cricket: మైదానంలో బంతి కనిపించడంలేదు.. ఎందుకంటే..!
క్రికెట్‌లో నిబంధనలు బౌలింగ్‌ను మరింత కఠినంగా మార్చేస్తున్నాయి . దీనికి తోడు గాయాలబెడద వారి కెరీర్లను వేగంగా పతనం చేస్తోంది. అన్నింటికి మించి ఆదాయ పరంగా చూసుకొన్నా.. బ్యాటర్లకు ఉన్న తళుకుబెళుకులు బౌలర్లకు ఉండటంలేదనేది కాదనలేని వాస్తవం.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: ‘‘నువ్వు బౌలర్ కావాలని అస్సలు అనుకోవద్దు’ అని నా కుమారుడికి చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతి మీద కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్ కావాలనేది నా కల. అతడికి రోజూ శిక్షణ ఇప్పిస్తున్నా. నెట్స్‌లో నేనే బౌలింగ్ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్‌లో నేను బౌలింగ్ చేస్తున్నందుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్‌గా మారితే ఓ పదేళ్లలో రూ.20 కోట్లైనా ఇస్తారు. నా కొడుకు కోసం ఓ రూ.20 కోట్లు పక్కనపెట్టుకోవాలని ముంబయి ఇండియన్స్‌కు చెప్పా’’.. భారత స్పిన్నర్ పియూష్ చావ్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. మారిపోతున్న ఆట నిబంధనలు కూడా బౌలింగ్‌ను ఓ కఠినమైన ప్రక్రియగా మార్చేస్తున్నాయి.
ఒకప్పుడు వెస్టిండీస్ పేస్ దళం బౌన్సర్లతో బ్యాటర్లను గజగజలాడించేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గంటకు 150 కి.మీ.తో బౌలింగ్ చేసినా బంతి అలవోకగా బౌండరీలైను దాటేస్తోంది. దీనికి తోడు క్రికెట్ ఫార్మాట్లలో ఓవర్లను కుదించే కొద్దీ బౌలర్లు సంధించే బంతులను ఊచకోత కోయడం పెరిగిపోతోంది. 2011కు ముందు 6,333 వన్డే మ్యాచుల్లో 393 సార్లు 300+ స్కోర్లు చేశారు. కానీ, 2011 తర్వాత నుంచి 2020 వరకు 1,606 మ్యాచుల్లో 257 సార్లు స్కోర్‌బోర్డ్ 300 దాటేసిందంటే బ్యాటర్ల విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. టీ20 బాగా పాపులర్ అయ్యాక.. వన్డేల్లో 300 స్కోరు సాధారణమైపోయింది. ఇది బౌలర్లను ఏ స్థాయిలో ఆడేసుకుంటున్నారో తెలియజేస్తోంది.
క్రికెట్‌లో బౌలర్లకు అత్యధిక ఫిట్‌నెస్ అవసరం. అందులో పేస్ బౌలర్లకైతే మరీను..! వీరు తమ శరీరంలోని శక్తిని బంతికి జోడించి బ్యాటర్లపైకి సంధించాల్సి ఉంటుంది. గాయాలబారిన పడే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఫిట్‌నెస్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఎంతటి బౌలరైనా జట్టుకు దూరం కావాల్సిందే. జస్ప్రీత్ బుమ్రానే దీనికి సరైన ఉదాహరణ.
రెండు బంతుల నిబంధనలతో..
క్రికెట్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు ఎండ్‌ల వైపు నుంచి రెండు కొత్త బంతులతో బౌలింగ్‌ను ప్రారంభిస్తారు. వీటిని 25 ఓవర్లు వినియోగిస్తారు. అంటే వన్డేల్లో బౌలర్‌కు రివర్స్ స్వింగ్ లభించాలంటే కనీసం 40 ఓవర్ల ఆట పూర్తయి ఉండాలి. కేవలం చివరి 10 ఓవర్లలో మాత్రమే సీమర్లకు రివర్స్ స్వింగ్ సాధ్యపడుతుంది. దీంతో సీమర్లు మరింత చమటోడ్చాల్సిన పరిస్థితి. 2011లో ఈ నిబంధన రాక ముందు వన్డేల్లో ప్రతి 16.1 ఇన్నింగ్స్‌లకు సగటున ఒకసారి 300 స్కోర్లు నమోదైతే.. 2011 తర్వాత పదేళ్లలో ప్రతి 6.2 ఇన్నింగ్స్‌ల తర్వాత ఒకసారి స్కోర్‌బోర్డు 300 దాటేస్తోంది.
ఫీల్డింగ్ నిబంధనలు..
ఫీల్డింగ్ నిబంధనలు కేవలం బ్యాటర్‌కు అనుకూలంగానే ఉంటున్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. వన్డేల్లో తొలి 10 ఓవర్లలో 30యార్డ్స్ సర్కిల్ బయట కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. 11-40 ఓవర్ల మధ్యలో నలుగురికి అవకాశం లభిస్తుంది. చివరి 10 ఓవర్లలో మాత్రమే ఐదుగురు ఫీల్డర్లను బౌండరీల వద్ద మోహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. తమ బౌలింగ్ వ్యూహాలకు అనుగుణంగా ఫీల్డింగ్‌ను పెట్టుకొనే అవకాశం లేదు.
ఫ్రీహిట్‌తో సమస్య..
నోబాల్‌కు ఫ్రీహిట్ కూడా జతకలవడంతో బౌలర్లకు నరకప్రాయంగా మారింది. ఈ ఫ్రీహిట్ సమయంలో రనౌట్ మినహా బ్యాటర్లను ఔటు చేయడానికి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఈ ఫ్రీహిట్లు మ్యాచ్ ఫలితాలను మార్చేసిన సందర్భాలుండటంతో.. బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో యువబౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వరుసగా మూడు నోబాల్స్ వేశాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక, ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ నోబాల్ కారణంగానే హైదరాబాద్ చివరి బంతికి విజయం దక్కించుకుంది.
బౌన్సర్లపై ఆంక్షలు..
ఒక ఓవర్‌లో బ్యాటర్ ఆరు బంతులను సిక్స్‌లు కొట్టేందుకు అవకాశం ఉన్నా.. బౌలర్‌కు మాత్రం ఆరు బౌన్సర్లు వేసే అవకాశం లేదు. కేవలం ఒక బౌన్సర్‌కు మాత్రమే అనుమతి ఉంది. ఆ తర్వాత కూడా బౌన్సర్ విసిరితే.. బ్యాటర్‌కు 1 పరుగు ఇవ్వడంతోపాటు నోబాల్‌గా ప్రకటిస్తారు.
ఫైన్‌లెగ్ నిబంధనలతో కళ్లెం..
బాడీలైన్ బౌలింగ్‌ను నిరోధించేందుకు ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్ల సంఖ్యను పరిమితం చేశారు. ఫైన్‌లెగ్‌లో ఒక్కఫీల్డర్ మాత్రమే ఉండటంతో బౌలర్ విసిరిన బంతి ఏమాత్రం లెగ్‌సైడ్ వైడ్ అయినా.. బ్యాటర్ దానిని కొడితే ఫోర్ రావడం దాదాపు ఖాయం.
ఫ్లాట్ పిచ్‌లు.. ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్‌లు..
ఇటీవల కాలంలో బ్యాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తున్నారు. హైవేలను తలపించే పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది. దీనికి తోడు వేగవంతమైన ఔట్‌ఫీల్డ్‌లు, మైదానంలోని చిన్న బౌండరీలైన్లు బౌలర్ల పనిని మరింత జఠిలం చేస్తున్నాయి.
అన్నింటికి మించి ఆకర్షణీయమైన సంపాదన..
క్రికెట్‌లో బ్యాటర్లు మరింత ఆకర్షణీయంగా మారారు. భారత క్రీడల్లో గతేడాది 505 ఎండార్స్‌మెంట్లు జరిగితే వాటిల్లో 381 డీల్స్ క్రికెటర్లకే దక్కాయి. క్రికెటర్లకు రూ.640 కోట్లు దక్కగా.. మిగిలిన క్రీడలకు రూ. 109 కోట్లు లభించాయి. టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (అన్ని ఫార్మాట్లలో కలిపి 953 ) కంటే అత్యధిక పరుగులు చేసిన సచిన్ (అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357)కు వాణిజ్య ప్రకటనల ఆదాయం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఎండార్స్‌మెంట్లలో విరాట్, రోహిత్, ధోని హవా నడుస్తోంది. వీరు ముగ్గురు.. ఒక్కొక్కరూ 30 బ్రాండ్లకు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. సూర్యకుమార్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు కొత్తగా వాణిజ్య ప్రకటనలు దక్కించుకొంటున్న క్రికెటర్లలో ఉన్నారు. వీరందరిలో బుమ్రా ఒక్కరే బౌలర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి