Ross Taylor : ఆ స్టార్‌ క్రికెటర్‌ను మా దేశం తరఫున ఆడమని కోరా: కివీస్‌ మాజీ బ్యాటర్‌

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మ కథ ‘బ్లాక్‌ అండ్ వైట్’ పుస్తకంలో కొంగొత్త విషయాలను వెల్లడిస్తున్నాడు. 2011లో భారత...

Published : 16 Aug 2022 01:09 IST

(ఫొటో సోర్స్‌ : రాస్‌టేలర్‌ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మ కథ ‘బ్లాక్‌ అండ్ వైట్’ పుస్తకంలో కొంగొత్త విషయాలను వెల్లడిస్తున్నాడు. 2011లో భారత టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంచైజీ యాజమాని ఒకరు తనను నాలుగు చెంపదెబ్బలు (చిన్నవే) కొట్టాడని.. అలానే రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న క్రేజ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం వంటి సందర్భాలను తెలిపాడు. తాజాగా ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ గురించీ ఓ సంచలన విషయం బయటపెట్టాడు. 2010 సమయంలో కివీస్‌ తరఫున ఆడాలని బెన్‌స్టోక్స్‌ను అడిగినట్లు పేర్కొన్నాడు. 

‘‘అప్పుడు స్టోక్స్‌కు 18.. 19 ఏళ్లు ఉంటాయని అనుకుంటా. కివీస్‌లోనే జన్మించిన అతడిని స్వదేశం కోసం ఆడించాలని భావించా. న్యూజిలాండ్‌ తరఫున ఆడతావా..? అని ఒక సందర్భంలో నేరుగా స్టోక్స్‌నే అడిగేశా. బెన్‌ కూడా ఆసక్తిగానే ఉన్నాడు. దీంతో వెంటనే కివీస్‌ క్రికెట్‌ సీఈవో జస్టిన్‌ వాన్‌కు సందేశం పంపా. బెన్‌స్టోక్స్‌ అనే కుర్రాడు మంచి క్రికెటర్‌ అవుతాడు. కివీస్‌ కోసం ఆడేందుకు ఆసక్తి ఉన్నాడని చెప్పా. స్టోక్స్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడాలని, అప్పుడే అతడిని తీసుకోవడంపై ఏదొక నిర్ణయం తీసుకుంటామని వాన్‌ బదులిచ్చాడు. అయితే దీనికి బెన్‌స్టోక్స్‌ ఆసక్తిగా లేడు. ఎందుకంటే మొదట్నుంచీ మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టడం అతడికి ఇష్టం లేదు. కివీస్‌కు ఆడాలని బెన్‌ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ క్రికెట్‌ బోర్డు మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో వెనకడుగు వేశాడు’’ అని పుస్తకంలో రాస్‌ టేలర్‌ వెల్లడించాడు. 

వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బెన్‌స్టోక్స్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున టెస్టులు, టీ20 ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. బెన్‌స్టోక్స్‌ పుట్టిన దేశం న్యూజిలాండ్‌ కావడం గమనార్హం. అయితే స్టోక్స్‌కు 12 ఏళ్లు ఉన్నప్పుడే ఇంగ్లాండ్‌కు అతడి కుటుంబం వలసవెళ్లిపోయింది. తర్వాత డర్హమ్‌ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. దాదాపు ఎనిమిదేళ్లు ఆ జట్టు తరఫున ఆడాడు. తర్వాత 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ మీదనే కీలక ఇన్నింగ్స్‌ ఆడిన బెన్‌ స్టోక్స్‌ క్రికెట్‌ పుట్టినిల్లు (ఇంగ్లాండ్‌)కు తొలి కప్‌ను అందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని