T20 World Cup: ఆసీస్‌ అలా.. విండీస్‌ ఇలా

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 పోరు రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ సంచలన విజయంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

Published : 24 Jun 2024 03:44 IST

నార్త్‌సౌండ్‌: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 పోరు రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ సంచలన విజయంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ దాదాపుగా సెమీస్‌ చేరినట్లే! ఈ నేపథ్యంలో సోమవారం టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ ఆసీస్‌కు చావోరేవో లాంటిది. గెలిస్తే మాత్రం 4 పాయింట్లతో రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్‌ చేతిలో అఫ్గానిస్థాన్‌ ఓడిపోతే భారత్, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరతాయి. ఒకవేళ అఫ్గాన్, ఆసీస్‌ గెలిస్తే.. అప్పుడు వీటితో పాటు భారత్‌ కూడా 4 పాయింట్లతో సమంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో నెట్‌ రన్‌రేట్‌ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం భారత్‌ (2.425) రన్‌రేట్‌ ఉత్తమంగా ఉంది. అఫ్గానిస్థాన్‌ (-0.650) కంటే ఆసీస్‌ (0.223) రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. ఒకవేళ ఆసీస్‌ ఓడిపోయినా రేసులో ఉంటుంది. కానీ ఆ జట్టు ముందంజ వేయాలంటే బంగ్లా చేతిలో అఫ్గాన్‌ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నెట్‌ రన్‌రేట్‌ను బట్టే ఆసీస్‌ను ముందంజ వేస్తుంది. మరోవైపు గ్రూప్‌-2లో సెమీస్‌ లక్ష్యంగా దక్షిణాఫ్రికా, ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌ సోమవారం తలపడుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరగా.. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో సెమీస్‌ బెర్తును చేజిక్కించుకుంటుంది. ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన విండీస్‌.. ఆ తర్వాత అమెరికాపై భారీ విజయంతో రేసులో నిలిచింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ (1.814) ఉంది. సఫారీలను ఓడిస్తే పాయింట్లలో సమమైనా, నెట్‌ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉండడం వల్ల ఆ జట్టుకే సెమీస్‌ బెర్తు సొంతమవుతుంది. విండీస్‌ ఓడితే.. గ్రూప్‌ నుంచి అగ్రస్థానంతో దక్షిణాఫ్రికా ముందంజ వేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు