Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. మనకు ఇతనొక స్టార్ బౌలర్. కానీ ఆస్ట్రేలియా (Australia)కు నైట్‌మేర్. అంతలా అశ్విన్‌కు ఆసీస్ భయపడుతోంది. త్వరలో బోర్డర్ - గావస్కర్ (ind vs aus) సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటివరకు అశ్విన్ వర్సెస్ ఆసీస్ సంగతేంటో చూద్దాం!
అశ్విన్ అంటే ఆస్ట్రేలియాకు ఎందుకంత భయం?
గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానుల్లో వినిపిస్తున్న మాట ఇదీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయమూ ఇదే. ప్రత్యర్థి జట్టు ఏకంగా ‘నకిలీ’ అశ్విన్‌ను తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసేంతగా ఆశ్విన్ (Ashwin) భయపెట్టాడా? ఆసీస్(Australia)పై అతని బౌలింగ్ ప్రదర్శన చూస్తే.. మీరే పై ప్రశ్నకు సమాధానం చెప్పేయొచ్చు.
ఆఫ్‌స్పిన్నర్ బౌలింగ్‌కి వస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు చిన్న వణుకు వస్తుంది. ఆ కంగారు పీక్స్‌లోకి వెళ్లాలంటే ఆ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయి ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్లను అలా కంగారు పెడతాడు మరి. ఇప్పుడు ఆస్ట్రేలియా భయం కూడా అదే. అసలే స్పిన్ పిచ్‌ల పై కంగారూలు తడబడతారనే అపవాదు ఉంది. అందులోనూ ఆ జట్టులో కీలకమైన లెఫ్టీలు ముగ్గురు ఉన్నారు. వీటికితోడు గతంలో ఆసీస్ మీద అశ్విన్ వికెట్ల వేట మామూలుగా సాగలేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో అశ్విన్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు వికెట్ల ఫీట్ 5 సార్లు, పది వికెట్ల ఫీట్ ఒకసారి ఉంది.
మన దగ్గర 50+
స్వదేశంలో అశ్విన్ 50 వికెట్లు తీయగా.. ఆసీస్ గడ్డ మీద 39 వికెట్లు పడగొట్టాడు. ఈ లెక్కలు చూశాక ఆసీస్ భయపడటంలో తప్పేమీ లేదు అనిపిస్తోంది కదా. అశ్విన్ స్టాట్స్‌లోకి ఇంకాస్త డీప్‌గా వెళ్తే లెక్క ఇంకా బాగా అర్థమవుతుంది. అశ్విన్ కనుక ఎక్కువ వికెట్లు తీస్తే.. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు పరాజయం పక్కా లేదంటే డ్రా అయినా అవుతుంది. భారత్ గెలిచిన టెస్టుల్లో అశ్విన్ 52 వికెట్లు తీయగా, డ్రా అయిన మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అంటే 89లో 66 అన్నమాట. 2013లో జరిగిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో ఏకంగా 29 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
వార్నర్‌ను ఆటాడుకుని..
బ్యాటర్ల వారీగా చూస్తే.. డేవిడ్ వార్నర్‌ను అశ్విన్ 10 సార్లు (15 మ్యాచ్‌ల్లో) ఔట్ చేశాడు. స్మిత్‌ను 6 సార్లు (12 మ్యాచ్‌ల్లో), లబుషేన్‌ను రెండుసార్లు (3 మ్యాచ్‌ల్లో), ఉస్మాన్ ఖవాజాను రెండుసార్లు (ఒక మ్యాచ్‌లో) పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు ఈ నలుగురూ ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు అనే విషయం తెలిసిందే. అశ్విన్ పడగొట్టిన 89 వికెట్లలో 52 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లవే. పై నలుగురులో ఇద్దరు లెఫ్టీలు కావడం గమనార్హం. ఇదంతా చదివాక అశ్విన్ డూప్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఆ జట్టుకు ఎంత అవసరమో అర్థమవుతుంది.
ఆ రెండు మైదానాల్లో...
ఇక ఈ సిరీస్ జరగనున్న నాలుగు మైదానాల్లో ఆసీస్ వర్సెస్ అశ్విన్ సంగతి చూస్తే... ఇంకాస్త క్లియర్ పిక్చర్ వస్తుంది. రెండో టెస్టు జరగనున్న దిల్లీ, మూడో టెస్టు జరగనున్న ధర్మశాలలో అశ్విన్ రికార్డు బాగుంది. ధర్మశాలలో ఆసీస్‌పై నాలుగు వికెట్లు తీయగా, దిల్లీలో ఏడు వికెట్లు పడగొట్టాడు. రీసెంట్ సిరీస్ అంటే. 2020-21లో మూడు టెస్టులాడి.. 12 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ గడ్డ మీద జరిగిన సిరీస్‌లోనే అన్ని వికెట్లు తీస్తే.. మరి సొంత పిచ్‌లపై ఇంకెంత ప్రభావం చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్పిన్నర్లలో అశ్విన్ తర్వాత ఆసీస్ వికెట్లు ఎక్కువ పడగొట్టింది రవీంద్ర జడేజా (63) మాత్రమే.
ఇదంతా చదివాక ఆసీస్ మీద అశ్విన్ ప్రతాపం ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ లెక్కలే ఇప్పుడు కంగారూలను కంగారు పెడుతున్నాయి. మాటల యుద్ధానికి దిగేలా చేస్తున్నాయి. డూప్లికెట్ అశ్విన్ అని పిలుచుకునే మహేశ్ పితియాతో ప్రాక్టీస్ చేసేలా చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని ప్లాన్స్ వేసుకున్నా.. వారిని బురిడీ కొట్టించే బంతులు అశ్విన్ దగ్గరున్నాయి. టీమ్ ఇండియా అన్న అని పిలుచుకునే అశ్విన్ మీద... రోహిత్ నమ్మకం కూడా అందుకే.
ఈ నేపథ్యంలో అశ్విన్ గెలుస్తాడా? లేక ఆసీస్ ప్లానింగ్ ఫలిస్తుందా అనేది ఈ నెల 9 నుంచి తెలుస్తుంది. ఎందుకంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు నాగ్‌పూర్‌లో అదే రోజు మొదలవుతుంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
ACB Court: లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్