T20 World Cup: సూపర్‌-8.. ఎంతెంత దూరం

సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లూ టీ20 ప్రపంచకప్‌ను రసవత్తరంగా మార్చుతున్నాయి.

Updated : 13 Jun 2024 03:12 IST

ఈనాడు క్రీడావిభాగం

సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లూ టీ20 ప్రపంచకప్‌ను రసవత్తరంగా మార్చుతున్నాయి. కొన్ని అనూహ్య ఫలితాలతో పెద్ద జట్ల పరిస్థితి తారుమారవుతోంది. మరి సూపర్‌-8 దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ గ్రూప్‌ నుంచి ఏ జట్టు ముందంజ వేస్తుంది? ఏది నిష్క్రమించేలా ఉంది? చూద్దామా?

పాక్‌కు ఛాన్స్‌ ఉందా? 

గ్రూప్‌- ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌ సూపర్‌- 8కు అర్హత సాధిస్తాయని టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్లుగానే వరుసగా ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై విజయాలతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా ముందంజ వేసింది. కానీ మరో స్థానం కోసం అమెరికాతో పోటీపడాల్సిన పరిస్థితి పాక్‌ది. అమెరికా చేతిలో అనూహ్య పరాజయం పాక్‌ అవకాశాలను దెబ్బతీసింది. మూడు మ్యాచ్‌ల్లో కెనడాపై మాత్రమే నెగ్గిన ఆ జట్టు 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒకటి ఓడిన అమెరికా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కెనడా (3 మ్యాచ్‌ల్లో ఒకటే విజయం), ఐర్లాండ్‌ (రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటములు) రేసు నుంచి నిష్క్రమించినట్లే! పాక్‌తో పోలిస్తే అమెరికా పరిస్థితే మెరుగు. ఐర్లాండ్‌తోనే పాక్, యుఎస్‌ తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా అవకాశాలుంటాయి. పాక్‌ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే. గెలిచినా నెట్‌ రన్‌రేట్‌ గణనీయంగా మెరుగుపర్చుకునేలా విజయం ఉండాలి. ఈ మ్యాచ్‌ల సందర్భంగా లాడర్‌హిల్‌లో వర్షం పడే సూచనలు పాక్‌కు ఆందోళన కలిగించేవే. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే మాత్రం పాక్‌కే నష్టం.


డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు కష్టమే!

త టీ20 ప్రపంచకప్‌ విజేత ఇంగ్లాండ్‌ ఈ సారి గ్రూప్‌ దశ దాటడమూ అనుమానమే. గ్రూప్‌- బి నుంచి వరుసగా మూడు విజయాలతో ఆస్ట్రేలియా సూపర్‌- 8 చేరింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఒమన్‌తో పాటు నమీబియా (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం, రెండు ఓటములు) కథ ముగిసింది. స్కాట్లాండ్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ రద్దు), ఇంగ్లాండ్‌ (2 మ్యాచ్‌ల్లో ఓ ఓటమి, ఓ రద్దు)లలో ఓ జట్టుకు మాత్రమే అవకాశాలున్నాయి. వర్షం కారణంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ రద్దవడం ఇంగ్లాండ్‌పై ప్రభావం చూపింది. ఆ తర్వాత ఆసీస్‌ చేతిలో ఓడింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడే స్కాట్లాండ్‌ రన్‌రేట్‌ (2.164) మెరుగ్గా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ గెలిస్తే ఇంగ్లాండ్‌కు దారులు మూసుకుపోతాయి. ఒకవేళ స్కాట్లాండ్‌ ఓడి.. ఒమన్, నమీబియాపై ఇంగ్లాండ్‌ గెలిస్తే అప్పుడు చెరో 5 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఆ పరిస్థితులో నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. ఇంగ్లాండ్‌ పైచేయి సాధించాలంటే భారీ విజయాలు అవసరం. ఇక వరుణుడు ఇంగ్లాండ్‌ను భయపెడుతున్నాడు. వర్షంతో తమ మ్యాచ్‌ల్లో ఒక్కటి రద్దయినా.. స్కాట్లాండ్‌తో ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరగకపోయినా ఇంగ్లిష్‌ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. 


త్రిముఖ పోరు 

గ్రూస్‌- సి లో త్రిముఖ పోరు ఆసక్తి రేపుతోంది. ఈ గ్రూప్‌ నుంచి ఇంకా ఏ జట్టూ సూపర్‌- 8 కు అర్హత సాధించలేదు. రెండేసి మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అఫ్గాన్‌ (5.225), విండీస్‌ (3.574) నెట్‌ రన్‌రేట్‌ కూడా ఉత్తమంగా ఉంది. ఈ రెండు జట్లకు మెరుగైన అవకాశాలున్నప్పటికీ ఇంకా మూడు మ్యాచ్‌లాడాల్సిన న్యూజిలాండ్‌ కూడా రేసులోనే ఉంది. తన తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో 84 పరుగుల తేడాతో ఓడటంతో కివీస్‌ రన్‌రేట్‌ -4.2గా ఉంది. అయితే వెస్టిండీస్, ఉగాండా, పాపువా న్యూ గినీ (పీఎన్‌జీ)పై ఆ జట్టు గెలిస్తే అప్పుడు 6 పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ కివీస్‌ చేతిలో ఓడినా.. అఫ్గానిస్థాన్‌పై విండీస్‌ గెలిస్తే 6 పాయింట్లతో ఉంటుంది. ఒకవేళ విండీస్‌ చేతిలో పరాజయం పాలైనా.. పీఎన్‌జీపై నెగ్గితే అఫ్గాన్‌ కూడా 6 పాయింట్లతో నిలుస్తుంది. ఇలా విండీస్, కివీస్, అఫ్గాన్‌ పాయింట్లు సమమవుతే నెట్‌రన్‌రేట్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. కానీ ముందుగా కివీస్‌కు గురువారం విండీస్‌ గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు పనైపోయినట్లే! ఇప్పటికే ఈ గ్రూప్‌లో పీఎన్‌జీ, ఉగాండా పోరాటం ముగిసింది! 


శ్రీలంక ఇంటికే!

టోర్నీలో మూడు మ్యాచ్‌లాడినా గెలుపు ముఖమే చూడని శ్రీలంక సూపర్‌- 8 చేరడం కష్టమే! గ్రూప్‌-డి లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టును దురదృష్టమూ వెంటాడడంతో నేపాల్‌తో పోరు వర్షంతో రద్దయింది. దీంతో ఒక్క పాయింట్‌తో అట్టడుగు స్థానంలో ఉన్న లంక గ్రూప్‌ దశ దాటాలంటే ముందు చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారీ విజయం సాధించాలి. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాలి. ఈ గ్రూప్‌ నుంచి వరుసగా మూడు విజయాలతో దక్షిణాఫ్రికా ముందంజ వేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గెలుపు, ఓటమితో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ మరో స్థానం కోసం పోటీపడుతున్నాయి. కానీ నెదర్లాండ్స్, నేపాల్‌తో ఆడాల్సి ఉన్న బంగ్లాకే సూపర్‌-8లో అడుగుపెట్టేందుకు ఎక్కువ ఆస్కారముంది. ముఖ్యంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ కీలకం కానుంది. 


20 జట్లను అయిదేసి చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో దేశం గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లు ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌- 8కు అర్హత సాధిస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు