KL Rahul: ఆ ముగ్గురి కెప్టెన్సీలోనూ ఆడా.. ఎవరి నాయకత్వం ఎలా ఉంటుందంటే?: కేఎల్ రాహుల్

తొమ్మిదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన కేఎల్ రాహుల్ (KL Rahul) ముగ్గురి సారథ్యంలో ఆడాడు. వారి మధ్య తేడా ఏంటో అనేది అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

Updated : 18 May 2023 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్: కాలికి గాయం కారణంగా ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌ నుంచి మధ్యలోనే వైదొలిగిన టీమ్‌ఇండియా ఆటగాడు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ రెగ్యులర్‌ సారథి కేఎల్ రాహుల్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు తరఫున ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడటంపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే కేఎల్ రాహుల్‌ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడాడు.  ఇప్పుడు రోహిత్ శర్మకి డిప్యూటీగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో వారి సారథ్యంలో ఆడటంపై కేఎల్ తన మనసులోని మాటను ఓ క్రీడా ఛానెల్‌ వేదికగా బయటపెట్టాడు. 

ధోనీ నుంచి అదే నేర్చుకున్నా.. (MS Dhoni)

ముగ్గురు అద్భుతమైన సారథుల నాయకత్వంలో ఆడా. జాతీయ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ఎంఎస్ ధోనీ నా మొదటి కెప్టెన్. జట్టును చాలా నిశ్శబ్దంగా ఉంటూ ఎలా నడపాలనే విషయాలను ధోనీ నుంచి నేర్చుకున్నా. కేవలం మైదానంలోనే కాకుండా..  తెర వెనుక కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి ఆటగాడితో మంచి అనుబంధం ఎలా ఏర్పరుచుకోవాలో తెలిసింది. అప్పుడే సహచరులు మన కోసం పోరాడతారు. ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.

విరాట్ సారథ్యంలో.. (Virat Kohli)

నా కెరీర్‌లో ఆరేడేళ్లు విరాట్ కెప్టెన్సీలోనే ఆడాను. గణాంకాల ప్రకారం అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఆట పట్ల అభిరుచి, దూకుడును విరాట్ తీసుకొచ్చాడు. మన జట్టు ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడు. ముందుండి మరీ టీమ్‌ను నడిపిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించడమెలాగో విరాట్ నుంచి నేర్చుకున్నా. అతడి నుంచి స్ఫూర్తి పొంది మరీ మా ఆటతీరును ఇంకాస్త మెరుగు పర్చుకున్నాం. ఓ సగటు ఆటగాడిగా మాత్రం ఉండిపోకుండా ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ.. వారిలోని సత్తాను వెలికి తీయడంలో విరాట్‌ది ప్రత్యేక శైలి. 

పిచ్‌పై రోహిత్‌కు పూర్తి అవగాహన (Rohit Sharma)

ప్రస్తుతం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ నాయకత్వం చాలా పదునుగా ఉంటుంది. అతడి వ్యూహాలు, మ్యాచ్‌కు ముందు చేసే హోంవర్క్‌ అద్భుతం. ప్రతి ఆటగాడి బలం ఏంటో తెలుసు. అతడేం చేయగలడు.. అతడిని ఎలా ఒత్తిడిలోకి నెట్టాలనే విషయాలపై అవగాహన ఉంటుంది. గేమ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి.. దానికి తగ్గట్టు వ్యూహాలను ఎలా అమలు చేయాలనే విషయాలను రోహిత్ నుంచి నేర్చుకోగలిగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని