IPL 2022: హార్దిక్‌ పాండ్య కష్టమే.. సారథ్యం వైపు శ్రేయస్‌ చూపు! 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలునలుగురు.....

Published : 30 Oct 2021 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలం త్వరలో జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా వస్తోన్న అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లకు మెగా వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించనుంది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యాలు ఎవరిని ఉంచుకుంటాయి..? మళ్లీ వేలంలో ఎవరిని తీసుకుంటాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నవంబర్‌ చివరి నాటికి రిటెయిన్‌ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది. తాను ఐపీఎల్‌ మెగా వేలంలోకి వస్తానని, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తనను రిటెయిన్‌ చేస్తుందనే నమ్మకం లేదని ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ముంబయి, దిల్లీ జట్లు ఎవరిని రిటెయిన్‌ చేసుకుంటాయనే దానిపై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. 

హార్దిక్‌ విషయంలో కష్టమే.. 

అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ అయిన ముంబయి ఇండియన్స్ ఎవరిని రిటెయిన్‌ చేసుకుంటుందనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముంబయి ఇండియన్స్‌లో అందరూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లే. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, కీరన్‌ పొలార్డ్‌ను రిటెయిన్‌ చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉందనే చెప్పాలి. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్యను ఉంచుకునే అవకాశాలు చాలా తక్కువని ఐపీఎల్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండేళ్ల కిందట హార్దిక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండేవాడని.. ప్రస్తుతం బౌలింగ్‌ చేసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. అదే సమయంలో బ్యాటింగ్‌లోనూ రాణించడం లేదు. అయితే పాండ్యను రిటెయిన్‌ చేసుకోకపోయినా, వేలంలో మాత్రం ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ముంబయి ఇండియన్స్‌ రిటెయిన్ చేసుకునే టాప్‌-4 జాబితాలో రోహిత్‌, బుమ్రా, పొలార్డ్‌, సూర్యకుమార్‌/ఇషాన్‌ కిషన్‌ ఉండొచ్చని విశ్లేషించారు.

* ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆల్‌ రౌండర్‌ పాత్రకు హార్దిక్‌ న్యాయం చేయలేదనే చెప్పొచ్చు. 12 మ్యాచులు ఆడిన పాండ్య  కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కటంటే ఒక్క అర్ధశతకం లేదు. అత్యధిక స్కోరు 40* పరుగులు. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లకుగాను ఒక అర్ధశతకంతో 281 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 60* పరుగులు. 

* 12 మ్యాచుల్లో ఒక్క మ్యాచులోనూ బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. గతేడాదీ ఇదే పరిస్థితి. వెన్నెముక గాయమైనప్పటి నుంచి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనూ  బౌలింగ్‌ చేయలేదు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటికీ వచ్చే మ్యాచుల్లో బౌలింగ్‌ చేస్తాడనే నమ్మకమూ తక్కువే. హార్దిక్‌ బదులు వేరే బ్యాటర్‌ను లేదా ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.


కెప్టెన్సీ వైపు అయ్యర్ చూపులు..!

శ్రేయస్‌ అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు. సారథిగా గత సీజన్‌లో డీసీని ఫైనల్‌కు చేర్చిన అయ్యర్‌ను కాదని ఈ సీజన్‌లో రిషభ్‌ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్ గాయపడటంతో డీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ 21 మొదటి దశకు దూరం కాగా.. రెండో దశకు అందుబాటులోకి వచ్చాడు. యూఏఈ ఎడిషన్‌లో శ్రేయస్‌ ఎనిమిది మ్యాచుల్లో 175 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే  డీసీ యాజమాన్యం  కెప్టెన్‌గా పంత్‌నే కొనసాగించింది. దిల్లీని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌కు పంత్‌ను కాదని అయ్యర్‌కు సారథ్యం అప్పగించే అవకాశాలు తక్కువే. అయితే టాప్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ను రిటెయిన్‌ చేసుకునేందుకు మాత్రం డీసీ మొగ్గు చూపుతుంది. అయితే సారథ్యం ఇవ్వకపోతే వచ్చే సీజన్‌లో దిల్లీకి ఆడేందుకు అయ్యర్ ఇష్టపడకపోవచ్చు. అవకాశం ఉంటే కొత్తగా వస్తున్న జట్లలో ఒకదానికి కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజస్థాన్‌ రాయల్స్, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త సారథుల కోసం వేట మొదలెట్టాయని.. అందుకే అయ్యర్ చూపు కెప్టెన్సీ వైపు మళ్లినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్‌ చేసుకోవాలంటే మాత్రం శిఖర్‌, పంత్, శ్రేయస్‌, హెట్‌మెయిర్‌, పృథ్వీషా, రబాడా, నార్జే ఆటగాళ్లలో నలుగురిని  అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. మరి ఎవరిని రిటెయిన్‌ చేసుకుంటారో వేచి చూద్దాం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని