IND vs USA: అందుకే ఆ అయిదు పరుగులు

స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో యూఎస్‌ఏ బౌలర్ల తప్పిదం వల్ల ఆ జట్టు నష్టపోయింది. అనవసరంగా ఐదు పరుగులు భారత్‌కు ఇవ్వాల్సి వచ్చింది.

Updated : 13 Jun 2024 07:16 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ వరుసగా మూడు విజయాలు సాధించి ‘సూపర్ - 8’కి చేరుకుంది. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల టార్గెట్‌ను టీమ్‌ఇండియా మూడు వికెట్లను కోల్పోయి ఛేదించింది. అయితే, భారత్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్‌ ఆరంభానికి ముందు ఒక్కసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. భారత లక్ష్యంలో అయిదు పరుగులు కరిగిపోయాయి. దీనికో కారణం ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌ ఓవర్‌కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. ఒక ఓవర్‌ ముగిశాక మరో ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ 60 సెకన్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ జట్టు మూడు సార్లు ఇలా చేయడంలో విఫలమైతే అప్పుడు అంపైర్లు అయిదు పరుగులు జరిమానాగా విధిస్తారు. అమెరికా ఈ నిబంధనను అతిక్రమించడంతో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భారత్‌కు ఐదు పరుగులు కలిసివచ్చాయి. లక్ష్య ఛేదన మరింత సులువైంది.

ఆ క్యాచ్‌ పట్టుంటే..

44 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్లో కానీ భారత్‌ స్కోరు 50 దాటలేదు. పరుగుల రాక చాలా కష్టంగా ఉంది. అలాంటి స్థితిలో అసహనంతో సూర్య ఓ షాట్‌ ఆడాడు. థర్డ్‌మ్యాన్‌ బౌండరీ దగ్గర నేత్రావల్కర్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నించాడు. బంతి చేజారింది. అప్పటికి సూర్య 30 బంతుల్లో 22 పరుగులే చేశాడు. ఈ వికెట్‌ పడి ఉంటే భారత్‌ మరింత ఇబ్బందుల్లో పడేదే. గెలిచేందుకు అమెరికాకు మంచి అవకాశం లభించేదే. ఆ తర్వాత చెలరేగిపోయిన సూర్యకుమార్ భారత్‌ను గెలిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని