IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ గెలుస్తుంది: మైఖేల్‌ వాన్‌

భారత జట్టుపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌ (Michael Vaughan) ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తుందని మైఖేల్‌వాన్ అభిప్రాయపడ్డాడు. 

Published : 26 Sep 2023 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వన్డే ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియా (Team India)లో దాదాపు అందరూ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చేశారు. బౌలింగ్‌ విభాగంలో అక్షర్‌ పటేల్ మినహా మిగతా అందరి విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. వరల్డ్ కప్‌నకు మందు దీన్ని భారత జట్టుకు శుభసూచకంగా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను సీనియర్లు రోహిత్‌, కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌లు లేకుండా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో టీమ్‌ఇండియా 400కు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌ (Michael Vaughan) ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తుందని మైఖేల్‌వాన్ అభిప్రాయపడ్డాడు. 

ఆసీస్‌పై రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయంలో మైఖేల్‌ వాన్‌ ‘‘ఇండియా 400 స్కోరు దిశగా సాగుతోంది’’ అని (x) ట్విటర్‌లో పోస్టు చేశాడు. కొద్దిసేపటి తర్వాత ‘‘నాకు చాలా స్పష్టత వచ్చేసింది. ఏ జట్టయితే భారత్‌ను ఓడిస్తుందో ఆ జట్టే  ప్రపంచ కప్ గెలుస్తుంది.స్వదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉంది. వారి బౌలింగ్ ఆప్షన్లు అన్ని కవర్‌ అయ్యాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు’’ అని (x)లో మరో పోస్ట్ చేశాడు.

మా జట్టుకు దిష్టిపెట్టకు  

వాన్‌ భారత జట్టుపై ప్రశంసలు కురిపించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer) ఫన్నీగా స్పందించాడు. ‘మా జట్టుకు దిష్టిపెట్టకు’ అనే అర్థం వచ్చేలా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ‘‘మైఖేల్‌వాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చావ్‌ భాయ్‌’’ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని