PSL - Faulkner : పీఎస్ఎల్‌ ఎపిసోడ్‌లో ఫాల్కనర్‌ ట్విస్ట్‌.. అసలేం జరిగిందంటే..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బిగ్‌బాష్ లీగ్ సూపర్‌ హిట్‌ కావడం.. ఆయా దేశాలు, బోర్డులకు కాసుల వర్షం కురవడంతో..

Updated : 21 Feb 2022 08:49 IST

పరస్పర విమర్శలు.. కీలక నిర్ణయాలు 

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేమ్స్ ఫాల్కనర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే వాటిని పీసీబీ కొట్టేయడం.. ఫాల్కనర్‌ పీఎస్‌ఎల్‌ను వదిలి వెళ్తున్నట్లు ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఫాల్కనర్‌ ప్రవర్తనపైనా పలు విమర్శలు వచ్చాయి. ఇంతకీ అక్కడేం జరిగింది.. దీనికి ప్రధాన కారణం ఏంటనేది ఓ సారి పరిశీలిద్దాం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బిగ్‌బాష్ లీగ్ సూపర్‌ హిట్‌ కావడం.. ఆయా దేశాలు, బోర్డులకు కాసుల వర్షం కురవడంతో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఇలాంటి లీగ్ నిర్వహించాలని 2015లో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్ (పీఎస్‌ఎల్‌)ను ప్రారంభించింది. ఇటు ఆదాయంతోపాటు పాక్‌లో క్రికెట్‌ పురోగతికి కాస్త ఊతమిచ్చేలా రూపొందించుకుంది. ఈ లీగ్‌లో టీమ్ఇండియా మినహా మిగతా దేశాల్లోని చాలా మంది క్రికెటర్లు పాల్గొనేవారు. ఇలా గత సీజన్‌ నుంచి పీఎస్‌ఎల్‌లోని క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆసీస్‌ ఆటగాడు జేమ్స్ ఫాల్కనర్‌ బరిలోకి దిగాడు. మరో రెండు మ్యాచ్‌లు
మాత్రమే మిగిలి ఉన్నా ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు చెల్లించాల్సిన సొమ్మును ఇవ్వలేదని పీఎస్‌ఎల్‌పై ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశాడు. లీగ్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన టాలెంటెడ్‌ క్రికెటర్లు ఉన్నారు, ఫ్యాన్స్ అయితే సూపర్‌. అయితే పీసీబీ, పీఎస్‌ఎల్‌ ప్రవర్తించిన తీరు బాధాకరం. అందుకే వెళ్లిపోతున్నా. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా
’ అంటూ ట్వీట్ చేశాడు. 

ఆ ఆరోపణలు అసత్యం: పీసీబీ

ఫాల్కనర్‌ చేసిన సంచలన ఆరోపణలను పీసీబీ ఖండించింది. ఇవన్నీ అసత్య ఆరోపణలుగా కొట్టిపారేసింది. ‘జేమ్స్‌ ఫాల్కనర్‌ ఇలా చేసినందుకు బాధగా ఉంది. ఇప్పటి వరకు మామీద ఎవరూ ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. గతేడాది నుంచే పీఎస్‌ఎల్‌లో ఫాల్కర్‌ భాగమయ్యాడు. అతడికి చెల్లించాల్సిన మొత్తంలో 70 శాతం ముందుగానే ఇచ్చేశాం. మిగిలిన మొత్తం పీఎస్‌ఎల్‌ సీజన్‌ ముగిసిన 40 రోజుల్లోపు ఇస్తామని అగ్రిమెంట్‌లో స్పష్టంగా చెప్పాం. అయితే ఇప్పుడు కావాలనే పీసీబీ, పీఎస్‌ఎల్ మీద అభాండాలు వేస్తున్నాడు’’ అని పీసీబీ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా పీఎస్‌ఎల్‌లో ఆడకుండా జీవితకాల బ్యాన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. 

ఫాల్కనర్‌ ప్రవర్తనపైనా విమర్శలు

పీఎస్‌ఎల్‌లో సొమ్ము చెల్లించకపోవడంతో బస ఉంటున్న హోటల్‌లో వస్తువులను పగలగొట్టాడని ఫాల్కనర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా అక్కడి వస్తువులను బ్యాట్‌తో ధ్వంసం చేశాడని విమర్శలు చెలరేగాయి. ‘‘ జేమ్స్‌ ఫాల్కనర్‌ క్రమశిక్షణ వ్యవహారం సరిగా లేదు. బస చేసిన హోటల్‌ ఆస్తిని ధ్వంసం చేశాడు. ఆస్తి నష్టానికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విమానాశ్రయంలోనూ అతడి ప్రవర్తన అనుచితంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. అందుకే భవిష్యత్తులో పీఎస్‌ఎల్‌లో ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని పీసీబీ
వెల్లడిచింది. 

ఇదీ ఫాల్కనర్‌ నేపథ్యం.. 

ఆసీస్‌ తరఫున (2012-17) అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఫాల్కనర్‌ ఒకే ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టీ20ల్లో పాల్గొన్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 1200కుపైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 142 వికెట్లు తీశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌ను ఆసీస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. జేమ్స్‌ ఫాల్కనర్‌ భారతీయ క్రికెట్ అభిమానులకూ సుపరిచితుడే. ఐపీఎల్‌లో పుణె వారియర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ క్వాలెండర్స్‌ (2021), క్వెట్టా గ్లాడియేటర్స్‌ (2022) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని