Ind Vs Aus: చిక్కేనా సిరీస్‌?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో స్థానం ఊరిస్తోంది. కానీ తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. ఒక్క ఓటమితో జట్టు బలహీన పడ్డట్లు కనిపిస్తోంది. బ్యాటర్ల ఫామ్‌ కూడా గొప్పగా లేదు.

Updated : 09 Mar 2023 07:55 IST

పిచ్‌పైనే అందరి కళ్లు
ఆస్ట్రేలియాతో భారత్‌ చివరి టెస్టు నేటి నుంచే

ఉదయం 9.30 నుంచి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో స్థానం ఊరిస్తోంది. కానీ తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. ఒక్క ఓటమితో జట్టు బలహీన పడ్డట్లు కనిపిస్తోంది. బ్యాటర్ల ఫామ్‌ కూడా గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక నాలుగో టెస్టు. సిరీస్‌ సమం చేయాలన్న తపన కంగారూలది. సిరీస్‌ విజయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తునూ ఒకేసారి సాధించాలన్న పట్టుదల భారత్‌ది. అహ్మదాబాద్‌లో రసవత్తర పోరు ఖాయం.

అహ్మదాబాద్‌

బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో ఆఖరి పోరాటానికి వేళైంది. టీమ్‌ ఇండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం రోహిత్‌సేనకు తప్పనిసరి. స్పిన్‌ వ్యూహం బెడిసి కొట్టి మూడో టెస్టులో దెబ్బతిన్న భారత్‌ ఎలా పుంజుకుంటుందో చూడాలి. స్మిత్‌ మరోసారి ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి రోజు ఆటను చూసేందుకు దాదాపు లక్ష మంది వస్తారని అంచనా.

భారత్‌ పుంజుకునేనా..!: మూడో టెస్టులో పరాజయం కచ్చితంగా టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బే. బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. నిజానికి మొత్తం సిరీస్‌లోనే భారత బ్యాటర్లు పెద్దగా ఫామ్‌లో లేరు. ఇప్పటివరకు రోహిత్‌, పుజారా మాత్రమే అర్ధశతకాలు చేసిన స్పెషలిస్ట్‌ బ్యాటర్లు. ఈ నేపథ్యంలో పుంజుకోవడం భారత్‌కు సవాలే. రోహిత్‌, పుజారాలతో పాటు కోహ్లి కూడా సత్తా మేరకు రాణించాల్సివుంది. సిరీస్‌లో ఇప్పటి దాకా కోహ్లి 111 పరుగులు చేయగా.. పుజారా 98 మాత్రమే చేశాడు. వీళ్లిద్దరు ఎక్కువసేపు నిలవడం భారత్‌కు చాలా అవసరం. రోహిత్‌ (207) తర్వాత భారత టాప్‌ స్కోరర్‌ అక్షర్‌ పటేల్‌ (185) అంటే బ్యాటర్లు సిరీస్‌లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. రోహిత్‌తో కలిసి యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభాన్నివ్వాలని జట్టు ఆశిస్తోంది. ఇక లోయర్‌ ఆర్డర్‌లో అక్షర్‌తో పాటు జడేజా, అశ్విన్‌ అంత తేలిగ్గా వికెట్‌ ఇస్తుండకపోవడం భారత్‌కు కలిసొచ్చే విషయమే. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌.. ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమిని జట్టులోకి తీసుకోనుంది. అతడు ఉమేశ్‌ యాదవ్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకోవచ్చు. మార్చి 17న ఆరంభమయ్యే వన్డే సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న సిరాజ్‌కు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. వికెట్‌కీపర్‌ స్థానం కోసం ఇషాన్‌ పోటీపడుతున్నాడు. అయితే బ్యాటుతో అనుకున్నంతగా రాణించకపోయినా భరత్‌కు మరో అవకాశం లభించవచ్చు.

ఉత్సాహంగా ఆసీస్‌: రెండు పరాభవాల తర్వాత ఇందౌర్‌లో విజయం కచ్చితంగా ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ బాగానే కనిపిస్తోంది. గత రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ భారత టాప్‌ ఆర్డర్‌ కన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇందౌర్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 60 పరుగులు చేసిన ఖవాజా అదే ఫామ్‌ను కొనసాగించాలని ఆసీస్‌ ఆశిస్తోంది. అలాగే లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, హ్యాండ్స్‌ కాంబ్‌, గ్రీన్‌ బ్యాటుతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కుప్పకూలుతున్న లోయర్‌ ఆర్డర్‌ మాత్రం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశమే. ఈ విషయంలో భారత్‌ మెరుగు. ఒకవేళ లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలకుండా చూసుకుంటే ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు కష్టమే. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. బౌలింగ్‌ కూడా సమతూకంగానే ఉంది. ఆ విభాగంలోనూ మార్పులు ఉండకపోవచ్చు.


పిచ్‌ ఎలా ఉందంటే

 

తొలి మూడు టెస్టుల్లో పిచ్‌లు విపరీతంగా సహకరించిన నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా మొతేరా పిచ్‌ ఎలా ఉందన్నదానిపైనే నిలిచింది. ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులోనైతే పిచ్‌ మొదటి రోజు నుంచే స్పిన్నర్ల హవా నడించింది. పిచ్‌ పేలవమని రిఫరీ ఐసీసీకి నివేదిక కూడా ఇచ్చాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటీ మూడో రోజు దాటలేదు.  అయితే సిరీస్‌ ఆరంభం నుంచి స్పిన్‌ దెబ్బకు విలవిల్లాడిన బ్యాటర్లకు నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ కాస్త ఊరటనిస్తుందని అంచనా. బంతి విపరీతంగా తిరగకపోవచ్చు. తొలి రోజైతే పిచ్‌ పూర్తి ఫ్లాట్‌గా ఉండొచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు.     ‘‘సిరీస్‌లో ఇదే అన్నింటికన్నా ఫ్లాట్‌ పిచ్‌లా కనిపిస్తోంది. ఆట తొలి రోజు చాలా ఫ్లాట్‌గా ఉండబోతోంది’’ అని చెప్పాడు. అయితే వేడి వల్ల పిచ్‌ నెర్రెలు వచ్చి పిచ్‌ క్రమంగా    స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలిపాడు.

 


403

 

తొలి మూడు టెస్టుల్లో నంబర్‌ 7 నుంచి 11 వరకు ఉన్న భారత బ్యాటర్లు 25.18 సగటుతో చేసిన పరుగులు. ఆసీస్‌ నంబర్‌ 7-11 బ్యాటర్లు 6.36 సగటుతో కేవలం 140 పరుగులే చేశారు.

 


48

అహ్మదాబాద్‌లో గత రెండు టెస్టుల్లో పడ్డ 60 వికెట్లలో స్పిన్నర్లు పడగొట్టిన వికెట్లు. అక్షర్‌ పటేల్‌ మూడు సార్లు అయిదు వికెట్ల ఘనత సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని