Virat Kohli : ఎందుకిలా..

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అకస్మాత్తుగా టెస్టు జట్టు సారథ్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? బీసీసీఐ పెద్దలతో కోహ్లీకి పొసగకపోవడమే ఇందుకు కారణమా? ప్రపంచ క్రికెట్లోనే మేటి బ్యాటర్‌గా వెలుగొందుతున్న ...

Updated : 17 Jan 2022 14:50 IST

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అకస్మాత్తుగా టెస్టు జట్టు సారథ్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? బీసీసీఐ పెద్దలతో కోహ్లీకి పొసగకపోవడమే ఇందుకు కారణమా? ప్రపంచ క్రికెట్లోనే మేటి బ్యాటర్‌గా వెలుగొందుతున్న కోహ్లీతో బీసీసీఐ ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించాల్సిందా?

భారత జట్టుకు దూకుడు నేర్పిన సౌరభ్‌ గంగూలీ.. టీమ్‌ఇండియాను మరో స్థాయికి చేర్చిన విరాట్‌ కోహ్లీల మధ్య పొసగకపోవడమే తాజా క్రికెట్‌ సంక్షోభానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా.. అంతకుముందే కోహ్లి చేతిలో దాదాకు చేదు అనుభవం ఎదురవడం ప్రస్తుత పరిస్థితి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2017లో టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లే వద్దంటూ కోహ్లి ప్రకటించడం తెలిసిందే. అయితే గంగూలీ, సచిన్‌ తెందుల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కుంబ్లేకే మద్దతు తెలిపింది. అయితే విరాట్‌ మాత్రం రవిశాస్త్రి కోచ్‌గా కావాలని కోరాడు. ఆ సమయంలో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఉండటం.. ప్రపంచ క్రికెట్లో కోహ్లి తిరుగులేని బ్యాటర్‌గా కొనసాగుతుండటంతో అతని మాటే నెగ్గింది. టీమ్‌ఇండియాకు విజయవంతమైన సారథుల్లో ఒకడైన గంగూలీకి కోచ్‌ ఎంపిక వ్యవహారం గట్టి ఎదురుదెబ్బే!

అన్ని రోజులు మనవి కావన్నట్లు.. అప్పుడు సీఏసీ సభ్యుడిగా నామమాత్రపు స్థానంలో ఉన్న గంగూలీ ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. మొదట్లో దాదా- కోహ్లీలు సమన్వయంతో కొనసాగినా.. నిరుడు టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక ఇద్దరి మధ్య దూరానికి కారణమైంది. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ను జట్టులోకి తీసుకోవాలని కోహ్లి పట్టుబట్టినా సెలెక్టర్లు పట్టించుకోలేదట. చాహల్‌కు బదులుగా అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇన్నేళ్లు జట్టు ఎంపికలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీకి మొదటిసారిగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ఆగ్రహానికి గురైన కోహ్లి టీ20 సారథ్యం వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే పొట్టి కప్పులో భారత జట్టు వైఫల్యం అతని వన్డే సారథ్యానికీ ఎసరు పెట్టింది. సెలక్షన్‌ కమిటీ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించింది. వన్డే, టీ20లకు  భిన్న సారథ్యం సరికాదన్న వాదన బీసీసీఐ తెరపైకి తెచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్‌గా, టెస్టులకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి దక్షిణాఫ్రికాతో విలేకరుల సమావేశానికి ముందు గట్టిగా జవాబిచ్చాడు కోహ్లి. చాలా విషయాలు చెప్పాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు తనకు సమాచారం ఇచ్చారని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా వ్యతిరేకం. అప్పట్లో కోహ్లి ప్రకటన భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. తొలి టెస్టు అనంతరం సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ.. గంగూలీ వ్యాఖ్యల్ని సమర్థించాడు. అయితే మూడో టెస్టులో ఆజింక్య రహానెకు బదులుగా శ్రేయస్‌ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లి సూచించినట్లు తెలిసింది. కోచ్‌ ద్రవిడ్‌ మాత్రం రహానె వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడం కోహ్లీని మనస్తాపానికి గురిచేసినట్లుగా తెలుస్తోంది. జట్టు ఎంపికలో.. తుది జట్టు కూర్పులో తన ప్రమేయం లేకుండా పోవడం, తనకెంతో ఇష్టుడైన రవిశాస్త్రి దూరమైన కారణంగా తన బలం తగ్గడం కోహ్లి రాజీనామాకు దారితీసినట్లుగా చెబున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఒప్పు? ఎవరు తప్పు? అని మున్ముందు తెలియొచ్చు. కాని భారత క్రికెట్‌కు నష్టం జరిగితే అందుకు పూర్తి బాధ్యత బీసీసీఐదే అవుతుంది!

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని