NZ vs IND 2022: చివరి మ్యాచ్‌ తుది జట్టులో ఎవరుంటారో నాకూ తెలియదు: హార్దిక్‌ పాండ్య

మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ శతకంతో చెలరేగగా.. దీపక్ హుడా బౌలింగ్‌లో అదరగొట్టాడు. 

Published : 21 Nov 2022 02:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్‌పై 65 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి మ్యాచ్‌ మంగళవారం (నవంబర్ 22) జరగనుంది. కీలకమైన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ (111*)తోపాటు బౌలింగ్‌లో దీపక్ హుడా (4/10) రాణించారు. మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన సూర్యకుమార్‌ యాదవ్ మాట్లాడారు. 

ఎక్కువ బౌలింగ్‌ ఆప్షన్లు ఉండాలని కోరుకుంటా: హార్దిక్‌

మా కుర్రాళ్లు అదరగొట్టారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడినప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. బ్యాటింగ్‌కు దిగే ముందు కనీసం 170-175 పరుగులు చేస్తే పోరాడొచ్చని భావించాం. ఇక మా బౌలర్లు తొలి ఓవర్‌ నుంచే దూకుడైన మైండ్‌సెట్‌తో బంతులు సంధించారు. ప్రతి బంతికి వికెట్‌ తీయలేకపోవచ్చు కానీ.. ధోరణి మాత్రం దూకుడుగా ఉండాలి. అలాగే ఎక్కువగా బౌలింగ్‌ ఆప్షన్లు ఉండేలా నేను చూసుకుంటా. అయితే ప్రతిసారి వర్కౌట్‌ కాకపోవచ్చేమో కానీ.. ఎక్కువ మంది బ్యాటర్లు బౌలింగ్‌ వేయడం అలవాటు చేసినట్లు అవుతుంది. వారికి అవకాశం ఇస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతారు. అదేవిధంగా సహచరులు విజయవంతమైతే మిగతా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక చివరి టీ20లో ఎవరికి అవకాశం వస్తుందో ఇప్పుడే చెప్పలేను. నాకూ తెలియదు. అయితే జట్టులోని ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడతా. మిగిలింది ఒకటే కాబట్టి కాస్త కష్టతరమే అయినా ప్రయత్నిస్తా. 

నా ప్రణాళిక క్లియర్‌: సూర్యకుమార్‌

నేను బ్యాటింగ్‌కు పక్కా ప్రణాళికతో వెళ్తా. మా బ్యాటింగ్‌ లోతు తెలుసు కాబట్టి.. కనీసం 12వ ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నా. అప్పుడే కనీసం 170-175 పరుగులను సాధించాలని అనుకొన్నాం. అయితే నా షాట్ల వెనక ఉన్న రహస్యం ఏమీ లేదు. స్వతహాగా ఎంజాయ్‌ చేస్తూ కొట్టాలనే భావనతో ఆడటమే నా లక్ష్యం. ఇదంతా ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ కఠిన శిక్షణ పొందుతా. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యాం. అయితే ఇప్పుడు కూడా ఆటంకం కలిగించినప్పటికీ పూర్తిస్థాయిలో మ్యాచ్ జరగడం ఆనందంగా ఉంది. అలాగే మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లాం. తర్వాత ఏం జరుగుతుందనేదానిపై నేను పెద్దగా ఆలోచించను. నా గేమ్‌ ప్లాన్‌ను అమలు చేయడంపైనే దృష్టిసారిస్తా. మ్యాచ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts