ఇదేం వ్యూహం? ఇంగ్లాండ్‌ది పిరికి క్రికెట్‌

టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ వ్యూహాలను ఆసీస్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ ప్రశ్నించాడు. చెపాక్‌లో ఇంగ్లిష్‌ జట్టు రక్షణాత్మక, పిరికి క్రికెట్‌ ఆడుతోందని విమర్శించాడు. రూట్‌సేన విజయం కోసం కాకుండా ఓడిపోవద్దన్న వైఖరితో ఆడుతోందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ నిర్భయంగా క్రికెట్‌ ఆడింది...

Published : 08 Feb 2021 19:39 IST

షేన్‌ వార్న్‌ విమర్శలు

(Phot:England cricket)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ వ్యూహాలను ఆసీస్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ ప్రశ్నించాడు. చెపాక్‌లో ఇంగ్లిష్‌ జట్టు రక్షణాత్మక, పిరికి క్రికెట్‌ ఆడుతోందని విమర్శించాడు. రూట్‌సేన విజయం కోసం కాకుండా ఓడిపోవద్దన్న వైఖరితో ఆడుతోందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ నిర్భయంగా క్రికెట్‌ ఆడింది కాబట్టే విజయాలు లభించాయని గుర్తు చేశాడు. ఈ మేరకు వార్న్‌ వరుస ట్వీట్లు చేశాడు.

చెపాక్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను సుదీర్ఘంగా ఆడింది. మొత్తం ఏడు సెషన్లు బ్యాటింగ్‌ చేసి 578 పరుగులు సాధించింది. అప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకుంది. టీమ్‌ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అయితే 241 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ కోహ్లీసేనను ఫాలోఆన్‌ ఆడించలేదు. మరి రెండో ఇన్నింగ్స్‌లోనైనా వేగంగా 200 పరుగులు చేసిందా అంటే అదీ లేదు. ఒక గమ్యం లేనట్టుగా ఆడింది. 47 ఓవర్లు ఆడి 178 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియాకు భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఓడించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒక రోజు మొత్తం కోహ్లీసేన బ్యాటింగ్‌ చేయగల అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తే బాగుండేదన్నది వార్న్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది.

‘మైకేల్‌ వాన్‌, మీ జట్టులో ఏం జరుగుతోంది? వారేం చేస్తున్నారు? దిశ దిశ లేకుండా ఆడుతున్నారా? వారెందుకు బౌలింగ్‌ చేయడం లేదు? రెండు ఇన్నింగ్సుల్లో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేసిన తర్వాత టీమ్‌ఇండియాకు బౌలింగ్‌ చేసి ఆలౌట్‌ చేయగలరా? ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా నిర్భయంగా సాహసోపేత క్రికెట్‌ ఆడింది. ఆ పోరాటం చూసేందుకు ఎంతో బాగుంది! ఆసీస్‌ గమ్యం లేకుండా రక్షణాత్మక క్రికెట్‌ ఆడి ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ ఇప్పుడు దిశ లేకుండా రక్షణాత్మక క్రికెట్‌ ఆడుతోంది’ అని వార్న్‌ ట్వీట్‌ చేశాడు.

‘ఈ మ్యాచు ఓడిపోవద్దన్న వైఖరితోనే ఇంగ్లాండ్‌ కనిపిస్తోంది. గెలిచేందుకు అత్యుత్తమ దారులు వెతక్కుండా, ఎన్ని ఓవర్లు అవసరమవుతాయో చూడకుండా ఆడుతోంది. ఆలౌట్‌ అయ్యేంత వరకు బ్యాటింగ్‌ చేయాలన్న నిర్ణయం ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచుతుంది. ప్రత్యేకించి స్పిన్నర్లపై అది ఎక్కువగా ఉంటుంది’ అని వార్న్‌ కొనసాగించాడు. ఇందుకు వాన్‌ ‘అలా కానివ్వండి’ అంటూ బదులివ్వడం గమనార్హం. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం ‘డిక్లేర్‌’ అంటూ పెద్ద అక్షరాలతో ట్వీట్‌ చేయడం ప్రత్యేకం.

ఇవీ చదవండి
పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారం
లోకల్‌ బాయ్స్‌ ఆల్‌రౌండ్‌ షో

 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని