MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్‌ అంటే!

గురువారం నుంచి వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) మొదలవ్వబోతోంది. దీంతో భారత్‌కు రెండో ప్రపంచకప్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

Updated : 04 Oct 2023 10:40 IST

జులపాల కుర్రాడిగా అడుగుపెట్టి.. అద్భుతమైన బ్యాటింగ్‌తో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగి.. అసాధారణమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో అదరగొట్టి.. నాయకుడిగా జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించి.. దిగ్గజంగా మారిన ఆ ఆటగాడు లేకుండా 16 ఏళ్లలో భారత్‌ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)  ఆడుతోంది. ఆ ఆటగాడే మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni). ప్రపంచ క్రికెట్లో అతని ముద్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2011 ప్రపంచకప్‌లో సారథిగా భారత్‌ను విజేతగా నిలిపిన మాహీ.. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ల్లో ధోని ప్రదర్శన.. ప్రస్తుత జట్టులో అతని లోటు తదితర విషయాల గురించి ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

ఆటగాడిగానే..

ధోని తన వన్డే ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఆటగాడిగానే మొదలెట్టి.. ఆటగాడిగానే ముగించాడు. 2007 ప్రపంచకప్‌లో జులపాల జట్టుతో యువ ఆటగాడిగా ధోని తొలిసారి ఈ వన్డే విశ్వ సమరంలో భాగమయ్యాడు. అతని షాట్లు.. దూకుడైన ఆటతీరు.. తనదైన శైలి సిక్సర్లు.. ఇలా ఆ ప్రపంచకప్‌తో ధోని ప్రపంచానికి పరిచయమయ్యాడనే చెప్పాలి. కానీ ఆ టోర్నీలో మూడు మ్యాచ్‌లే ఆడే అవకాశం దక్కించుకున్న ధోని 29 పరుగులే చేశాడు. కానీ అప్పుడే అతని అద్భుతమైన ప్రపంచకప్‌ కెరీర్‌కు తొలి అడుగు పడింది. ఆ తర్వాత నాలుగేళ్లలో అతని కెరీర్‌ రాకెట్‌ స్పీడ్‌తో సాగింది. 2011 ప్రపంచకప్‌ వచ్చేనాటికి నాయకుడిగా జట్టును గొప్పగా నడిపించే స్థాయికి చేరుకున్నాడు. సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ ఆ కప్పులో అదరగొట్టి విశ్వరూపం ప్రదర్శించాడు. 

మాహీ 8 ఇన్నింగ్స్‌ల్లో 241 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో శ్రీలంకపై 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి.. బ్యాట్‌ను తిప్పి.. 28 ఏళ్ల తర్వాత దేశానికి ప్రపంచకప్‌ అందించిన ఆ క్షణాలను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2015లో మరోసారి భారీ అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా సెమీస్‌లో నిష్క్రమించింది. ఆ టోర్నీలో 6 ఇన్నింగ్స్‌లో 59.25 సగటుతో 237 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్‌లో ఆటగాడిగా కోహ్లి సారథ్యంలో ఆడాడు ధోని. ఈ సారి 9 మ్యాచ్‌ల్లో 273 పరుగులు సాధించాడు. సెమీస్‌లో కివీస్‌పై అర్ధశతకంతో జట్టును గెలిపించేందుకు పోరాడాడు. కానీ అతని రనౌట్‌ జట్టుతో పాటు దేశాన్ని ఆవేదనలో ముంచెత్తింది. 

అతను లేని లోటు..

ఇప్పుడు ప్రపంచకప్‌ జట్టులో వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పంత్‌ దూరమవడంతో ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్, కేఎల్‌ రాహుల్‌ పోటీపడ్డారు. చివరకు కేఎల్‌ రాహుల్‌ ప్రధాన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చాడు. ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడంటే పరిస్థితి ఇలా ఉంది కానీ 2020 ఆగస్టు 15 కంటే ముందే జట్టులో ఒక్కరే వికెట్‌ కీపర్‌... అతనే ధోని. ఈ విషయంలో మరో మాటే లేదు. జట్టులోకి వచ్చినప్పటి నుంచి ధోనీనే వికెట్‌ కీపర్‌. వికెట్ల వెనుకాల అతని ప్రదర్శన అలాంటిది మరి. అందుకే వరుసగా నాలుగు వన్డే ప్రపంచకప్‌ల్లోనూ ధోనీకి తిరుగులేకుండా పోయింది. 25 ఇన్నింగ్స్‌ల్లో 42 ఔట్లలో పాలుపంచుకున్నాడు. 

మరోవైపు బ్యాటింగ్‌లో రాణించిన ధోనీ 29 మ్యాచ్‌ల్లో 780 పరుగులు చేశాడు. ఇక సారథిగా ధోని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అందరికీ తెలిసినవే. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయాల దిశగా నడిపించడంలో అతణ్ని మించిన వాళ్లు లేరనే చెప్పాలి. మ్యాచ్‌లో ప్రణాళికలు, పరిస్థితులను బట్టి వ్యూహాలు అమలు చేయడంలో ధోని దిట్ట. ఇప్పుడు మరోసారి భారత్‌లో జరగబోతున్న ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది. మరి 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ధోని జట్టును విజేతగా నిలిపాడు. మరి ఈ సారి పూర్తిగా స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన విశ్వవిజేతగా నిలుస్తుందేమో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని