IPL Final: చెన్నై పాంచ్‌ పటాకానా..? గుజరాత్‌ డబుల్‌ ధమాకానా? ఈ ఐపీఎల్‌ విజేత ఎవరు..?

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన చెన్నై, గుజరాత్‌ జట్లే.. పైనల్‌లోనూ (GT vs CSK) తలపడుతున్నాయి. మరి ఐదోసారి కప్‌ గెలిచి చెన్నై (Chennai Super Kings) ముంబయి రికార్డును సమం చేస్తుందా.. వరుసగా రెండోసారి టైటిల్‌ నెగ్గి గుజరాత్‌ (Gujarat Titans) తన సత్తా చాటుతుందా..?

Updated : 27 May 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌ 16వ (IPL 2023) సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. విజేతను తేల్చే మహా సమరం ఆదివారం రోజే. ఫైనల్‌లో తలపడేందుకు దిగ్గజ జట్లైన చెన్నై, గుజరాత్‌లు (GT vs CSK) సిద్ధమయ్యాయి. ఐదోసారి కప్‌ గెలిచి ధోనీ సేన (MS Dhoni) ముంబయి రికార్డును సమం చేస్తుందా..? లేదా వరుసగా రెండోసారి కప్‌ గెలిచి హార్దిక్‌ (Hardik Pandya) సేన తన సత్తా చాటుతుందా?ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే..

తనదైన వ్యూహాలతో ధోనీ.. (MS Dhoni)

గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై జట్టు.. ఈసారి అనూహ్యంగా పుంజుకుందంటే దానికి ధోనీయే కారణం. మహీ తనదైన వ్యూహాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు తొలి క్వాలిఫయర్‌లోనే డిఫెండింగ్‌ చాంఫియన్‌ గుజరాత్‌ను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన ఆ జట్టు.. ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు రిటైర్మెంట్‌పై వార్తలు వినిపిస్తున్న వేళ.. కప్‌ గెలిచి ధోనీకి కానుక ఇవ్వాలని చెన్నై అభిమానులు కోరుకుంటున్నారు.

ఓపెనింగ్‌ జంటే పెద్ద బలం..

రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవన్‌ కాన్వే ఓపెనింగ్‌ భాగస్వామ్యమే చెన్నైకి (CSK) అతిపెద్ద బలం. నిలకడగా రాణిస్తున్న ఈ జంట.. చెన్నై విజయాల్లో కీలకంగా నిలుస్తోంది. ఫైనల్‌లో గెలవాలంటే.. ఈ జంట మరోసారి తమ అద్భుత ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది. శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, రహానెలతో మిడిల్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఇక ఫినిషర్‌గా ధోనీ సత్తా చాటేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే.. క్వాలిఫయర్‌ 1లో గుజరాత్‌ను ఓడించినప్పటికీ.. ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. షమీ, మోహిత్‌ శర్మ, అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ఇక బౌలర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ధోనీకి తెలిసినంత మరెవరికీ తెలియదనే చెప్పాలి. వికెట్లు పడగొట్టేందుకు తనదైన వ్యూహాలతో ముందుకువెళ్తాడు. మహీ సారథ్యంలోనే తుషార్‌ దేశ్‌పాండే, పతిరణ రాటు దేలారు. ఇక దీపక్‌ చాహర్‌, తీక్షణ, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీస్తు జట్టుకు అండగా నిలుస్తున్నారు. అయితే.. మూడు శతకాలతో వీరవిహారం చేస్తున్న గుజరాత్‌ ఓపెనర్‌ గిల్‌ను అడ్డుకుంటేనే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న విషయం ధోనీకి తెలుసు. అతడిని ఏ మేరకు చెన్నై బౌలింగ్‌ దళం అడ్డుకుంటుందో చూడాలి.

గిల్‌ vs చెన్నై (Gill vs CSK)

ఇక అరంగేట్ర సీజన్‌ నుంచి ఇప్పటి వరకూ అన్ని విభాగాల్లో రాణిస్తూ.. దూసుకెళ్తున్న జట్టు గుజరాత్‌. క్వాలిఫయర్‌ 1లో చెన్నైపై ఓడిపోయినప్పటికీ.. తిరిగి పుంజుకుని అదే జట్టుతో ఫైనల్‌కు సిద్ధమైంది. సునాయాసంగా శతకాలు బాదేస్తూ, రికార్డులను చెరిపేస్తూ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న గిల్‌.. మరోసారి రాణిస్తే ఫైనల్లో ఆ జట్టుకు తిరుగుండదు. శుభ్‌మన్‌ చెలరేగితే ఈ మ్యాచ్‌ గిల్‌ vs చెన్నైగా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సాహా కూడా అప్పుడప్పుడు తనవంతు సహకారం అందిస్తున్నాడు. ముంబయితో మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ కూడా మంచి ప్రదర్శనే చేశాడు. విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముగ్గురూ వీరే..

చెన్నైతో పోల్చితే గుజరాత్‌ బౌలింగ్‌ అటాక్‌ కాస్త మెరుగ్గానే ఉంది. ఎందుకంటే పర్పుల్‌ క్యాప్‌ రేసులో తొలి మూడు స్థానాల్లో ఉన్నది జీటీ బౌలర్లే. షమీ (28 వికెట్లు), రషీద్‌ ఖాన్‌ (27 వికెట్లు), మోహిత్‌ శర్మ(24) ఈ రేసులో కొనసాగుతున్నారు. ఇక ముంబయితో మ్యాచ్‌లో మోహిత్‌ శర్మ 5 వికెట్ల ప్రదర్శనతో తన సత్తా ఏంటో చాటాడు. ఫైనల్లో వీరు చెలరేగితే.. చెన్నైని కట్టడి చేయడం సులభమవుతుంది. ఆరెంజ్‌ క్యాప్‌ ఎలాగూ శుభ్‌మన్‌ గిల్ (851 పరుగులు) వద్దే ఉంది. 

హెడ్‌ TO హెడ్‌.. జీటీదే ఆధిక్యం..

ఈ సీజన్‌ క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో తప్పితే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు తలపడిన అన్ని మ్యాచ్‌ల్లో గుజరాత్‌దే విజయం. అయితే ప్లేఆఫ్స్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడం ద్వారా ధోనీ సేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అదే దూకుడును ఫైనల్లో కొనసాగిస్తుందా..? లేదా గుజరాత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఈ రెండు జట్ల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఫైనల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన జట్టుగా గుజరాత్ ఇప్పటికే రికార్డు సృష్టించింది.

ఫైనల్‌కు ఎలా చేరారంటే..

అరంగేట్ర సీజన్‌ మాదిరిగానే గుజరాత్‌ ఈ సీజన్‌లోనూ తన సత్తా చాటింది. పది విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌నకు దూసుకొచ్చిన తొలి జట్టుగా నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చెన్నైపై ఓడినప్పటికీ.. రెండో క్వాలిఫయర్‌లో ముంబయిని చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఇక చెన్నై ఈ సీజన్‌ లీగ్‌ దశను రెండో స్థానంతో ముగించి.. ప్లేఆఫ్స్‌ చేరింది. క్వాలిఫయర్‌ 1లో జీటీని ఓడించి.. టైటిల్‌ గెలవడమే తన లక్ష్యమని మరోసారి చాటిచెప్పింది.

స్వీట్ వార్నింగ్‌ నెరవేరేనా..?

తొలి క్వాలిఫయర్‌కు ముందు ధోనీ సేనకు గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘చెపాక్‌ వికెట్‌పై చెన్నైని ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని నేను భావిస్తున్నాను. చెన్నైలో చెన్నైపై తలపడటం కోసం మేం ఉత్సాహంగా ఉన్నాం. రెండో సారి మేం ఫైనల్‌లో అడుగుపెడతామని విశ్వాసముంది’ అని గిల్ చెప్పినప్పటికీ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో గుజరాత్‌ ఓడిపోయింది. ఇప్పుడు తమ సొంత గడ్డ అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ జరుగుతుండటంతో గిల్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో చూడాలి.

తొలి, చివరి మ్యాచ్‌లు.. వీరి మధ్యే..

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ గుజరాత్‌, చెన్నైల మధ్యే జరిగింది. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచూ వీరి మధ్య జరగనుండటం విశేషం. మరి ధోనీ సేన ఐదో విజయం సాధిస్తుందా..? హార్దిక్‌ సేన టైటిల్‌ను తనవద్దే ఉంచుకుంటుందా..? ఎవరు విజేతగా నిలిచినా.. ఈ సీజన్‌ అద్భుతమైన మధురస్మృతులను క్రీడాభిమానులకు అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని