Rishabh Pant: ఆ పరిస్థితి రాగానే రిషభ్ పంత్‌ భయపడుతున్నాడు: వసీం జాఫర్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో అనుకోకుండా టీమ్‌ఇండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రిషభ్‌ పంత్‌. గాయం కారణంగా కేఎల్ రాహుల్‌ సిరీస్‌కు దూరం కావడంతో పంత్‌కి సారథిగా అవకాశం దక్కింది.

Published : 15 Jun 2022 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో అనుకోకుండా టీమ్‌ఇండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రిషభ్‌ పంత్‌. గాయం కారణంగా కేఎల్ రాహుల్‌ సిరీస్‌కు దూరం కావడంతో పంత్‌కి సారథిగా అవకాశం దక్కింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని పంత్‌ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతని సారథ్యంలో ఆడిన తొలి రెండు టీ20ల్లో భారత్‌ ఓటమిపాలైంది. కెప్టెన్ పంత్‌ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే టీమ్‌ఇండియా ఓటములు చవిచూస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. తొలి టీ20లో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌తో మ్యాచ్‌ చివరి ఓవర్‌ ముందు వరకు రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేయించడంతో పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పంత్‌ కెప్టెన్సీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

అంతేకాకుండా, రెండో టీ20లో ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌లను తుది జట్టులోకి తీసుకోవాలని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు సూచించారు. కానీ, వాటిని పట్టించుకోకుండా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్‌ కంటే ముందు అక్షర్‌ పటేల్‌ను పంపడంపై కూడా పంత్‌ కెప్టెన్సీని ప్రశ్నిస్తున్నారు. రెండో టీ20లో మిడిల్‌, డెత్ ఓవర్లలో పంత్‌ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ నేపథ్యంలో పంత్‌ కెప్టెన్సీ గురించి భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాట్లాడాడు. మ్యాచ్‌ ఉత్కంఠగా మారినప్పుడు రిషభ్ పంత్‌ భయపడుతున్నాడని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. పంత్‌ తన వ్యూహాల్లో మార్పులు చేస్తాడని, ఒకవేళ వాటి అమలు సరిగ్గా జరగకపోతే తొందరగా భయాందోళనలకు గురవుతున్నాడని జాఫర్‌ పేర్కొన్నాడు. ‘పంత్‌ ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే అంత మెరుగ్గా తయారవుతాడు. కానీ, ప్రస్తుతం అతడు మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారినప్పుడు కొంచెం భయపడుతున్నాడు’ అని వసీం జాఫర్ వివరించాడు. ఇదిలా ఉండగా, ఈ రోజు సాయంత్రం వైజాగ్‌ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టీ20 జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని