zimbabwe vs pak: పాక్‌-జింబాబ్వే మధ్య ‘మిస్టర్‌ బీన్‌’ తుపాను..!

జింబాబ్వే-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ బీన్‌పై వివాదం మొదలైంది. ఈ వివాదంపై జింబాబ్వే అధ్యక్షుడు, పాక్‌ ప్రధాని కూడా స్పందించారు. అసలేమిటీ వివాదం..?

Updated : 28 Oct 2022 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా మిస్టర్‌ బీన్‌ క్యారెక్టర్‌ చూడగానే అందరి ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. కానీ, బీన్‌ బొమ్మను చూసి పాకిస్థానీయులు అవమానంతో కుతకుతలాడిపోతున్నారు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అనంతరం మిస్టర్‌ బీన్‌ క్యారెక్టర్‌ పాక్‌-జింబాబ్వే మధ్య సోషల్‌ మీడియాలో చిచ్చు రాజేసింది. ఈ ట్విటర్‌ యుద్ధంలో జింబాబ్వే అధ్యక్షుడు, పాక్‌ ప్రధాని కూడా పాల్గొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌ మ్యాచ్‌లో ఈ మిస్టర్‌ బీన్‌ గోలేంటని అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు.

ఫేక్‌ బీన్‌ వివాదం ఏమిటీ..?

2016లో జింబాబ్వేలో కొన్ని కామెడీ షోలు నిర్వహించారు. ఈ షోల కోసం నిర్వాహకులు మిస్టర్‌ బీన్‌ను పోలి ఉన్న పాక్‌ హాస్య నటుడు ఆసీఫ్‌ మహమ్మద్‌ను ఆహ్వానించారు. ఇతడు చూడటానికి నిజమైన మిస్టర్‌ బీన్‌ (బ్రిటిష్‌ నటుడు రోవాన్‌ ఆట్కిన్సన్‌)ను పోలి ఉంటాడు. కానీ, జింబాబ్వే రాజధాని హరారేలో జరిగిన షోలో ఇతడి ప్రదర్శన ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయంపై 2016లో జింబాబ్వే పత్రిక ‘న్యూస్‌డే.కో.జెడ్‌డబ్ల్యూ’ కూడా కథనం ప్రచురించింది. కొంత మంది షో మధ్య నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది.  అప్పట్లో ఈ ఫేక్‌ మిస్టర్‌ బీన్‌ జింబాబ్వే వీధుల్లో పర్యటనకు పోలీసులు రక్షణ కూడా కల్పించారు. చాలా మంది జింబాబ్వే ప్రజలు.. ఇతడు అసలైన మిస్టర్‌ బీన్‌గా భావించి ప్రదర్శన టిక్కెట్లు కొన్నట్లు కూడా వార్తలొచ్చాయి.

సోషల్‌ మీడియా యుద్ధం ఇలా..

ఇక పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోతే ఒక ఆట ఆడుకుందామని జింబాబ్వే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్‌ జట్టు మ్యాచ్‌ కోసం ప్రాక్టిస్‌ ఫొటోలను ట్వీట్‌ చేసిన వెంటనే.. జింబాంబ్వే అభిమాని ఒకరు స్పందించాడు. అసలు మిస్టర్‌ బీన్‌కు బదులు ఫేక్‌ బీన్‌ను పంపిన విషయాన్ని తమ దేశస్థులు మరచిపోరని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేపటి మ్యాచ్‌లో ఈ వ్యవహారం సెటిల్‌ చేస్తామని హెచ్చరించాడు. అంతేకాదు.. ఓటమి తప్పించుకోవాలంటే వరుణ దేవుడిని ప్రార్థించాలనీ సూచించాడు. 

జింబాబ్వే అభిమానులు ఆశించినట్లే వారి జట్టు పాక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో పాక్‌ జట్టును వెక్కిరించడం మొదలుపెట్టారు. ఈ ఆన్‌లైన్‌ ట్రోలర్లతో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ కూడా తోడయ్యారు. ‘‘ జింబాబ్వే విజయం అద్భుతం.. అభినందనలు చెవ్రాన్స్‌. వచ్చేసారి నిజమైన మిస్టర్‌ బీన్‌ను పంపండి. #pakvszim’’ అని పాక్‌ను వెక్కిరిస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ.. ‘‘మా వద్ద అసలైన మిస్టర్‌ బీన్‌ ఉండకపోవచ్చు. కానీ, మా వద్ద అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీలకు అద్భుతంగా తిరిగిపుంజుకొనే తమాషా అలవాటు ఉంది.  మిస్టర్‌ ప్రెసిడెంట్‌: అభినందనలు. మీ జట్టు ఈ రోజు నిజంగా బాగా ఆడింది’’ అని సమాధానం ఇచ్చారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని