BCCI - Kohli : కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంకా సమయం ఉంది : బీసీసీఐ

విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులందరినీ విస్మయానికి గురి చేశాడు. దీంతో తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది...

Published : 17 Jan 2022 15:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులందరినీ విస్మయానికి గురి చేశాడు. దీంతో తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. టీమ్‌ఇండియా తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దానికి మరింత సమయముందని పేర్కొన్నారు.

‘విరాట్‌ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో ఇంకా ఎవరి పేరు చర్చకు రాలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా సమయముంది. సరైన సమయంలో సెలెక్టర్లు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. టీమ్‌ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ ఎంపిక ఉంటుంది. సెలెక్షన్ కమిటీ సిఫారసు మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం. రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగించాలనుకుంటున్నాం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. విదేశాల్లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టును అగ్రస్థానానికి చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు కెప్టెన్‌గా ఎవరిని నియమించినా.. కఠిన సవాళ్లు ఎదుర్కోక తప్పదు. జట్టుని ముందుండి నడిపించడం అనుకున్నంత సులభం కాదన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతానికైతే, టెస్టు కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ ముందంజలో ఉన్నాడు. రోహిత్‌ శర్మను వైస్ కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని