Updated : 19 Sep 2020 17:28 IST

ఆరంభ పోరులో గెలుపెవరిది?

ముంబయి×చెన్నై పోరుపై పెరిగిన ఆసక్తి

పొట్టి క్రికెట్‌ వేడుకకు వేళైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి ముస్తాబైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, రన్నరప్‌ చెన్నై వీనులవిందైన ఆటతో అభిమానుల మనసుల్ని పసందు చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లుచెదిరే సిక్సర్లు.. వికెట్లను ఎగరగొట్టే బంతులతో రంజింపచేసేందుకు ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. తొలి సమరంలో బాహాబాహీకి దిగుతున్న రెండు జట్ల బలాబలాలేంటో తెలుసుకుందాం పదండి మరి!


ముంబయిదే పైచేయి‌

లీగులోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి‌, చెన్నై. రోహిత్‌ నాలుగుసార్లు తన జట్టును విజేతగా నిలిపితే చెన్నైకి మహీ మూడుసార్లు ట్రోఫీ అందించాడు. ఎక్కువ ఫైనళ్లు ఆడింది చెన్నై కాగా ఆడిన ఫైనళ్లలో ఎక్కువగా గెలిచింది మాత్రం మరాఠాలే. మొత్తంగా ఈ రెండు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా ముంబయి 17, చెన్నై 11 విజయాలు అందుకున్నాయి. నాలుగు సీజన్లలో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీపడితే మూడుసార్లు ముంబయే గెలవడం గమనార్హం. అందుకే ఈ రెండు జట్లూ తలపడుతున్నాయంటే దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఎడతెగని ఆసక్తి ఏర్పడుతుంది.


సగటు 140‌

అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ముంబయికి ఇదే సొంత మైదానం. ఆ జట్టు ఇక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుంది. దుబాయ్‌ నుంచి చెన్నై వస్తోంది. అంటే ఇక్కడి పరిస్థితులేమిటో తెలియకపోవడంతో ఆడటం ధోనీసేనకు ఆడటం సవాలే. పొడిగా ఉండే ఈ పిచ్‌పై భారీ స్కోర్లేమీ నమోదవ్వవు. ఏడాదిన్నరగా ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 140గా ఉంటోంది. మైదానం పెద్దది కావడంతో సిక్సర్లు బాదే అవకాశం తక్కువ. ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టొచ్చు. నెమ్మది పిచ్‌ కావడంతో సింగిల్స్‌ తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.


సారథులే బలం

సారథులే ఈ రెండు జట్లకు ప్రధాన బలం. మహీ, రోహిత్‌ నాయకత్వ శైలి దాదాపు ఒకేలా ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు. అవసరమైతేనే కలగజేసుకుంటారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటారు. ధోనీ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించినా హిట్‌మ్యాన్‌ సైతం తక్కువోడేమీ కాదు. డికాక్‌, రోహిత్‌, క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కృనాల్‌తో ముంబయి బ్యాటింగ్‌ అత్యంత భీకరంగా కనిపిస్తోంది. చెన్నైకి టాప్‌ ఆర్డర్‌పై స్పష్టత లేదు. రాయుడు, వాట్సన్‌, ధోనీ, మురళీ విజయ్‌, కేదార్‌‌పై ఆధారపడాల్సి ఉంది. రుతురాజ్‌ అందుబాటులో లేడు. అయితే జడ్డూ, దీపక్‌ బ్యాటు ఝుళిపించగలరు. బౌలింగ్‌ పరంగానూ ముంబయికి తిరుగులేదు. పవర్‌ప్లే, డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా ఉన్నాడు. అతడికి తోడుగా ట్రెంట్‌ బౌల్ట్‌ కొత్తబంతిని పంచుకోగలడు. ధవళ్ కులకర్ణి, నేథన్‌ కౌల్టర్‌నైల్‌, ప్యాటిన్‌సన్‌ ఉన్నారు. చక్కని స్పిన్నర్లూ ఆ జట్టు సొంతం. హార్దిక్‌పాండ్య ఎప్పటిలాగే ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అవ్వగలడు. ఇక ధోనీ సేనలో జడ్డూ, పియూష్‌, తాహిర్‌, కేదార్‌, శాంట్నర్‌, కర్ణశర్మ స్పిన్‌ దాడికి సిద్ధంగా ఉన్నారు. హేజిల్‌వుడ్‌, బ్రావో, చాహర్‌, ఎంగిడి పేస్‌ విభాగం చూసుకుంటారు.


చాహర్‌×రోహిత్‌

ముంబయిలో మలింగ, చెన్నైలో రైనా, భజ్జీ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. కొవిడ్‌-19 కారణంగా ధోనీసేనకు తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. రోహిత్‌ బృందం మాత్రం సాధనను ఆస్వాదించింది. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయగల దీపక్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు మెరుగైన రికార్డేమీ లేదు. టీ20ల్లో ఆరు ఇన్నింగ్సుల్లో పవర్‌ప్లేలో అతడు రెండుసార్లు ఔటయ్యాడు. 29 బంతుల్లో 24 పరుగులే చేశాడు. అయితే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగోకు ట్రోఫీ అందంచిన పొలార్డ్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆఖర్లో ఎంఎస్‌ ధోనీని ఇబ్బంది పెట్టగల బుమ్రా, బౌల్ట్‌, కౌల్టర్‌ నైల్‌ ముంబయిలో ఉండటం గమనార్హం.


అంచనా జట్లు

చెన్నై: షేన్ ‌వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, ఎంఎస్‌ ధోనీ (కె, వి), కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా, పియూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

ముంబయి: రోహిత్‌ శర్మ (కె), క్వింటన్‌ డికాక్‌ (వి), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని