IND vs NZ: కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి ఇన్ని విరామాలెందుకు..?: రవిశాస్త్రి

ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ పదేపదే విరామాలు ఎందుకు తీసుకుంటున్నాడని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశ్నించాడు. కోచ్‌ అనేవాడు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలని, పదే పదే విరామాలు తీసుకోవద్దని పేర్కొన్నాడు.

Updated : 17 Nov 2022 19:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. కివీస్‌తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. నవంబర్‌ 18 నుంచి టీ20 సిరీస్‌, 25 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభంకానున్నాయి. ఈ రెండు సిరీస్‌లకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు రెగ్యులర్ కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ రెండు సిరీస్‌లకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ పదేపదే విరామలెందుకు తీసుకుంటున్నాడని  టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశ్నించాడు. కోచ్‌ అనేవాడు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలని, పదే పదే విరామాలు తీసుకోవద్దని పేర్కొన్నాడు.

‘నాకు విరామాలపై నమ్మకం లేదు. నేను నా జట్టును, ఆటగాళ్లను అర్థం చేసుకుని, ఆపై ఆ జట్టుపై నియంత్రణను కలిగి ఉండాలనుకుంటున్నా. నిజంగా మీకు ఎన్నిసార్లు విరామాలు కావాలి? భారత టీ20 లీగ్‌ సమయంలో రెండు,మూడు నెలల విరామం లభిస్తుంది. కోచ్‌గా మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ, మిగతా సమయాల్లో కోచ్‌గా ఎవరున్నా జట్టుకు అందుబాటులో ఉండాలి’ అని రవిశాస్త్రి వివరించాడు. టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టు అనుసరించిన విధానాలను అలవర్చుకోవాలని భారత టీ20 జట్టుకు శాస్త్రి సూచించాడు. అందుకు తగిన ప్రణాళికలు రచించుకోవడానికి న్యూజిలాండ్‌ పర్యటన ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, కివీస్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య, వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని