Shaheen Afridi: షహీన్‌.. ఎందుకంత స్పెషల్‌? పాక్‌ ఫాస్ట్‌బౌలర్‌పై ఎందుకింత చర్చ?

భారత్‌తో మ్యాచ్‌ అనగానే పాకిస్థాన్‌ (IND vs PAK) పేస్‌ ఎటాక్‌ గుర్తుకొస్తుంది. మరీ ముఖ్యంగా ఓ కుర్రాడు పేరు మారుమోగడం సహజం. అతితక్కువ సమయంలోనే పాక్‌ కీలక బౌలర్‌గా మారిపోయాడు. అతనే షహీన్‌ అఫ్రిది (Shaheen Afridi).

Updated : 02 Sep 2023 13:32 IST

ఆసియా కప్‌లో ప్రతిష్ఠాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ ఇవాళ మ్యాచ్‌ (India vs Pakistan) ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ ముంగిట ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న పేరు.. షహీన్‌ అఫ్రిది (Shaheen Afridi). భారత జట్టుకు అతనే పెద్ద ముప్పు అని ఎటు చూసినా హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ‘అతడితో జాగ్రత్త’ అని చాలామంది మాజీలు టీమ్‌ఇండియాకు సూచిస్తున్నారు. ఇంతకీ ఈ యువ ఫాస్ట్‌ బౌలర్‌ ప్రత్యేకత ఏంటి..? ఎందుకు తన గురించి ఇంత చర్చ జరుగుతోంది?

షహీన్‌ అఫ్రిది వయసు ప్రస్తుతం 23 ఏళ్లే. ఈ వయసులోనే ప్రపంచ మేటి ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. పాకిస్థాన్‌తో ఏ జట్టు తలపడ్డా.. అందులోని బ్యాటర్లు తన బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తారు. మ్యాచ్‌ నేపథ్యంలో షహీన్‌ బౌలింగ్‌ వీడియోలు చూస్తారు, ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతారు. పాక్‌ జట్టులోకి షహీన్‌ వచ్చినప్పటి నుంచి.. ఆ జట్టును ఎప్పుడు ఢీకొన్నా సరే భారత్‌ కూడా అతడి మీదే దృష్టిపెడుతోంది. ప్రపంచ కప్పుల్లో పాక్‌పై ఓటమే ఎరుగని రికార్డుతో 2021 టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాను షహీనే గట్టి దెబ్బ కొట్టాడు. కోహ్లి సహా టాప్‌ 3 బ్యాటర్లను ఆరంభంలోనే పెవిలియన్‌ చేర్చాడు. తద్వారా ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్‌ తొలి విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ పోరులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కూడా అతనే.

IND vs PAK: ఇప్పుడొస్తుంది అసలు మజా

నిరుడు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ నెగ్గినప్పటికీ.. ఆ మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లతో మెరిశాడు షహీన్‌. అందుకే ఇప్పుడు ఆసియా కప్‌ మ్యాచ్‌ ముంగిట షహీన్‌ గురించి చర్చ జరుగుతోంది. అతణ్ని భారత బ్యాటర్లకు ప్రధాన ముప్పుగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు, మాజీలు. 6 అడుగుల పొడగరి అయిన షహీన్‌ బౌలింగ్‌లో మంచి వేగం ఉంది. నిలకడగా 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేయగలడు. అదే సమయంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తప్పడం అరుదు. ఈ ఎడమ చేతి వాటం పేసర్‌ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు కూడా. అతడి ఇన్, ఔట్‌ స్వింగర్లను ఆడటం బ్యాటర్లకు సవాలే.

ఆది నుంచి మెరుపులే..

బౌలింగ్‌తో సంచలనాలు రేపడం టీనేజీ నుంచే షహీన్‌కు అలవాటు. 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌ క్రికెట్లో షహీన్‌ పేరు మార్మోగింది. క్వాయిద్‌ ఎ-అజామ్‌ టోర్నీలో 39 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన అరంగేట్ర బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో అవకాశం దక్కించుకుని ఓ మ్యాచ్‌లో 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి సంచలనం రేపాడు. దీంతో 18 ఏళ్ల వయసులోనే షహీన్‌కు పాకిస్థాన్‌ జాతీయ జట్టులో చోటు లభించింది. అక్కడ కూడా అదరగొడుతూ ఏడాది తిరిగేసరికి మూడు ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా మారాడు. 20 ఏళ్ల వయసొచ్చేసరికే ప్రపంచ మేటి ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

షహీన్‌ ఇప్పటిదాకా 27 టెస్టులాడి 25.58 సగటుతో 105 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 40 మ్యాచ్‌లు ఆడి 23.08 సగటుతో 78 వికెట్లు తీశాడు. టీ20ల్లో 52 మ్యాచ్‌ల్లో 22.73 సగటుతో 64 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు చూస్తేనే అతనెంత మేటి బౌలరో అర్థమవుతుంది. షహీన్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటర్‌ కూడా. అప్పుడప్పుడూ విధ్వంసకర షాట్లతో విలువైన పరుగులు చేస్తుంటాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతుండటంతో ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడ్డ అతను.. ఇటీవలే కోలుకుని జట్టులోకి తిరిగొచ్చాడు. రాగానే తన ముద్రను చూపిస్తూ జట్టుకు విజయాలందిస్తున్నాడు.

ఈ అఫ్రిది.. ఆ అఫ్రిది అల్లుడు

షహీన్‌ అఫ్రిది.. పాకిస్థాన్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అల్లుడు కావడం విశేషం. షాహిద్‌ తనయ అన్ష అఫ్రిదిని అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. షహీన్‌కు 21 ఏళ్ల వయసుండగానే షాహిద్‌ కూతురితో నిశ్చితార్థం జరిగింది. రెండేళ్ల తర్వాత వీరి వివాహం జరిపించారు. షహీన్‌తో పాటు ఆరుగురు సోదరులుండగా.. ఇతనే చివరి వాడు. షహీన్‌ సోదరుల్లో ఒకడైన రియాజ్‌ అఫ్రిది కూడా క్రికెటరే. అతను పాక్‌కు ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. షహీన్‌ మరో అన్న యాసిర్‌ అఫ్రిది ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌.

- ఈనాడు క్రీడా విభాగం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు