INDvsENG: భువీని అందుకే తీసుకోలేదా?

భువనేశ్వర్‌ కుమార్‌.. టీమ్‌ఇండియాకు దొరికిన అద్భుతమైన పేసర్లలో ఒకడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో...

Published : 12 May 2021 12:44 IST

ఇంటర్నెట్‌: భువనేశ్వర్‌ కుమార్‌.. టీమ్‌ఇండియాకు దొరికిన అద్భుతమైన పేసర్లలో ఒకడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో నిండివుంటే అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు. ఇంగ్లాండ్‌ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ ఇంగ్లిష్‌ జట్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు అతడిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం, తరచూ గాయాల పాలవ్వడంతో భువీని సెలక్టర్లు ఎంపిక చేయలేదని బోర్డు వర్గాల సమాచారం. రెండేళ్లు అతడు టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం, రంజీల్లోనూ ప్రభావం చూపకపోవడం, దేశవాళీ క్రికెట్లోనూ ఎక్కువగా ఆడకపోవడాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో సుదీర్ఘ కాలం టెస్టు సిరీస్‌ ఆడగలిగే ఫిట్‌నెస్ భువీకి ఉన్నట్టు సెలక్టర్లు భావించడం లేదని పేర్కొంటున్నారు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీసులో సీనియర్‌ పేసర్లు అవసరమన్న భావనా ఇందుకు తోడైంది.

నిజానికి భువీ రెండున్నరేళ్లుగా విపరీతంగా గాయపడుతున్నాడు. 2018 జనవరి నుంచి అతడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్టే ఆడలేదు. ఆ ఏడాది జనవరి 24-27 మధ్యన దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచే ఆఖరిది. పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్‌ ఓవర్లలో అతడి సామర్థ్యం పెరగడంతో టీ20, వన్డేలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాది ఐపీఎల్‌లోనూ గాయపడటంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌, విజయ్ హజారే ఆడటంతో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని