్‌ అలీనే అట్టిపెట్టుకుంది. కానీ, ఈ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయాడు. బ్యాట్‌తో రెండు, మూడు మ్యాచ్‌ల్లో మోస్తరు స్కోర్లు సాధించినా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. మొత్తంగా 8 మ్యాచ్‌ల్లో 16.25 సగటుతో 130 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 6 వికెట్లే తీసి పూర్తిగా నిరాశపరిచాడు.


రవీంద్ర జడేజా ఒత్తిడికి చిత్తు..

జడేజాను ఈసారి కెప్టెన్‌గా చేయాలని చెన్నై గత సీజన్‌లోనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే అతడిని రూ.16 కోట్లు వెచ్చించి మరీ అట్టిపెట్టుకుంది. అదే సమయంలో ధోనీకి రూ.12 కోట్లనే ఆఫర్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈసారి టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై.. జడేజాను కెప్టెన్‌గా నియమించింది. అయితే, అదే ఇప్పుడు అతడిని నిండా ముంచిందని అనిపిస్తోంది. ఆదిలో వరుస వైఫల్యాలతో కెప్టెన్సీలో ఒత్తిడి ఎదుర్కొన్న జడ్డూ వ్యక్తిగత ప్రదర్శనలోనూ తేలిపోయాడు. దీంతో చివరికి కెప్టెన్సీనే  వదులుకొన్నాడు. ఇప్పుడు గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన నేపథ్యంలో.. జట్టుతో అతడికి విభేదాలు ఏర్పడ్డాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


ధోనీ బ్యాటింగ్‌ ఓకే కానీ..

ఈ సీజన్‌ ఆరంభంలో ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశించారు. అనుకున్నట్లే కొన్ని మ్యాచ్‌ల్లో అతడు ఫినిషర్‌గా రాణించాడు. ఇక కీపర్‌గానూ ధోనీ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. అయితే.. జడేజా పగ్గాలు వదులుకున్నాక మళ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నా నాలుగింటిలో రెండు మాత్రమే గెలిపించాడు. ముఖ్యంగా గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌గా దంచికొట్టే అవకాశం వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. ఐదో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మహీ టెయిలెండర్లతో కలిసి ఆడాడు. కానీ.. 33 బంతులాడి 36 పరుగులే చేశాడు. ఫోర్లు, సిక్సులు బాదినా జట్టుకు అవసరమైన స్కోర్‌ అందించలేకపోయాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని