మెగా టోర్నీలో అత్యధిక సెంచరీల వీరులు వీరే!

టెస్టులు.. వన్డేల్లో సెంచరీలు బాదడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త క్రీజ్‌లో కుదురుకుంటే సరిపోద్ది.. అదే పొట్టి ఫార్మాట్‌లో...

Updated : 25 Mar 2022 20:05 IST

క్రిస్‌ గేల్‌ను అధిగమించేందుకు విరాట్‌కు మంచి అవకాశం..

టెస్టులు.. వన్డేల్లో సెంచరీలు బాదడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త క్రీజ్‌లో కుదురుకుంటే చాలు. అదే పొట్టి ఫార్మాట్‌లో శతకం చేయడమంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఉండేదే 120 బంతులు.. బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఆడతామనుకుంటే ఇక్కడ కుదరదు. అయితే ఓపెనర్లు, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగేవారికి మాత్రం కాస్త అవకాశం ఉంటుంది . అయితే.. తొలి బంతి నుంచే వీర బాదుడు మొదలెట్టాలి.  మెగా టోర్నీలో ఈ విధంగా అత్యధికంగా సెంచరీలను సాధించిన ఆటగాళ్లు ఎవరు.. వారు ఎన్ని పరుగులు చేశారు.. ఓ సారి తెలుసుకుందాం..

  1. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లను ఆడటంలో దిట్ట. గత సీజన్‌ వరకు 142 మ్యాచుల్లో 141 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలను బాదాడు. మరో 31 అర్ధశతకాలూ తన ఖాతాలో ఉన్నాయి. 148.96 స్ట్రైక్‌రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఎక్కువ శతకాలు చేసిన బ్యాటర్‌ ఇతడే. అయితే గత కొన్నేళ్లుగా ఫామ్‌ పరంగా ఇబ్బంది పడుతుండటంతో ఈసారి ఏ జట్టూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.
  2.  అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ (973) రికార్డు సృష్టించాడు. 2016వ సీజన్‌లో ఈ ఘనత అందుకున్నాడు.  207 మ్యాచుల్లో 199 ఇన్నింగ్స్‌లు ఆడి ఐదు శతకాలు సాధించాడు. అంతేకాకుండా మరో 42 హాఫ్ సెంచరీలను కొట్టాడు. 129.95 సగటుతో 6,283 పరుగులు చేసిన ‘రన్‌ మిషన్‌’ ఈ సారి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని బెంగళూరు తరఫున బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు. క్రిస్‌ గేల్‌ శతకాల రికార్డును అధిగమించే సత్తా ఉన్నవారిలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.
  3. తన కెప్టెన్సీతో హైదరాబాద్‌కు టైటిల్‌ను అందించిన డేవిడ్‌ వార్నర్‌ మూడుసార్లు ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గత సీజన్‌ వరకు 150 మ్యాచ్‌ల్లో 139.97 సగటుతో నాలుగు శతకాలు సాధించాడు. అదే విధంగా 5,449 పరుగులు చేశాడు. ఇందులో 50 అర్ధశతకాలు ఉండటం విశేషం. ఈ సారి దిల్లీ అతడిని సొంతం చేసుకుంది.
  4. ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ క్రీజ్‌లో ఉంటే భారీ షాట్లను అలవోకగా కొట్టేయగలడు. ఓపెనర్‌ నుంచి మిడిలార్డర్‌ వరకూ ఏ స్థానంలోనైనా పరుగులు రాబడతాడు. మెగా టోర్నీలో 145 మ్యాచ్‌లకుగాను 141 ఇన్నింగ్స్‌ల్లో 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్‌ ప్రస్తుత సీజన్‌లో దిల్లీకి సహాయక కోచ్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు.
  5. మిస్టర్ 360.. మైదానం నలువైపులా షాట్లు కొట్టగలిగే ఏబీడీ తెలియని వారుండరు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడి ఖాతాలో మూడు ఐపీఎల్‌ శతకాలు ఉన్నాయి. బెంగళూరు తరఫున కీలక ఇన్నింగ్స్‌లను ఆడిన ఏబీడీ 5,162 పరుగులు చేశాడు. మొత్తం 184 మ్యాచుల్లో 170 ఇన్నింగ్స్‌ల్లో మూడు శతకాలు, 40 అర్ధశతకాలు సాధించాడు.
  6. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ టీమ్‌ఇండియా తరఫున ఆడింది తక్కువే అయినా ఈ మెగా టోర్నీలో మాత్రం మూడు శతకాలను నమోదు చేశాడు. గత సీజన్‌ వరకు 121 మ్యాచులకుగాను 117 ఇన్నింగ్స్‌ల్లో 134.21 సగటుతో 3,068 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. వరుసగా మూడో సీజన్‌లో రాజస్థాన్‌కు నాయకత్వం వహిస్తోన్న ఈ యువక్రికెటర్‌కూ క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. 
  7. శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, బ్రెండన్ మెక్‌కల్లమ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మురళీ విజయ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, బెన్‌ స్టోక్స్‌, హషీమ్‌ ఆమ్లా తదితరులు ఐపీఎల్‌లో రెండేసి శతకాలను నమోదు చేశారు. అయితే ప్రస్తుత సీజన్‌లో ధావన్‌, రహానె, కేఎల్‌ రాహుల్ మాత్రమే ఆడుతున్నారు. వీరిలోనూ ఫామ్‌ పరంగా చూసుకుంటే ధావన్‌, రాహుల్‌ మెరుగ్గా ఉన్నారు. రహానెకు తుది జట్టులో స్థానం దక్కడమూ కష్టమే. 
  8. ప్రస్తుత సీజన్‌ ఆడే ఆటగాళ్లలో ముంబయి సారథి రోహిత్ శర్మ, అంబటి రాయుడు, మనీశ్ పాండే, స్టీవ్‌ స్మిత్, రిషభ్‌ పంత్, డికాక్‌, మయాంక్‌ అగర్వాల్‌, వృద్ధిమాన్‌ సాహా, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, దేవ్‌దుత్‌ పడిక్కల్‌, డేవిడ్ మిల్లర్ తలో ఒక్కో సెంచరీ నమోదు చేశారు. అయితే క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకో ఆరు శతకాలను చేయాల్సి ఉంటుంది. మరి ఈ సీజన్‌లో ఏం చేస్తారో చూడాల్సిందే. 
  9. మాజీ ఆటగాళ్లు కొందరు సైతం సెంచరీలను కొట్టారు. సచిన్‌ తెందూల్కర్, షాన్‌మార్ష్, యూసఫ్ పఠాన్, మైకెల్‌ హస్సీ, మహేల జయవర్థెనె, లెండ్ సిమన్స్, కెవిన్ పీటర్సెన్, ఆండ్రూ సైమండ్స్, సనత్‌ జయసూర్య, పాల్ వాల్తటీ శతకాలతో రాణించారు. వీరందరూ తక్కువ మ్యాచుల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని