భార్య వద్దకొస్తే అలారం మోగుద్దా: క్రికెటర్‌ డౌట్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు జట్లన్నీ యూఏఈ చేరుకున్నాయి. కరోనా వైరస్‌ ముప్పుతో క్రికెటర్లు రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. ఎవరితోనూ చునువుగా ఉండేందుకు వీల్లేదు. మనసు విప్పి మాట్లాడుకొనేందుకు కుదరదు. కలిసి భోజనం చేస్తున్నా దూరం దూరంగానే ఉండాలి....

Published : 03 Sep 2020 14:23 IST

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు జట్లన్నీ యూఏఈ చేరుకున్నాయి. కరోనా వైరస్‌ ముప్పుతో క్రికెటర్లు రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. ఎవరితోనూ చనువుగా ఉండేందుకు వీల్లేదు. మనసు విప్పి మాట్లాడుకొనేందుకు కుదరదు. కలిసి భోజనం చేస్తున్నా దూరం దూరంగానే ఉండాలి. మైదానంలో పని ముగియగానే ఎవరి గదిలోకి వారు వెళ్లిపోవాలి. ఇక బయోబుడగ దాటకుండా ఉండేందుకు జియో ట్యాగింగ్‌ ఉంగరాలు ధరించాలి. దుబాయ్‌లో తామెలా ఉంటున్నామో దిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివరించాడు.

భారత్‌ నుంచి దుబాయ్‌కి చేరుకోగానే ఆరు రోజులు  క్వారంటైన్‌లో ఉన్నామని యాష్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా తెలిపాడు. రోజు విడిచి రోజు కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నామని పేర్కొన్నాడు. ఇవే కాకుండా అదనంగా  మరికొన్ని నిబంధనలు పాటిస్తున్నామని వెల్లడించాడు. ‘గది గడప దాటేముందు కచ్చితంగా జియో ట్యాగింగ్‌ పరికరం ధరించాల్సిందే. ఇది మా కదలికలను గుర్తిస్తుంది. ఆటగాళ్లు మరీ దగ్గరకు వచ్చినప్పుడు గంట మోగుతుంది. గుంపులు గుంపులుగా ఉండకుండా చూస్తుంది’ అని అశ్విన్‌ చెప్పాడు.

(ప్రతీకాత్మక చిత్రం)

ఈ అలారానికి సంబంధించిన ఓ హాస్య సంఘటనను యాష్‌ వివరించాడు. ‘ఆటగాళ్లు సమీపిస్తే ట్రాకింగ్‌ పరికరం అధికారులను అప్రమత్తం చేస్తుంది. దూరం జరగాలని అప్పుడు అధికారులు మమ్మల్ని ఆదేశిస్తారు. ఆ పరికరంలో గంట కూడా మోగుతుంది. దీన్నంతా మాకు జూమ్‌ కాల్‌లో వివరించారు. అప్పుడొకరు ఓ సందేహం అడిగారు. తన సతీమణీ ఈ పరికరం ధరించాలా అని ప్రశ్నించారు. భార్య, పిల్లలే కాకుండా బయో బుడగలో ఉన్న ఎవరైనా సరే దీనిని ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు’ అని యాష్‌ చెప్పాడు. అప్పుడా వ్యక్తి ‘బయట, గదిలో ఉన్నంత సేపూ నేను, నా భార్య కలిసే కదా ఉంటాం మరి’ అని బదులివ్వడంతో అందరం పగలబడి నవ్వుకున్నామని అశ్విన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని