Rohit-Kohli: రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?

పొట్టి వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్‌, కోహ్లీ టీ20లకు గుడ్‌ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది.

Updated : 02 Jul 2024 07:06 IST

భారత టీ20 క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఇన్నాళ్లు భారత జట్టు తరఫున పరుగుల వరద పారించిన రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లను ఇక పొట్టి క్రికెట్‌లో చూడలేం. ఈ ఇద్దరూ యోధులకు 2024 టీ20 ప్రపంచ కప్‌ ఫైనలే చివరి మ్యాచ్‌. పొట్టి వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్‌, కోహ్లీ టీ20లకు గుడ్‌ బై చెప్పేశారు. మరో టీ20 ప్రపంచ కప్‌కు రెండేళ్ల సమయమే ఉంది. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ వీలైనంత త్వరగా రోహిత్‌, కోహ్లీ లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లెవరో గుర్తించాలి. అలా చేస్తేనే టీమ్ఇండియా ప్రపంచ కప్‌ టైటిల్‌ రేసులో ముందుంటుంది. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. ఈ రేసులో పలువురు స్టార్లు ఉన్నారు. 

యశస్వి జైస్వాల్ 

ఐపీఎల్‌లో అదరగొట్టి భారత టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యశస్వి జైస్వాల్‌. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సత్తాచాటి టీ20 జట్టులో చోటు సంపాదించాడు. టీమ్‌ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్‌ జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. జట్టు కూర్పులో భాగంగా ఈ టోర్నీలో జైస్వాల్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ కుర్రాడు భారత జట్టు తరఫున ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 161.93 స్ట్రెక్‌రేట్‌తో 502 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ శతకాలు బాదాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తే మరింత రాటుదేలుతాడు. 

శుభ్‌మన్ గిల్ 

వన్డే జట్టు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు టీ20 క్రికెట్‌లోనూ మంచి రికార్డు ఉంది. 2023 ఐపీఎల్‌ సీజన్‌లో 890 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత జట్టు తరఫున మాత్రం టీ20ల్లో అంతగా రాణించలేదు. ఇప్పటివరకు 14 టీ20లు ఆడి 335 పరుగులే చేశాడు. కానీ, గిల్‌కు టీ20ల్లో సత్తాచాటే సామర్థ్యముంది. త్వరలో జింబాబ్వే జరగనున్న టీ20 సిరీస్‌కు శుభ్‌మన్‌నే కెప్టెన్‌గా నియమించారు. ఈ యువ ఆటగాడు వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో కీలకపాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

అభిషేక్ శర్మ 

2024 ఐపీఎల్‌ సీజన్‌లో అభిషేక్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడి మెరుపు బ్యాటింగ్‌ విన్యాసాలతో అదరగొట్టాడు. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. సెలక్టర్ల దృష్టినీ ఆకర్షించిన ఈ కుర్రాడు అభిషేక్ శర్మ.. త్వరలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి జట్టు  బౌలర్లను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాడు ఈ యువ క్రికెటర్‌. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు (42) బాదింది ఇతడే. ఎడమచేతివాటం స్పిన్నర్‌గాను ఉపయుక్తంగా ఉంటాడు. అభిషేక్‌ గాయాలపాలవ్వకుండా స్థిరంగా జట్టులో కొనసాగితే అద్భుతాలు సృష్టించడం ఖాయం. 

కేఎల్ రాహుల్ 

రోహిత్‌, కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోవడంతో టీమ్ఇండియా టాప్‌ ఆర్డర్‌లో కేఎల్‌ రాహుల్ ఒక్కడే సీనియర్‌గా కనిపిస్తున్నాడు. రిషభ్ పంత్, సంజు శాంసన్‌ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్‌లు ఉండటంతో రాహుల్‌కు ఈ టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కలేదు. కానీ, 72 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న రాహుల్‌ అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ఇండియాకు చాలా కీలకం. సీనియర్లు తప్పుకోవడంతో ఆ బాధ్యతను రాహుల్ తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరముంది. రాహుల్ భారత్ తరఫున టీ20ల్లో 37.75 సగటుతో 2,265 పరుగులు చేశాడు. 

రుతురాజ్ గైక్వాడ్ 

2021లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇతడు తోటి ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగే రుతురాజ్ ఇప్పటివరకు 19 టీ20లు ఆడి 35.71 సగటుతో 500 పరుగులు చేశాడు. జట్టు స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రుతురాజ్‌కు మరో అవకాశం దొరికింది. ఇతడు జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. 

ఇషాన్‌ కిషన్ 

ఎడమ చేతివాటం బ్యాటర్‌ అయిన ఇషాన్ కిషన్ టీమ్‌ఇండియాకు మంచి ఓపెనింగ్ ఆప్షన్‌. కొన్నాళ్లపాటు టీ20 జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉన్న ఇషాన్ ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకొని ఇండియాకు వచ్చేశాడు. ఇది టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు అతణ్ని పక్కనపెట్టారు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కలేదు. దూకుడుగా ఆడే కిషన్ వికెట్ కీపర్‌గానూ ఉపయోగపడతాడు. అతడు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులోకి వస్తే టీమ్‌ఇండియాకు మరింత బలం చేకూరుతుంది.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని