IND vs ENG: టీమ్‌ఇండియా ఓటమిపై రాహుల్‌ ద్రవిడ్‌ ఏమన్నాడంటే?

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయింది. మూడు రోజులవరకు ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో...

Published : 06 Jul 2022 02:26 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయింది. మూడు రోజులవరకు ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించినా ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. జోరూట్‌ (142), బెయిర్‌స్టో (114) గొప్పగా బ్యాటింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించారు. దీంతో సిరీస్‌ సైతం 2-2తో సమమైంది.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ టీమ్‌ఇండియా ఓటమిపై స్పందించాడు. ‘మేం తొలి మూడు రోజులు బాగానే ఆడినా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేకపోయాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో విఫలమయ్యామని అనుకుంటున్నా. మ్యాచ్‌ గెలవాలన్న కసిని కొనసాగించలేకపోయాం. మరోవైపు ఇంగ్లాండ్‌ గొప్పగా పోరాడి విజయం సాధించింది. ఆ జట్టును మెచ్చుకోవాలి. రూట్‌, బెయిర్‌స్టో అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించారు. మధ్యలో రెండు, మూడు అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

‘ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పలు అవకాశాలు చిక్కినా వాటిని అందిపుచ్చుకోలేకపోయాం. దీంతో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో వాటిని గమనించి సరిద్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ఇండియా కొన్నేళ్లుగా ప్రత్యర్థులను 20 వికెట్లు తీసి విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ, కొన్ని నెలలుగా ఆ పనిచేయలేకపోతోంది. అందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట బాగానే ఆరంభిస్తున్నా చివరికి విజయాలు సాధించలేకపోతున్నాం’ అని ద్రవిడ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని