Nepal Cricket: కార్డియాక్ కిడ్స్... నేపాల్ క్రికెటర్లతో అంత వీజీ కాదు!

ఆసియా కప్‌ (Asia Cup 2023)లో భారత్‌ (Team India)తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఇప్పుడు నేపాల్ క్రికెట్ టీమ్‌ (Nepal Cricket) మీద అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆ టీమ్‌ను కార్డియాక్‌ కిడ్స్‌ (Cardiac Kids) అని అంటారు అనే మాట వైరల్‌ అవుతోంది. దాని వెనుక కారణమేంటంటే?

Updated : 05 Sep 2023 20:05 IST

క్రికెట్లో నేపాల్ (Nepal Cricket Team) అనగానే పసికూన అనే అంతా అనుకుంటారు. అలాంటి జట్టు ఇండియన్ టీం (Team India)తో తలపడితే.. వంద పరుగులైనా చేస్తుందా అనుకుంటారు. కానీ సోమవారం ఆసియా కప్‌ (Asia Cup 2023) మ్యాచ్‌లో మన పొరుగు దేశపు జట్టు ఏకంగా 230 పరుగులు చేసింది. భారత బౌలర్లను ఆ జట్టు బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. ఆ జట్టు ఆటగాళ్లలో భయమన్నదే కనిపించలేదు. ఈ మ్యాచ్‌లో నేపాల్ చివరికి చిత్తుగానే ఓడినా.. వారి ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత నేపాల్ క్రికెట్ మీద అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. 

ప్రపంచ క్రికెట్లో ప్రతి జట్టుకూ ఒక నిక్ నేమ్ ఉంటుంది. భారత జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’ అన్నట్లుగా.. నేపాల్ జట్టుకు కూడా ఒక పేరుంది. అదే.. కార్డియాక్ కిడ్స్. ఇదేం పేరు అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కార్డియాక్ అంటే గుండె సంబంధిత అన్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్ జట్టు పేరులో ఈ పదం ఎందుకు ఉంది అంటే? తమతో తలపడే ప్రత్యర్థులకు గుండెపోటు తెప్పిస్తారనే ఉద్దేశంతోనే ఆ జట్టుకు ఆ పేరు పెట్టారు. అసోసియేట్ దేశాలతో జరిగిన అనేక టోర్నీలు, మ్యాచ్‌ల్లో నేపాల్ అలాంటి సంచలన ప్రదర్శనే చేసింది. తనకంటే మెరుగైన జట్లకు ఎన్నోసార్లు షాకులిచ్చింది. అందుకే ఆ జట్టు ఆటగాళ్లకు ‘కార్డియాక్ కిడ్స్’ అనే పేరు పెట్టారు. 

2014లో టీ20 హోదాను సంపాదించిన నేపాల్.. కొన్ని నెలలకే అఫ్గానిస్థాన్ మీద సంచలన విజయంతో తన పేరు మార్మోగేలా చేసింది. అప్పటికే అఫ్గాన్ చిన్న జట్లలో పెద్ద టీంగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తోంది. అలాంటి జట్టు మీద టీ20ల్లో గెలవడంతో నేపాల్ వైపు అందరూ చూశారు. ఇక స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెన్యా లాంటి పేరున్న అసోసియేట్ దేశాలపై నేపాల్ కొన్ని అద్భుత విజయాలు సాధించింది. ఒమన్, యూఏఈ, పపువా న్యూ గినియా లాంటి అసోసియేట్ జట్ల మీద నేపాల్‌కు మంచి రికార్డుంది. టీ20ల్లో నిలకడగా రాణిస్తుండటం.. అసోసియేట్ దేశాల టోర్నీల్లోనూ సత్తా చాటుతుండటంతో 2018లో వన్డే హోదా కూడా సంపాదించిన నేపాల్‌కు సోమవారం నాటి ఇండియా మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచ క్రికెట్లో ఘన చరిత్ర ఉన్న, ప్రస్తుత మేటి జట్లలో ఒకటైన టీమ్ ఇండియాతో నేపాల్ తలపడ్డ తొలి మ్యాచ్ ఇదే. 

అందుకే నేపాల్ క్రికెట్లో ఇది అత్యంత గొప్ప రోజు అని ఆ జట్టు కెప్టెన్ టాస్ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో ఎక్కడ మ్యాచ్ రద్దవుతుందో, భారత్‌తో ఆడే అవకాశాన్ని కోల్పోతామో అని ఆ జట్టు ఆటగాళ్లు కంగారు పడ్డారు. కానీ వర్షం అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌లో ఫలితం రావడం ఆ జట్టుకు ఆనందాన్నిచ్చే విషయం. భారత్‌తో మ్యాచ్ అంటే నేపాల్ ఓటమి అనివార్యం అని అందరికీ తెలుసు. అందుకే ఈ మ్యాచ్‌ను గుర్తుంచుకునేలా ఉత్తమ ప్రదర్శన చేయాలనుకున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. నేపాల్ ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు ఆ జట్టును అందరూ అభినందించిన వాళ్లే. 

కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలు కలిసి వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ.. భారత మేటి బౌలర్లను ఏమాత్రం తడబాటు లేకుండా దీటుగా ఎదుర్కోవడం ప్రశంసలు అందుకుంది. ఆ జట్టులో ఆసిఫ్ షేక్ అర్ధశతకం సాధించాడు. సోంపాల్ కామి, కుశాల్ బుర్టెల్ అర్ధశతకాలకు దగ్గరగా వచ్చారు. భారత జట్టు మీద 230 పరుగులు చేయడమంటే నేపాల్‌కు గొప్ప ఘనతే. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఆకట్టుకుంది. ఆరంభంలో రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత కుదురుకుని పరుగులు సాధించాడు. వర్షం వల్ల లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145కు సవరించగా.. ఛేదన కోసం భారత్ 21వ ఓవర్ వరకు ఆడేలా చేయడం కూడా నేపాల్‌కు ఒక ఘనతే. మొత్తంగా ఈ మ్యాచ్‌తో నేపాల్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవం.

ఐపీఎల్‌లో నేపాలీ

నేపాల్ క్రికెట్‌కు మంచి గుర్తింపు రావడంలో సందీప్ లమిచానెది ముఖ్య పాత్ర. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ టీనేజీలోనే గొప్ప ప్రదర్శన చేశాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నేపాల్ తరఫున అంతర్జాతీయ మ్యా‌చ్‌ల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌ల్లో కూడా అతను సత్తా చాటాడు. చిన్న వయసులోనే అతను నేపాల్ జట్టుకు కెప్టెన్సీ కూడా చేయడం విశేషం. అతను ఇప్పటికే ఐపీఎల్‌లో కూడా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సందీప్‌ను 2018 సీజన్లో తమ జట్టులోకి తీసుకుంది. వరుసగా రెండు సీజన్లలో ఆడించింది. 9 మ్యాచ్‌లు ఆడిన సందీప్ 22.6 సగటుతో 13 వికెట్లు తీశాడు. ఒక నేపాల్ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడటం అంటే క్రికెట్ పరంగా ఆ దేశానికే అది పెద్ద అచీవ్మెంట్. అతను మంచి గణాంకాలే నమోదు చేసినా.. తర్వాత అవకాశాలు రాలేదు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఐరీ సహా కొందరు క్రికెటర్లకు భారత మూలాలున్నాయి. గతంలో శక్తి గౌచన్ అనే క్రికెటర్ ముందుగా ముంబయికి ప్రాతినిధ్యం వహించి.. ఆ తర్వాత నేపాల్ జాతీయ జట్టులో చోటు సంపాదించి అంతర్జాతయ క్రికెట్ ఆడటం విశేషం.

- ఈనాడు క్రీడా విభాగం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని