Asia Cup 2023: ఆసియా కప్ 2023.. రమీజ్‌ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్‌ మాటల్లో..!

ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) నిర్వహణ ఎక్కడనేది.. దాదాపు ఖాయమైనట్లే. కానీ, పాక్‌ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నజామ్‌ సేథీ (Nazam Sethi) మాత్రం కాస్త గట్టిగానే తన ఉద్దేశం ఏంటో బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా (Jay Shah) దృష్టికి తీసుకెళ్లినట్లు పలు మీడియా కథనాల్లో వస్తున్నాయి.

Published : 05 Feb 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భేటీ జరిగింది. ఏసీసీ ఛైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah)తో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ నజామ్ సేథీ (Nazam Sethi) భేటీ అయ్యారు. అయినా ఆసియా కప్‌ - 2023 (Asia Cup 2023) నిర్వహణ ఎక్కడనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పలు నివేదికల ప్రకారం.. మినీ టోర్నీ పాక్‌లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది. కానీ, మార్చిలోనే  ప్రకటిస్తారని సమాచారం. అయితే, జైషాతో నజామ్ సేథీ ఏం మాట్లాడరనేది అధికారికంగా మాత్రం బయటకు రాలేదు. కానీ, అంతర్జాతీయ మీడియా వర్గాల ప్రకారం సేథీ కూడా పట్టు వదలకుండా తమ ఉద్దేశం  జైషాతో చెప్పినట్లు పేర్కొన్నాయి. గతంలో ఇదే అభిప్రాయాన్ని నాటి పీసీబీ ఛైర్మన్ రమీజ్‌ రజా కూడా చెప్పడం గమనార్హం.

‘‘పాక్‌ వేదికగా ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనకబోతే.. అక్టోబర్ - నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) తమ జట్టు కూడా పాల్గొనదు. ఇదే విషయాన్ని జైషా దృష్టికి నజామ్ సేథీ తీసుకెళ్లారు’’ అని అంతర్జాతీయ, పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. సేథీ తెలిపిన అభిప్రాయానికి జై షా ఆశ్చర్యానికి గురైనట్లు కూడా పేర్కొన్నాయి. నజామ్‌ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని జై షా ఊహించలేదని, అందుకే ఆశ్చర్యపోయినట్లు తెలిపాయి. సొంత దేశంలో మాజీల నుంచి వచ్చే విమర్శలను అడ్డుకోవడానికే నజామ్‌ సేథీ ఇలా మాట్లాడి ఉంటారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

భారత్ లేకుండా పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌ (Asia Cup 2023) వెలవెలబోవడం ఖాయం. ఈ విషయం ఐసీసీ, ఏసీసీతోపాటు పీసీబీకి కూడా తెలుసని.. కాబట్టి బీసీసీఐ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరించాల్సిన పాక్ క్రికెట్‌ బోర్డుకు నెలకొందని విశ్లేషకులు పేర్కొన్నారు. భారత్ - పాక్ మ్యాచ్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తితోపాటు ఆదరణ ఉంటుంది. ఆదాయం కూడా బాగానే వస్తుంది. మార్చిలో ఐసీసీ, ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం అనంతరం టోర్నీ వేదిక ఎక్కడనే అంశంపై తుది నిర్ణయం వెలువడుతుంది. యూఏఈ వేదికగానే ఆసియా కప్‌ నిర్వహించాలని ఏసీసీ తుది నిర్ణయం ప్రకటించినా సరే, ఆర్థికంగా వెనుకబడిన పాక్‌ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు క్రీడా పండితులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని