2016.. మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ దాకా ఉత్కంఠే. టైటిల్‌ రేసులో ఉంటుందో లేదోనన్న చింతే! ఏమైతేనేం.. ముంబయిపై వీరవిహారం చేసిన హైదరాబాద్‌ పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరుతో...

Updated : 06 Nov 2020 10:36 IST

కోహ్లీసేనను హైదరాబాద్‌ ఎలిమినేట్‌ చేస్తుందా!‌

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ దాకా ఉత్కంఠే. టైటిల్‌ రేసులో ఉంటుందో లేదోనన్న చింతే! ఏమైతేనేం.. ముంబయిపై వీరవిహారం చేసిన హైదరాబాద్‌ పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరుతో ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్న డేవిడ్‌ వార్నర్‌ సేన.. 2016 మ్యాజిక్‌ను రిపీట్‌ చేసేనా? తెలుగు అభిమానులను మురిపించేనా?


అప్పట్లాగే..

2020లో హైదరాబాద్‌ ప్రదర్శన అచ్చంగా 2016నే తలపిస్తోంది. ఎందుకంటే తొలి 2 మ్యాచుల్లో ఓడి తర్వాతి 2 గెలిచింది. మళ్లీ ముంబయి చేతిలో ఓడినా పంజాబ్‌పై గెలిచి 6 పాయింట్లతో నిలిచింది. ఈ  క్రమంలో రాజస్థాన్‌, చెన్నై, కోల్‌కతా (సూపర్‌ ఓవర్‌) చేతుల్లో వరుస పరాజయాలు చవిచూసింది. రాజస్థాన్‌పై గెలిచి 8 పాయింట్లు అందుకున్నా పంజాబ్‌తో కీలక  పోరులో 150 లక్ష్యాన్ని ఛేదించలేక ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. చివరికి టాప్‌-3లో ఉన్న దిల్లీ, బెంగళూరు, ముంబయిపై వరుస విజయాలు సాధించి 14 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో మూడో స్థానానికి ఎగబాకింది. టైటిల్‌ రేసులో నిలిచింది. 2016లోనూ సునాయాసంగా తొలి స్థానంలో నిలవాల్సింది పోయి ఆఖర్లో ఓటములతో మూడో స్థానానికి పరిమితమైంది.


ఒకే ఒక్కటి

టీ20 గణాంకాలు.. పరిస్థితులు విచిత్రంగా ఉంటాయని తెలిసిందే. హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం వరుసగా ఇది ఐదోసారి. ముంబయి (6), చెన్నై (8) ముందున్నాయి. అయితే ఐపీఎల్‌లో మిగతా ఏ జట్లకూ లేని ఓ అరుదైన ఘనత వార్నర్‌ బృందానికి ఉంది. లీగు 12 సీజన్లలో 11 సార్లు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే విజేతలుగా ఆవిర్భవించాయి. ఒక్క హైదరాబాద్‌ మాత్రమే 2016లో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్లో కోల్‌కతా‌, క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌, ఫైనల్లో బెంగళూరును ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. ఇలా మరే జట్టూ చేయలేకపోయింది. అందుకే ఈ సారీ అదే ఘనతను పునరావృతం చేయాలని హైదరాబాద్‌ పట్టుదలతో ఉంది. అప్పటి అనుభవం, మానసిక స్థితి ఇప్పుడు అనుకూలంగా మారనుంది.


16లో కప్‌.. 17లో వర్షం

గతంలో నాలుగుసార్లు ప్లేఆఫ్స్‌ చేరుకున్న హైదరాబాద్‌కు రెండుసార్లు ఫైనల్లో తలపడిన అనుభవం ఉంది. 2016లో చిన్నస్వామి వేదికగా జరిగిన ఫైనల్లో బెంగళూరుకు 209 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో క్రిస్‌గేల్‌ (76), కోహ్లీ (54)ను కీలక సమయాల్లో ఔట్‌ చేసింది. ఇక ఫామ్‌లో ఉన్న డివిలియర్స్‌ (5), రాహుల్‌ (11)ను త్వరగా పెవిలియన్‌ పంపించి 200కు పరిమితం చేసింది. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ సీజన్లో వార్నర్‌ పరుగుల వరద పారించాడు. 2017లో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ను దురదృష్టం వెంటాడింది. ఎలిమినేటర్లో తొలుత బ్యాటింగ్‌ చేసి 128/7కే పరిమితమైంది. ఇన్నింగ్స్‌ ముగియగానే కుండపోతగా వర్షం రావడంతో కోల్‌కతాకు డ/లూ పద్ధతిలో 6 ఓవర్లకు 48 లక్ష్యం నిర్దేశించారు. 5.2 ఓవర్లలోనే గంభీర్‌ సేన విజయం అందుకుంది.


విలియమ్సన్‌ అద్భుతమే.. కానీ

2018లో హైదరాబాద్‌ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్‌ నిషేధం ఎదుర్కోవడంతో విలియమ్సన్‌ జట్టును నడిపించాడు. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అటు క్వాలిఫయర్‌-1, ఇటు ఫైనల్లో హైదరాబాద్‌ను చెన్నై దెబ్బకొట్టింది. క్వాలిఫయర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 139/7కే పరిమితమైంది. హైదరాబాద్‌కు విజయావకాశాలు ఉన్నా డుప్లెసిస్‌ (67*) చెదరగొట్టాడు. 19.1 ఓవర్లకు 2 వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఎలిమినేటర్లో కోల్‌కతాను ఓడించిన విలియమ్సన్‌ సేనకు ఫైనల్లో మళ్లీ పరాభవం ఎదురైంది. జట్టు నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని రైనా (32)తో కలిసి షేన్‌ వాట్సన్‌ (117*) ఛేదించేశాడు. గతేడాది నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ ఎలిమినేటర్లో దిల్లీ చేతుల్లో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌ నేపథ్యంలో జోరుమీదున్న వార్నర్‌ ఈ మ్యాచ్‌కు ముందే స్వదేశం వెళ్లిపోయాడు. హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్‌ సేన ఛేదించింది. పృథ్వీషా (56), రిషభ్ పంత్‌ (49) మ్యాచును గెలిపించారు.


వ్యూహాత్మకంగా పైచేయి

మొత్తంగా బెంగళూరుపై హైదరాబాద్‌కు మెరుగైన రికార్డే ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా 8-7తో వార్నర్‌సేనదే పైచేయి. ప్లేఆఫ్స్‌ పరంగా చూసుకున్నా 2016 ఫైనల్లో ఆ జట్టును వార్నర్‌ సేన చిత్తు చేయడం సానుకూల అంశం. ఈ సీజన్లో రెండు మ్యాచుల్లో తలపడి చెరో విజయం సాధించడం గమనార్హం. తొలి మ్యాచులో బెంగళూరు నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక వార్నర్‌ సేన 153కే కుప్పకూలింది. అయితే రెండో మ్యాచులో 5 వికెట్ల తేడాతో ప్రతీకారం తీర్చుకుంది. కోహ్లీసేన నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లకే ఛేదించింది. సీజన్లో ఫామ్‌ చూసుకుంటే మాత్రం చివరి 5 మ్యాచుల్లో హైదరాబాద్‌ 4 గెలిచింది. టాప్‌-3 జట్లైన దిల్లీ, ముంబయి, బెంగళూరును వరుసగా ఓడించింది. బెంగళూరు మాత్రం చివరి 5 మ్యాచుల్లో వరుసగా 4 ఓడిపోయింది. ఆఖరి లీగ్‌ మ్యాచులో హైదరాబాద్‌ 17 ఓవర్ల కన్నా ముందే లక్ష్యాన్ని ఛేదించివుంటే కోహ్లీసేన ప్లేఆఫ్‌ ఆశలకు గండిపడేది. ఎలిమినేటర్‌ జరుగుతున్న అబుదాబిలో 3 మ్యాచులాడిన వార్నర్‌ సేన ఒక మ్యాచే గెలిచింది. మిగతా రెండూ కోల్‌కతాతో ఆడి ఓటమి పాలైంది. అందులో ఒకటి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఇక బెంగళూరు 4 ఆడి 2 గెలిచింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని