jasprit bumrah: బుమ్రా స్థానంలో షమీ?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్‌

మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. దీంతో జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనే విషయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

Published : 05 Oct 2022 14:14 IST

దిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. దీంతో జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి విషయం తెరపైకి వచ్చింది. బీసీసీఐ ఇంకా దీనిపై స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పేసర్‌ మహమ్మద్‌ షమీని అతడి స్థానంలో ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ అంశంపై టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందిస్తూ.. ‘‘బుమ్రా స్థానంలో ఎవరుంటారనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. మాకింకా అక్టోబర్‌ 15 వరకు సమయం ఉంది. స్టాండ్‌బై ఆటగాళ్లలో షమీ ఒకడైనప్పటికీ అతడు ఈ సిరీస్‌లో ఆడలేకపోవచ్చు. 14-15 రోజుల పాటు కొవిడ్‌తో పోరాడిన అతడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. అది ఎన్సీఏ ధ్రువీకరించిన తర్వాతే మేమైనా, సెలెక్టర్లైనా ఓ నిర్ణయానికి రాగలం. ఎవరు ఆడినా తన ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు మేలు చేయగలిగితే చాలు. ఒక ఆటగాడి నుంచి మేం కోరుకునేది అదొక్కటే’’ అంటూ మంగళవారం మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో ద్రవిడ్ వివరించాడు.

చివరి టీ20 మ్యాచ్‌లో జట్టు వైఫల్యం, డెత్‌ ఓవర్లలో తడబాటుపై ద్రవిడ్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఆటతీరును మెరుగుపరుచుకునే కృషి చేస్తున్నామని తెలిపాడు. డెత్‌ ఓవర్లలో ఆడటం అంత తేలిక కాదన్నాడు. టీమ్‌ఇండియాకే కాదు బౌలింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆసీస్, సఫారీ జట్లకు సైతం డెత్‌ ఓవర్లలో గట్టెక్కేందుకు పోరాడాల్సి వస్తోందని గుర్తుచేశాడు. హర్షల్‌ పటేల్‌ పునరాగమనంపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని