Team India: టీ20 ప్రపంచకప్‌ ‘సూపర్-8’ పోరు.. భారత్‌ను ఢీకొట్టే జట్లు ఇవే..!

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సూపర్-8కి చేరుకున్న సంగతి తెలిసిందే. మరి అక్కడ మూడు జట్లతో తలపడాల్సి ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం..

Published : 14 Jun 2024 19:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సంగ్రామంలో గ్రూప్ స్టేజ్‌ రసవత్తరంగా సాగుతోంది. పెద్ద జట్లలో కొన్ని ఇంటిముఖం పట్టేందుకు సిద్ధమవుతుండగా.. పసికూనలు అనుకునేవి సూపర్-8లో ఆడేందుకు దూసుకొస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన టీమ్‌ఇండియా ఇప్పటికే తదుపరి దశకు చేరుకుంది. మరి సూపర్-8లో భారత్‌ను ఢీకొట్టే ఆ ‘మూడింట్లో’ రెండు తేలిపోయాయి. మరి అవేంటి? ఆ థర్డ్‌ టీమ్‌ ఏదయ్యే అవకాశం ఉందంటే?

  • టీమ్‌ఇండియా ప్రస్తుతం గ్రూప్‌ -Aలో అగ్రస్థానంలో ఉంది. శనివారం కెనడాతో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ సూపర్-8కి వెళ్లిపోయింది.
  • తదుపరి దశలో మిగతా మూడు గ్రూప్‌ల నుంచి టాప్-2లోని ఒక్కో జట్టుతో కలిసి మళ్లీ గ్రూప్ -1గా ఆడాల్సి ఉంటుంది. 
  • ఇందుకోసం ముందే ఆయా జట్లకు సీడింగ్‌లను ఐసీసీ కేటాయించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఈ సీడింగ్‌ ప్రకారమే సూపర్-8లో ఆయా జట్లు తలపడతాయి. ఇక్కడ భారత్‌కు A1 సీడింగ్‌ లభించింది.
  • ఉదాహరణకు ఆస్ట్రేలియాకు ఇక్కడ గ్రూప్‌-B నుంచి రెండో సీడింగ్‌ కేటాయించారు. అంటే, ఈ గ్రూప్‌లో ఆ జట్టు ఎక్కువ పాయింట్లు సాధించి మొదటిస్థానంలో ఉన్నా సరే సీడింగ్‌ ప్రకారం B2గా పరిగణిస్తారు. 
  • ర్యాంకింగ్‌ల ప్రకారం కేటాయించిన సీడింగ్‌ల్లో ఆయా జట్లు క్వాలిఫై కాకుండా.. అన్‌సీడెడ్‌ టీమ్‌ వస్తే దానికే ఆ ప్లేస్‌ను కేటాయించడం జరుగుతుంది. C1గా న్యూజిలాండ్‌, D2గా శ్రీలంక ఉన్నాయి. 
  • కానీ, పైన చెప్పిన రెండు జట్లూ సూపర్-8కి అర్హత సాధించలేదు. దీంతో C1గా అఫ్గానిస్థాన్‌ ఖరారు కాగా.. D2గా బంగ్లాదేశ్‌  లేదా స్కాట్లాండ్‌ వచ్చే అవకాశం ఉంది. 
  • సూపర్-8లో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడాలి. అందులో కనీసం రెండు గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇంటిముఖం పట్టక తప్పదు.
  • సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో (C1 vs A1) భారత్‌ జూన్‌ 20న తలపడనుంది. దీనికి వేదిక బార్బడోస్. తొలిసారి ఈ వరల్డ్‌ కప్‌లో భారత్ విండీస్‌ పిచ్‌లపై ఆడనుంది.
  • రెండో మ్యాచ్‌గా D2 టీమ్‌గా వచ్చే ప్రత్యర్థితో (జూన్ 22న) ఆడాల్సి ఉంటుంది. ఈ రేసులో బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. తమ చివరి మ్యాచుల్లో ఎవరు గెలిస్తే వారు రెండో స్థానంతో సూపర్-8కి చేరతారు. 
  • ఇక సూపర్-8లో భాగంగా భారత్‌ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. జూన్ 24న B2 vs A1 సీడింగ్‌ ప్రకారం తలపడాల్సి ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని