IND vs PAK : వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌కు పాక్‌ రానుందా..? బాబర్‌ అజామ్‌ ఏమన్నాడంటే..?

ఈ ఏడాది మెగా టోర్నీలైన ఆసియా కప్(Asia Cup 2023)‌, వన్డే ప్రపంచకప్‌‌(ODI World Cup 2023)లు ఉన్నాయి. అయితే ఆసియా కప్‌ కోసం పాక్‌కు వెళ్లేది లేదని భారత్‌ స్పష్టం చేయగా.. తామూ భారత్‌కు వచ్చేది లేదని పాక్‌ వెల్లడించింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(Babar Azam) చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Updated : 05 Mar 2023 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పాక్‌ - భారత్‌ (IND vs PAK)ల మధ్య ఆసియా కప్‌ (Asia Cup 2023) వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్‌పై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాయాది దేశంలో నిర్వహించే ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లు పాక్‌కు వెళ్లరని గత ఏడాది బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా(Jay Shah) స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా తమ ఆటగాళ్లూ భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో ఆడరని పీసీబీ(PCB)తో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు తెలిపారు. దీంతో ఆసియా కప్‌ వేదిక మార్పుపై కూడా చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(Babar Azam).. అక్టోబర్‌ - నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ పాల్గొనే అంశంపై పరోక్షంగా స్పందించాడు. ప్రస్తుతం ‘పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌’(PSL) మ్యాచ్‌లతో బిజీగా ఉన్న బాబర్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నాడు.

‘‘మేం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌పై దృష్టి కేంద్రీకరించాం. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన ఇవ్వడానికి  కృషి చేస్తున్నాం’’ అంటూ బాబర్‌ వెల్లడించాడు. ‘‘రిజ్వాన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించేందుకు నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే టాప్‌ ఆర్డర్‌లో మాది మంచి కాంబినేషన్‌. కానీ.. అన్ని మ్యాచ్‌ల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇద్దరు ఆటగాళ్లపైనే జట్టు ఆధారపడకూడదు. అయితే.. జట్టును విజయతీరాలకు నడిపించే ఎంతో మంది ఆసక్తి ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పాక్‌ కెప్టెన్‌ వివరించాడు.

చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీసులు ఆడటం లేదన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లలో తటస్థ వేదికలపైనే ఇవి తలపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని