PengShuai: ఆస్ట్రేలియా ఓపెన్‌లోపెంగ్ షువాయి టీ షర్ట్‌లకు అనుమతి

చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యం సెగ ఆస్ట్రేలియా ఓపెన్‌ను తాకింది. ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆమెకు మద్దతు తెలిపే టీ షర్ట్‌ల వాడకంపై విధించిన నిషేధంపై ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

Published : 25 Jan 2022 23:24 IST

మెల్‌బోర్న్‌: చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యం సెగ ఆస్ట్రేలియా ఓపెన్‌ను తాకింది. ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆమెకు మద్దతు తెలిపే టీ షర్ట్‌ల వాడకంపై విధించిన నిషేధంపై ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. టెన్నిస్ దిగ్గజాలు, అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ‘పెంగ్ షువాయి ఎక్కడ ఉంది?’ అని రాసి ఉంచిన చొక్కాలు ధరించేందుకు నిర్వాహకులు అనుమతించారు. ఆమె జాడ కోసం శాంతియుతంగా వ్యవహరించినంతకాలం వాటిని ధరించవచ్చని పేర్కొన్నారు. చైనా క్రీడాకారిణికి మద్దతుగా ధరించిన చొక్కాలు, బ్యానర్లు తీసివేయాలంటూ మెల్‌బోర్న్‌ పార్క్‌లో వీక్షకులను భద్రతా సిబ్బంది ఆదేశించిన వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇది అత్యంత దయనీయమైన చర్య అంటూ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా మండిపడ్డారు. ఇలా పలువురి నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. 

చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్‌ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొద్దినెలల క్రితం పెంగ్‌ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. జాంగ్‌ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. ఆ అనంతరం కొద్ది వారాలు పాటు పూర్తిగా కనిపించకుండా పోయిన ఆమె.. ఆ తర్వాత తాను సురక్షితంగానే ఉన్నట్లు చెప్పింది. కానీ ఇప్పటికీ ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ  తోటి క్రీడాకారుణులు, అభిమానులు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. 

దీనిలో భాగంగానే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ‘పెంగ్ షువాయి ఎక్కడ?’ అనే చొక్కాలను ధరిస్తున్నారు. అయితే వాణిజ్యపరమైన, రాజకీయ పరమైన బ్యానర్లు, దుస్తులు, సంకేతాలు వినియోగించకూడదనే దీర్ఘకాలిక విధానం గురించి ప్రస్తావిస్తూ.. టెన్నిస్ ఆస్టేలియా ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో.. ఎటువంటి విఘాతం కలిగించకుండా, శాంతియుతంగా ఆ చొక్కాలను ధరిస్తున్నంతకాలం వాటిని అనుమతిస్తామంటూ పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని