Rahul Vs Brar: పంజాబ్‌ను గెలిపించిందెవరు?

ఐపీఎల్‌లో కీలక సమయంలో విజయం సాధించింది పంజాబ్‌ కింగ్స్‌. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును శుక్రవారం ఓడించింది. మొదట కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌ విజృంభించడంతో పంజాబ్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది...

Published : 02 May 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో కీలక సమయంలో విజయం సాధించింది పంజాబ్‌ కింగ్స్‌. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును శుక్రవారం ఓడించింది. మొదట కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌ విజృంభించడంతో పంజాబ్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో కోహ్లీసేన తొలుత దూకుడుగా ఆడినా హర్‌ప్రీత్‌ బ్రార్‌ బంతితో విజృంభించడంతో 145/8కే పరిమితమైంది. 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మరి పంజాబ్‌ విజయంలో ఎవరు కీలక పాత్ర పోషించారని మీ ఉద్దేశం.

కేఎల్‌ రాహుల్‌: వాస్తవంగా పంజాబ్‌ చేసిన మొత్తం స్కోరులో 50 శాతానికి పైగా పరుగులు రాహుల్‌వే. అతడు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలవకపోతే పంజాబ్‌ 150 పరుగులైనా చేసేది కాదు. ఆరంభంలో నిలకడగా ఆడి క్రిస్‌గేల్‌తో కలిసి చితకబాదాడు. ఆపై వికెట్లు పడటంతో కుదురుగా ఉండి ఆఖర్లో పరుగుల వరద పారించాడు. 57 బంతుల్లోనే 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. 7 బౌండరీలు, 5 సిక్సర్లు బాదేసి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

హర్‌ప్రీత్‌ బ్రార్‌: పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర ఈ యువకుడిదే అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ సైతం అందుకున్నాడు. పంజాబ్ 118/5తో కష్టాల్లో పడింది. పూరన్‌, దీపక్‌ హుడా, షారుఖ్‌ వెంటవెంటనే పెవిలియన్‌ చేరడంతో రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. అలాంటి సమయంలో మొదట వికెట్‌ కాపాడుకున్నాడు హర్‌ప్రీత్‌. ఆ తర్వాత అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించి 17 బంతుల్లో 25తో అజేయంగా నిలిచాడు. జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇక బౌలింగ్‌లో చెలరేగి విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌ పంపించి బెంగళూరును దెబ్బకొట్టాడు.

క్రిస్‌గేల్‌:  వయసు పెరిగినా పరుగుల వరద ఆపడం లేదు ఈ విండీస్‌ వీరుడు. పంజాబ్‌ భారీ స్కోరు చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. మూడో స్థానంలో వచ్చి 24 బంతుల్లోనే 6 బౌండరీలు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. జట్టుకు జోరు అందించాడు. నిజానికి పంజాబ్‌ 5 ఓవర్లకు 29/1తో నిలిచింది. కానీ జేమీసన్‌ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 4, 4, 4, 4, 0, 4 బాదేసి పవర్‌ప్లేలో స్కోరును 49కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంతో 10 ఓవర్లకు పంజాబ్‌ 90/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఒకానొక దశలో మొతేరాలో 200+ స్కోరు చేసేలా కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని