Cricket Rules:‘దాన్ని మన్కడింగ్‌ అనొద్దు.. బ్రౌన్డ్ అని పిలవాలి’: ఆకాశ్‌ చోప్రా

క్రికెట్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మార్పులు అక్టోబరు 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి.

Updated : 10 Mar 2022 22:25 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మార్పులు అక్టోబరు 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల్లో మార్పులు తీసుకురావడంపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌చోప్రా స్పందించాడు. బౌలర్‌ చేతిలోంచి బంతి వెళ్లకముందే నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే బౌలర్‌  ఔట్‌ చేసే విధానాన్ని ఇంతకాలం మన్కడింగ్‌గా వ్యవహరించేవారు. దీన్ని రనౌట్‌ కిందకు మారుస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకోవడంపై ఆకాశ్‌చోప్రా ఆనందం వ్యక్తం చేశాడు.  

1948లో ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ బ్రౌన్‌ బంతి వేయకముందే క్రీజు వదిలివెళ్లడంతో బౌలింగ్‌ చేస్తున్న భారత దిగ్గజం వినూ మన్కడ్ స్టంప్స్‌ని పడగొట్టి ఔట్‌ చేశాడు. దానికి ఆస్ట్రేలియా మీడియా మన్కడింగ్‌ అనే పేరు పెట్టింది. ఇలా చేయడం ఔట్‌ చేయడం అన్యాయమని, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని చాలా మంది క్రికెట్‌ పండితులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో మన్కడింగ్‌పై ఆకాశ్‌చోప్రా మాట్లాడాడు.‘ఇంతకుముందు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్ రనౌట్ అయినప్పుడు దానిని 'మన్కడింగ్‌' అని పిలిచేవారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ పదం వినగానే  చాలా కోపంగా ఉంటాడు. ‘ఔటైన బ్యాటర్‌ పేరు బ్రౌన్ అయితే దానిని 'మన్కడింగ్' అని ఎందుకు అంటారు. దానిని 'బ్రౌన్డ్‌' అని పిలవాలి’ అని ఆయన చెప్తుంటారు. సునీల్ గవాస్కర్‌ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన్కడింగ్‌ ఇప్పుడు రనౌట్‌ కేటగిరీకి వెళ్లింది. అది న్యాయమా,  అన్యాయమా అనే ప్రశ్నే లేదు’ అని ఆకాశ్‌చోప్రా పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2019 సీజన్‌లో రవిచంద్రన్‌ అశ్విన్ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్, జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడారు. ఆ సీజన్‌లో పంజాబ్, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌ చేస్తుండగా‌.. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ క్రీజు దాటి ముందుకు రావడంతో అతడిని ఔట్‌ చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని