Cricket News: క్రికెట్‌ పేస్‌ తూటాల తయారీ కేంద్రం.. ఈ ఫౌండేషన్‌..!

భారత క్రికెట్‌ జట్టు ఇటీవల పేస్‌బౌలింగ్‌ దళం చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఒకప్పుడు భారత జట్టులో పేస్‌బౌలర్‌ గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయడం సెలక్టర్లుకు కత్తిమీద సాములా మారేది.

Updated : 17 Dec 2021 14:53 IST

 భారత పేస్‌ దళం పుట్టిల్లు ఇదే..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత క్రికెట్‌ జట్టు పేస్‌బౌలింగ్‌ దళం ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఒకప్పుడు భారత జట్టులో పేస్‌బౌలర్‌ గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయడం సెలక్టర్లకు కత్తిమీద సాములా మారేది. 1990ల్లో జవగళ్‌ శ్రీనాథ్‌ భుజానికి గాయం అయిన సందర్భంలో భారత జట్టు ఇలానే ఇబ్బంది పడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రిజర్వు బెంచ్‌ కూడా ఫుల్‌గా ఉంది. ప్రతి ఏటా కొత్త పేస్‌బౌలర్లు భారత్‌కు అందుబాటులోకి వస్తున్నారు. కొత్త సీమ్‌ బౌలర్లను తయారు చేస్తోన్న ఆ యంత్రం పేరు ‘ఎమ్మారెఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌’. మందకొడిగా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారత ఉపఖండం నుంచి అత్యుత్తమ బౌలర్లను తయారు చేసిన ఘనత దీనికి దక్కుతుంది. అంతేకాదు మిగిలిన దేశాల బౌలర్లు కూడా ఇక్కడి కొచ్చి శిక్షణ పొందుతున్నారంటే దీని స్థాయి అర్థం చేసుకోవచ్చు. త్వరలో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ వంటి బౌన్సీ పిచ్‌లను ఎదుర్కొనేందుకు భారత పేస్‌ దళం సిద్ధమవుతోంది. 

కపిల్‌ తర్వాత  ఎవరూ అనే ప్రశ్నతో..

1980ల్లో ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ భారత క్రికెట్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయన తర్వాత జట్టుకు ఆ స్థాయిలో పేస్‌బౌలింగ్‌ సేవలు అందించే వారు లభించగలరా..? అన్న ప్రశ్న సగటు క్రికెట్‌ అభిమానిని వేధించేది. ఇలాంటి ప్రశ్నే ఎమ్మారెఫ్‌ టైర్స్‌ నాటి ఎండీ రవి మెమ్మన్‌కు కూడా కలిగింది. కపిల్‌ స్థాయి బౌలర్లు నిలకడగా భారత జట్టులోకి రావాలంటే కచ్చితమైన వ్యవస్థ ఉండాల్సిందే అని ఆయన భావించారు. దీనికోసం ఓ క్రికెట్‌ పేస్‌ బౌలింగ్‌ పాఠశాలను ఏర్పాటు చేయడం అవసరమనుకొన్నారు. ఫలితంగా 1987లో ఎమ్మారెఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ మొదలైంది. చిన్న మొక్కలా మొదలైన ఈ సంస్థ కాలంగడిచే కొద్దీ మహా వృక్షంలా ఎదిగింది. భారత్‌లోనే అత్యంత విజయవంతమైన కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఒక సందర్భంలో రవి మెమ్మన్‌  ఆస్ట్రేలియా మాజీ పేస్‌ దిగ్గజం డెన్నిస్‌ లిల్లీతో మాట్లాడుతూ ‘‘దేశీయ పిచ్‌లపై భారతీయులు బాగానే రాణిస్తున్నారు. మనం దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా, విదేశీ పిచ్‌లపై కూడా రాణించాలి. అందుకే దీనిని ప్రారంభించాను’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి డెన్నిస్‌ లిల్లీ ఎమ్మారెఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌లో కొన్నేళ్లపాటు భారత యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చారు.

లిల్లీని భారత్‌ తీసుకొచ్చి..

కొత్తగా ఏర్పాటు చేసిన క్రికెట్‌ ఫౌండేషన్‌కు మంచి కోచ్‌ కావాలి. బౌలింగ్‌తోపాటు క్రీడాకారుల ఫిట్‌నెస్‌పై కూడా శ్రద్ధ చూపే వ్యక్తి అవసరం. దీనికి ఆసీస్‌ మాజీ క్రీడాకారుడు డెన్నిస్‌ లిల్లీ సరైన వ్యక్తి అని రవి నమ్మారు. ఎందుకంటే లిల్లీ ఒకసారి వెన్నెముక గాయం నుంచి కోలుకొన్నారు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు కఠినంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మారెఫ్‌ నాటి ఎండీ రవి.. తన మిత్రుడు, భారత వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మానీని సంప్రదించారు. కిర్మానీ సాయంతో లిల్లీతో  మాట్లాడి ఒప్పించారు. అటువైపు లిల్లీ కూడా.. క్రికెట్‌ బోర్డు కింద శిక్షణ ఇస్తే.. సవాలక్ష నిబంధనలు ఉంటాయి.. అదే ప్రైవేటు సంస్థ అయితే స్వేచ్ఛ ఉంటుందనే ఉద్దేశంతో ‘ఓకే’ చెప్పారు. డెన్నిస్‌ లిల్లీ ఏం కోరినా ఎమ్మారెఫ్‌ కాదనలేదు. శిక్షణార్థుల కోసం 11 బెడ్రూమ్‌ల గెస్ట్‌ హౌస్‌, ఆహారం అందించేందుకు ప్రత్యేక సిబ్బంది, ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌, ఆ తర్వాత శిక్షణ పొందుతున్న వారు కోలుకోవడానికి, సేదదీరడానికి స్విమ్మింగ్‌ పూల్‌ని కూడా సమకూర్చింది. వీటితోపాటు రెండు మైదానాలను సిద్ధం చేసింది. వీటిల్లో చిన్న మైదానంలో నెట్స్‌ ఏర్పాటు చేయగా.. పెద్ద మైదానాన్ని క్రికెట్‌ మ్యాచ్‌లోని వాస్తవిక పరిస్థితిపై అవగాహన తెచ్చుకొనేందుకు వాడేవారు. 

వీడియో విశ్లేషణ కాన్సెప్ట్‌..!

బౌలర్ల శిక్షణ సమయంలో వీడియో ఎనాలసిస్‌ కాన్సెప్ట్‌ను లిల్లీ తీసుకొచ్చారు. బౌలర్ల యాక్షన్‌ను రికార్డు చేసి.. దానిని విశ్లేషించి.. లోపాలు సవరించేవారు. స్టేట్‌ బోర్డులు శిక్షణ అభ్యర్థుల పేర్లను నామినేట్‌ చేస్తే లిల్లీనే స్వయంగా వారిని పరిశీలించి 12 మందిని మాత్రమే ఎంపిక చేసేవారు.

1988లో తొలిసారి చెన్నైలో చిదంబరం స్టేడియంలో ఎమ్మారెఫ్‌ పేస్‌ఫౌండేషన్‌ నాటి చీఫ్‌ కోచ్‌ టీఏ శేఖర్‌ నేతృత్వంలో శిక్షణ శిబిరం నిర్వహించింది. గంగూలీ, అజేయ్‌ జడేజా వంటి వారు ఈ శిబిరానికి హాజరయ్యారు. ఈ శిబిరం చివర్లో 15-20 ఏళ్ల మధ్య వారిని లిల్లీ స్వయంగా పరిశీలించి 12 మందిని ఎంపిక చేశారు. ఈ తొలి బ్యాచ్‌లో వివేక్‌ రాజ్‌దాన్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజ్‌ధాన్‌ భారత జట్టుకు ఆడారు. ఎమ్మారెఫ్‌ ఫౌండేషన్‌ రెండో బ్యాచ్‌లో జవగళ్‌ శ్రీనాథ్‌ ఉన్నారు.

టెస్టు క్రికెట్‌ ఆడే దేశాలు మొత్తం ఈ ఫౌండేషన్‌ను గుర్తించేందుకు ఎమ్మారెఫ్‌ కృషి చేసింది. ఏటా ఈ ఫౌండేషన్‌ నుంచి కొందరు క్రికెటర్లను ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ కోసం పంపిస్తుంది. ఇలా వెళ్లిన వారిలో శ్రీనాథ్‌, వెంకటేష్‌ ప్రసాద్‌ వంటి వారు కూడా ఉన్నారు.  వీరిద్దరూ కొన్నేళ్లపాటు భారత పేస్‌ దళానికి వెన్నెముకగా నిలిచారు. గ్లెన్‌ మెక్‌గ్రాత్, బ్రెట్‌ లీ వంటి వారూ ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ పొందారు.

1997లో జరిగిన ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌ల్లో జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ శ్రీనాథ్‌ దృష్టిని ఆకర్షించింది. ఈ విషయాన్ని శ్రీనాథ్‌ చీఫ్‌ కోచ్‌ టీఏ శేఖర్‌కు వివరించారు. ఆయన జహీర్‌ను కలుసుకొని ఎమ్మారెఫ్‌ ఫౌండేషన్‌లో డెన్నిస్‌ లిల్లీ వద్ద శిక్షణ పొందేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఎంపిక సమయంలో జహీర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ గమనించిన లిల్లీ  అతనిలో టీమ్‌ ఇండియాకు తగిన బౌలర్ ఉన్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత జహీర్‌ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. 1999-2001 మధ్య ఆసీస్‌ క్రికెట్‌ బోర్డుతో ఈ ఫౌండేషన్‌ ఒప్పందం కుదుర్చుకొంది. 1996 నుంచి దీనికి బీసీసీఐ గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు 2006లో దీనిని గుర్తించింది. 

20 మంది పేస్‌ బౌలర్లను అందించి..

ఇప్పటి వరకు ఎమ్మారెఫ్‌ ఫౌండేషన్‌ భారత జట్టుకు 20 మంది ఫాస్ట్‌బౌలర్లను అందించింది. వీరిలో జవగళ్‌ శ్రీనాథ్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, జహీర్‌ఖాన్‌, శ్రీశాంత్‌, వివేక్‌ రాజ్‌దాన్‌, మునాఫ్‌ పటేల్‌, ఆర్‌పీ సింగ్‌, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి స్టార్లు ఉన్నారు. అంతేకాదు ఇక్కడ శిక్షణ పొందిన విదేశీ అభ్యర్థులు ఆయా దేశాల జట్లకు ఎంపికయ్యారు. వీరిలో చమింద వాస్‌(శ్రీలంక), హెన్రీ ఒలంగా (జింబాంబ్వే), హీత్‌ స్ట్రీక్‌ (జింబాంబ్వే), మహమ్మద్‌ ఆసీఫ్‌ (పాక్‌), ఆసీస్‌ బౌలర్లు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌లీ ఉన్నారు. పేస్‌ బౌలర్‌ కావాలనే లక్ష్యంతో సచిన్‌ కూడా పాఠశాలలో చదివే సమయంలోనే ఇక్కడ శిక్షణ పొందారు. భారత్‌కు పేస్‌ దళాన్ని అందించేందుకు ఎమ్మారెఫ్‌ ఈ ఫౌండేషన్‌పై ఎంత ఖర్చు చేసిందనే విషయం బయటకు వెల్లడించదు. దీనిపై వ్యయం తేలిగ్గా రూ.100 కోట్లు దాటేస్తుందని నిపుణులు అంచనా. 25ఏళ్లపాటు ఈ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా సేవలు అందంచిన డెన్నిస్‌ లిల్లీ 2012లో రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానాన్ని స్టార్‌ బౌలర్‌ గ్లెన్‌ మెకగ్రాత్‌ భర్తీ చేశారు. ప్రస్తుతం గ్లెన్‌ ఈ ఫౌండేషన్‌ కోచింగ్‌ డైరెక్టర్‌.

మెరుగులు దిద్దుకొంటున్న భవిష్యత్తు తారలు..

టీమిండియాకు భవిష్యత్తులో నిలకడగా సేవలు అందించేందుకు పలువురు యువ క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. వీరిలో చేతన్‌ సకారియ, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ వారియర్‌, అర్షదీప్‌ సింగ్‌,  అర్జాన్‌ నగ్వస్వల్లా వంటి వారు ఉన్నారని ఇటీవల ఫౌండేషన్‌ హెడ్‌ ఎం.సెంథల్‌ నాథన్‌ ఓ ఆంగ్ల పత్రికకు వివరించారు. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో క్రీడాకారుల ఫిట్‌నెస్‌ దెబ్బతినకుండా ఇళ్ల వద్దే శిక్షణ పొందే ఏర్పాటు చేశారు. అంతేకాదు వారితో కోచ్‌లు నిత్యం టచ్‌లో ఉండి ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు సహకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని