Roger Federer: వింబుల్డన్‌ విజేతకే నో ఎంట్రీ.. ఎక్కడంటే!

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు గతంలో ఓసారి వింత అనుభవం ఎదురైందట. ఎనిమిదిసార్లు వింబుల్డన్‌ టైటిల్ గెలిచిన తనకు టెన్నిస్‌ క్లబ్‌లోకి అనుమతి లభించలేదదట. ఈ విషయాన్ని ఫెదరర్‌ స్వయంగా ఓ టీవీ షోలో తెలిపాడు. 

Published : 10 Dec 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. 20 గ్రాండ్‌ స్లామ్‌లు.. వివాదాలకు అతీతుడు.. గెలిచినా.. ఓడినా.. ఒకటే తీరు.. ఇది స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ గురించి చెప్పేమాటలు. రెండు నెలల క్రితం ఫెదరర్‌ తన ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అత్యధికసార్లు వింబుల్డన్‌ విజేత అయిన ఫెదరర్‌కు కూడా ఒకానొక సందర్భంలో వింబుల్డన్‌ క్లబ్‌లోకి అనుమతి లభించలేదట. ఈ విషయాన్నితనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ‘ది డెయిలీ షో’ అనే కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఫెదరర్‌  గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. 

‘‘ఓసారి నేను కుటుంబంతో కలిసి సౌత్‌-వెస్ట్‌ లండన్‌లోని వింబుల్డన్‌లో ఉన్నాను. అక్కడ డాక్టర్‌ను కలిసిన తర్వాత, మా విమాన ప్రయాణానికి చాలా సమయం ఉంది. దీంతో కాలక్షేపం కోసం దగ్గర్లో ఉన్న వింబుల్డన్‌ టెన్నిస్‌ క్లబ్‌కు వెళ్లి టీ తాగుదామని అనుకున్నాం. నేను నా కారును క్లబ్‌ గేటు దగ్గర కారు ఆపి, సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి.. నేను వింబుల్డన్‌ లోపలికి ఎలా వెళ్లాలి? గేటు ఎటువైపు అని అడిగాను. వెంటనే ఆమె మీకు మెంబర్‌షిప్‌ కార్డు ఉందా? అని అడిగింది. నిజానికి నాకు మెంబర్‌షిప్‌ కార్డు గురించి అవగాహనలేదు. వింబుల్డన్‌లో గెలిచిన వారికి అది ఇస్తారు. అది ఎక్కడో ఇంట్లో ఉండొచ్చు. ఆ సమయానికి నా దగ్గర కార్డు లేదు. అదే విషయాన్ని ఆమెతో చెప్పాను. కానీ, నా మాటల్ని నమ్మని సెక్యూరిటీ, మీరు వింబుల్డన్‌ గెలిస్తే మెంబర్‌షిప్‌ లభిస్తుంది కదా అని చెప్పడంతో.. కొద్దినిమిషాలపాటు ఏం చేయాలో నాకు అర్థంకాలేదు’’ అని ఫెదరర్‌ గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.

తర్వాత తను ఎనిమిదిసార్లు టోర్నమెంట్ గెలిచానని చెప్పినా ఆమె నమ్మలేదట. మెంబర్‌షిప్‌ కార్డు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తానని తెగేసి చెప్పడంతో, ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌వైపు ఉన్న మరో గేటు నుంచి లోపలికి వెళ్లినట్లు చెప్పాడు.  ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నిబంధనలు ఎరికైనా ఒకటే’, ‘నిజంగా ఇది జరిగిందా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2018 తర్వాత పలుమార్లు గాయాల బారినపడిన ఫెదరర్‌ ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన లావెర్‌ కప్‌ తర్వాత ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలికాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని